జ్ఞాన యోగము
భగవద్గీత
గుణ కర్మ లంటే వ్యాఖ్యానిస్తున్నారు భాష్యకారులు. సత్త్వ రజస్తమో గుణాలే ఇక్కడ గుణాలు. ఆ గుణాల కనుగుణంగా శాస్త్రం వారి వారికి విధించినవి కర్మలు. బ్రాహ్మణుడికి శమదమాదులు తపః స్వాధ్యాయాదులూ క్షత్రియుడికి శౌర్యతేజః ప్రభృతులూ. వైశ్యుడికి కృషి గోరక్షాదులూ శూద్రుడికి శుశ్రూషాదులూ- ఇలాటివి.
కాని మన ప్రశ్నకు పూర్తిగా రాలేదు సమాధానం. వారి వారి గుణకర్మలే Character ant Conduct కారణంగాని వైషమ్యానికి నేను గాదని ఎంత తప్పించుకొందా మనుకొన్నా తప్పించుకోలేడు పరమాత్మ. ఎందుకంటే మానవుణ్ణి సృష్టించింది తానేనని ఒప్పుకొన్నాడు. అలా ఒప్పుకొంటూనే వారి గుణకర్మలకు నేను బాధ్యుణ్ణి కానంటున్నాడు. ఇది న్యాయమేనా. మానవుణ్ణి సృష్టించాడంటే వాడి గుణాలూ కర్మలూ కూడా తానేగా సృష్టించినవాడు. తానుగాక మరెవ రున్నారు వాటిని సృష్టించటానికి. ఈ ప్రశ్న వస్తుందని ముందుగా పసిగట్టాడో ఏమో తస్య కర్తార మహిమాం విద్యకర్తార మవ్యయ మని మరలా తప్పుకొంటున్నాడు. అసలు వాణ్ణి నేను సృష్టిస్తేగదా వాడి గుణకర్మలకు నేను బాధ్యత వహించేది. వాణ్ణి అసలు నేను సృష్టించలేదు. దానికి నేను కర్తనే కాను. మరి కర్తనని ఇంతకు ముందే గదా ఒప్పుకొన్నారు. చాతుర్వర్ణ్యం మయా సృష్టమని మీరేగా నాలుగు వర్ణాలనూ స్వయంగా సృష్టించానని ఒప్పుకొన్నది. ఇంతలో మాట మారుస్తా రేమిటి. సర్వజ్ఞుడూ సర్వశక్తుడూ అయినవాడు మాట మార్చవచ్చునా.
Page 306