#


Index

కర్మసన్యాస యోగము భగవద్గీత

సంన్యాసః కర్మయోగశ్చ నిఃశ్రేయసకరావుభౌ |
తయోస్తు కర్మసంన్యాసాత్ కర్మయోగో విశిష్యతే || 2 ||

  సన్న్యాసమూ యోగమూ అనే మాటలెవరూ సరిగా అర్థం చేసుకోటం లేదు. సన్న్యాసమంటే అన్ని కర్మలూ మానుకొని ఊరకకూచోట మనుకొంటు న్నారు. అలాగే యోగ మంటే అన్ని కర్మలనూ శాస్త్రీయ మైనవీ స్వాభావికమైనవీ సకలమూ నెత్తిన పెట్టుకోటమని భావిస్తున్నారు. అదీ తప్పే ఇదీ తప్పే. పూర్తిగా మానేయటం కాదు సన్యాసమంటే. అది శాస్త్రోక్తమైనా లౌకికమైనా అహంకార మమకారాలు లేకుండా జ్ఞానం కోసమని చేయాలి కర్మ. అదే సన్న్యాసం మా దృష్టిలో. కర్తృ భోక్తృబుద్ధిని సన్న్యసించటం సన్న్యాసం గాని అసలు కర్మనే సన్న్యసించటం కాదు. ఫలిత మాసించకుండా నిర్లిప్తంగా నిష్కామంగా కర్మ చేయటం. అలా చేయటమే కర్మ యోగం కూడా. చేస్తుంటావు కాబట్టి కర్మయోగం. ఫలితం మీద దృష్టి లేకుండా చేస్తావు కాబట్టి సన్న్యాసం. కనుక రెండుగా పైకి కనిపిస్తున్నా వైరుధ్యం లేదు రెంటికీ. రెండూ కలిసి ఒక్కటే. గంగా యమునల లాగా ఒకే నదీ ప్రవాహం.

  ఎటు వచ్చీ మేము వర్ణించిన రీతిలో అర్ధం చేసుకొంటే తేడా రాదు. అలాకాక ముక్కకు ముక్కగా పట్టుకొంటే వస్తుంది తేడా. సన్న్యాస మంటే కర్మలనే పరిత్యజించాలని భావిస్తే పొరబాటే. కాకపోయినా అన్ని కర్మలూ ఎలా సన్న్యసిస్తావసలు. ఏపనీ చేయకుండా ఒక్క క్షణమైనా కూచోగలవా.

Page 375

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు