#


Index

కర్మసన్యాస యోగము భగవద్గీత


యే హి సంస్పర్శజా భోగా దుఃఖయోనయ ఏవ తే |
ఆద్యంతవంతః కౌంతేయ న తేషు రమతే బుధః || 22 ||

  బాహ్య విషయాలతోడి సాంగత్యం తాత్కాలికమైన అల్పమైన సుఖాన్ని ఇస్తాయని మాత్రమే గాదు వాటి నుంచి మనసు మళ్లించ వలసిందని హెచ్చరించటం ఇంకా ఒకటుంది వాటిలో కానరాని దోషం. దుఃఖ యోనయ ఏవతే- దుఃఖాన్నే చివరకుతెచ్చి నెత్తిన పడేస్తాయవి. సుఖాభాసేకాని నిజమైన సుఖం కాదది. కారణం. అవే అసలు ఆభాస. ఏవి. యే హి సంస్పర్శజా భోగాః - ఇవేవో కనిపిస్తున్నాయి విషయాలు. వీటితో నా ఇంద్రియాలు సంపర్కం పెట్టుకొంటున్నాయి. వీటి మూలంగా నేను భోగ మనుభవిస్తున్నాను- అని మానవుడు మురిసి పోతున్నాడే అవి.

  అవన్నీ అసలు వాస్తవం కావు అవీ కావూ వాటితో మన ఇంద్రియాల కేర్పడే స్పర్శలూ కావు. ఈ చక్షురాదీంద్రియాలూ కావా మాటకు వస్తే. ఈ మొత్తం కలాపమంతా వట్టిదే. వీటి అన్యోన్యవ్యవహార మంత కన్నా వట్టిదే. ఏమి కారణం. ఇవన్నీ ఆభాసే గాని వస్తువుకాదు. వస్తువు స్వతః ప్రమాణమైన ఆత్మ చైతన్యమొక్కటే. తతిమాది ఏదినీవు చూస్తున్నా చేస్తున్నా ఇది దాని తాలూకు ఆభాసే. అది వెలుగైతే ఇది దాని నీడ నీడ వాస్తవ మవుతుందా కనపడుతున్నా వాస్తవం కాదు. ఒక పక్షి పైన పోతుంటే దానినీడ క్రింద నేలమీద కనిపిస్తుంటుంది. అది ఉందంటావా అక్కడ దాని వల్ల ప్రయోజన ముందంటావా. అలాంటిదే శబ్దస్పర్శాది విషయ ప్రపంచం. వస్తు సిద్ధం కాదిది. ప్రతీతి సిద్ధం Apparent notional.

Page 425

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు