కర్మసన్యాస యోగము
భగవద్గీత
సృష్టే. సృష్టి అంతా చలనాత్మకమే - మనమున్న ఈ భూగోళం దగ్గరినుంచీ అన్ని గోళాలూ బ్రహ్మాండమైన వేగంతో తిరుగుతున్నాయనే గదా చెబుతున్నారు నేటి శాస్త్రజ్ఞులు. ఇక చలించనిదంటూ ఏముంది. అణువు మొదలు ఆకాశందాకా చలనమే.
ప్రపంచమే చలిస్తున్నపు డందులోనే బ్రతుకుతున్న మన శరీరాలు మాత్రం చలించకుండా ఎలా ఉంటాయి. రైలుబండి చలిస్తుంటే బండిలో కూచున్న మన శరీరాలు చలించక ఏమవుతాయి. నిశ్చలంగా ఉన్నట్టు కనిపించినా అది కనిపించే వరకే. ఎంత చలిస్తున్నదంటే ఈ ప్రపంచ మేమీ చలించటం లేదనేంత వేగంగా చలిస్తున్నది. చలించటం లేదనే భావం స్థితి అయితే చలిస్తున్నదనే భావం గతి. మనలో కూడా చూడండి. మనలో నేననే స్ఫురణ ఒక్కటీ జ్ఞానమైతే - దానికి గోచరిస్తున్న మనసూ ప్రాణమూ ఇంద్రియాలూ శరీరమూ - ఇదంతా చలనాత్మకమైన కర్మే. అలాగైతే సమష్టి మీద పరమాత్మ జ్ఞానమైతే - దానికుపాధి అయిన విశ్వ శరీరమంతా కర్మే.
అంచేత సృష్టినంతా ఒక్కసారి సింహావలోకనం చేసి చూచామంటే నేను నాది అని రెండే రెండు భాగాలు చేయవచ్చు. చేస్తే నేననే భాగం జ్ఞానం. నాదనే భాగమంతా కర్మ. ఇవి రెండే దర్శనమిస్తాయి మనకు. ఇంతకన్నా అదనంగా మరొక భావమంటూ నీవెంత దుర్భిణీ వేసుకొని చూచినా చూడలేవు. అయితే ఇందులో ఉన్న ఒక రహస్యమేమంటే ఇవి రెండుగా కనిపిస్తున్నా వాస్తవంలో రెండు గావు. ఒకే ఒక తత్త్వం Entity.
Page 370