జ్ఞాన యోగము
భగవద్గీత
యదృచ్ఛాలాభసంతుష్టో ద్వంద్వాతీతో విమత్సరః |
సమః సిద్ధావసిద్ధౌ చ కృత్వాపి న నిబధ్యతే || 22 ||
అయినా కర్మ కర్మేగదా తాను కర్తృత్వం వహించకుండా అది ఎలా జరుగుతుంది. అంతో ఇంతో సంకల్పమనేది ఉంటుందిగదా. నిజమే. ఉంటుంది గాని అది నామ మాత్రం. ఉందంటే ఉంది. లేదంటే లేదు. యదృచ్ఛాలాభ సంతుష్టః - ఏది ఎప్పుడు తన కయాచితంగా లభిస్తే అదే తనకు లాభమని దానితోనే సంతృప్తి పడతాడు. ద్వంద్వాతీతః - అంతే కాదు. లాభం కలగలేదే నష్టం వచ్చిందే అని విమత్సరః మాత్సర్యంలేదా బుద్ధికి. సమస్సిద్ధా వసిద్ధాచ - కారణం. ఒకటి సిద్ధించినా సిద్ధించక పోయినా రెండింటినీ సమానంగానే స్వీకరించగలడు.
అలాంటప్పుడే కర్మ చేస్తేనేమట. కర్తృత్వం లేని కర్మ అది. కర్తృత్వం లేదంటే దానికి ప్రతియోగి అయిన భోక్తృత్వం కూడా తొలగిపోయింది. అంచేత రెండు కోరలూ లాగేసిన కాలసర్పం కర్మ. అది ఎలా కాటు వేయగలదు. కృత్వాపి న నిబధ్యతే. పని చేసినా చేయనివాడే. ఆ దృష్టితో ఉన్నప్పుడా కర్మ వాడినే మాత్రమూ బంధించలేదు. కర్తృ భోక్తృ సంసర్గమే బంధం. అవి రెండూ సాక్షిరూపంగా మారినప్పుడు బంధకమే కాదు జ్ఞానికి. భగవత్పాదు లింతకుముందు కన్నా ఇంకా విపులంగా వర్ణిస్తున్నారు జ్ఞాని దినచర్యను.
Page 329