జ్ఞాన యోగము
భగవద్గీత
అయితే ఒక చిన్న ప్రశ్న అడుగుతున్నారు గురువుగారు. రాగద్వేషాలు లేనివాడు గదా ఈశ్వరుడంటే. వాడు మానవులందరికీ అన్ని కోరికలూ తీర్చటానికి సమర్థుడు గదా. అలాంటప్పుడు సర్వమూ వాసుదేవుడనే జ్ఞానం సంపాదించి ప్రతి ఒక్కడూ మోక్షమే కోరి ఆ పరమాత్మ నెందుకు పట్టుకోటం లేదు. అని అడిగితే ఇప్పుడీశ్వరుడే ఇస్తున్నాడు సమాధానం.
కాంక్షంతః కర్మణాం సిద్ధిమ్. సాధారణంగా మానవులలో ముప్పాతిక మంది కొక బలహీనత ఉంది. అదేదో కాదు. ఏదేదో కోరిక పెట్టుకొంటారు. ఆ కోరికలకు అనుగుణంగా ఆయా కర్మ లాచరిస్తుంటారు. వాటికి తగిన ఫలితం వెంటనే వచ్చి ఒళ్లో పడితే బాగుండునని ఎక్కడలేని ఆశ పెట్టుకొని బతుకుతుంటారు. యజంత ఇహ దేవతాః - తామాసించిన ఫలం తమకు కలగాలంటే అది తనుకంద జేయవలసిన వారు దేవతలేనని వారెక్కడో లోకాంతరాలలో ఉండి కనిపెట్టి చూస్తున్నారని వారికోసం యజ్ఞయాగాదులు చేస్తే అవి తమకు అనుగ్రహిస్తారని వారిని సేవించలేక సతమత మవుతుంటారు.
క్షిప్రం హి మానుషే లోకే సిద్ధి ర్భవతి కర్మజా అసలొక రహస్య మేమంటే ఆయా కర్మ లాచరిస్తూ పోతే ఈ మానవలోకంలో సిద్ధి అనేది చాలా శీఘ్రంగా కలుగుతుంది. అంతవరకూ హామీ ఇవ్వగలను. అంత త్వరగా ఫలితం కలుగుతుంది. అది దేవతలే ప్రసాదిస్తారనీ శాస్త్రం చెబుతున్నది. తమ బుద్ధులకు కూడా అలాగే తోస్తుంటుంది మానవులకు.
Page 303