కర్మసన్యాస యోగము
భగవద్గీత
ఆత్మ ఏమిటి. శుద్ధం కాకపోవట మేమిటి. నిత్యశుద్ధ బుద్ధ ముక్త స్వభావమని గదా వర్ణించింది శాస్త్రం దాన్ని. అలాంటప్పుడు విశుద్ధాత్మా అనే మాట కర్ధమేమిటి.
ఇదుగో ఇక్కడే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆత్మా ఆత్మ అని చాలాసార్లు వస్తున్నదామాట ఈ శ్లోకంలో. ఇదే గాదు. ఇక మీదట కూడా ఉద్ధరేదాత్మ నాత్మానం - బంధురాత్మా త్మనస్తస్య - యేనాత్మైవాత్మనా జితః - పదేపదే ఈ మాట మనకు భగవద్గీత నూరి పోస్తూనే ఉంటుంది. ఇన్నిమార్లు పునరుక్తి చేస్తున్నదంటే దానికి మనమనుకొన్న అర్ధం ఒక్కటే అర్ధమనుకొంటే సుఖం లేదు. గీతాచార్యుడి దృష్టిలో ఆత్మ అనేదొకటి గాదు. చాలా ఉన్నాయి. అదేమిటి ఇన్ని ఆత్మ లెక్కడి నుంచి వచ్చాయని మనమాశ్చర్య పడనక్కరలేదు. వాస్తవంలో ఇన్ని లేవు. ఉన్నదొకే ఒక ఆత్మ. కాని అలాటి జ్ఞానమున్న వాడికే అది ఏకమనే సత్యం బోధపడు తుంది. అది లేని అజ్ఞానుల దృష్టికా ఒక్క ఆత్మే అనేక రూపాలు ధరించి ఎన్నో ఆత్మలుగా దర్శన మిస్తుంటుంది. అనాత్మను కూడా ఒకడాత్మ అని భ్రమించవచ్చు. దానికే భూతాత్మ అని పేరు. ఒకడీ దేహమే ఆత్మ అనుకోవచ్చు. ఇంకొకడికి బుద్ధే ఆత్మ. విజ్ఞానాత్మ అని పేరు దానికి. ఇంకొకడి దృష్టికి కర్తా భోక్తా అయిన జీవుడే ఆత్మగా భాసిస్తుంటాడు. అదే జీవాత్మ. ఇవన్నీ ఆత్మాభాసలే గాని అసలైన ఆత్మకాదు. అసలైన ఆత్మ ప్రత్యగాత్మ. అది వీటిన్నిటికీ సాక్షి. కేవల జ్ఞానమే అది జ్ఞాతా కాదు
Page 388