#


Index



జ్ఞాన యోగము భగవద్గీత

  పోతే ఈ జ్ఞాన యోగమిప్పుడు క్రొత్తగా ఆవిర్భవించింది కాదు. ఎప్పటినుంచో అను స్యూతంగా వస్తున్నది. బహవః ఎంతోమంది పూర్వం వీగరాగ భయక్రోధాః - రాగ ద్వేషాలూ వాటి వల్ల ఏర్పడే భయోద్వేగాలూ - వీటన్నిటికీ స్వస్తి చెప్పి కేవలం సత్త్వ గుణ సంపన్నులయి మన్మయాః - ఈశ్వరా భేదదర్శినః అని అర్థం వ్రాస్తున్నారు స్వామివారు. ఈశ్వర స్వరూపులమే మేమని అభేద భావనతో మాముపాశ్రితాః - కేవల జ్ఞాన నిష్ఠులయి జ్ఞాన తపసాపూతాః - జ్ఞానమే ఒక తపస్సుగా ఆచరించి దానితో పూతాః పరిశుద్ధులయి మద్భావ మాగతాః - మద్భావమంటే ఈశ్వర భావం మోక్షమని భాష్యం. మోక్షమే పొందగలిగారట వారందరూ. జ్ఞానంతోనే ముక్తులయి పోయారు. మోక్షానికి సాధనం పరమాత్మ జ్ఞానం తప్ప మరేదీ లేదని ఘంటా పధంగా చెబుతున్నది గీత.

  మరి తపస్సంటున్నదే అదేమిటి. జ్ఞానమే తపస్సు మరేదీ గాదు. ఇతర తపోనిరపేక్ష జ్ఞాననిష్ఠా ఇత్యస్య లింగం జ్ఞాన తపసా ఇతి విశేషణం అని భాష్యం వ్రాస్తున్నారు గురువుగారు. మిగతా తపస్సు లెన్నైనా మీరు విని ఉండవచ్చు గ్రంధాలలో. అవి ఏవీ మోక్షానికి సాధనాలు కావు. ఇక్కడ జ్ఞాన తపస్సంటున్నది గీత గుర్తించండి. ఇదే నిదర్శనం మనకు జ్ఞానేతరమైన తపస్సేదీ మార్గం కాదని. అవి శరీరేంద్రియ శోషణానికేతప్ప మోక్షానికి పనికిరావు. హఠయోగం క్రిందికి వస్తాయవి. మహా అయితే అణి మా ద్యష్ట సిద్ధు లార్జించటానికి తోడుపడవచ్చు. అది యోగమే

Page 299

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు