#


Index



జ్ఞాన యోగము భగవద్గీత

  బ్రహ్మ వేద బ్రహ్మైవ భవతి. బ్రహ్మమే తానని గుర్తిస్తే చాలు బ్రహ్మమే అయిపోతాడీ జీవుడని ఉపనిషత్తు ఘోషిస్తున్నది. అనుష్ఠానం లేదిక్కడ. జ్ఞానమే అయిపోవటం.

  త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి - మామేతి. అలా అయిపోయాడంటే వాడే ఇక బ్రహ్మం గనుక బ్రహ్మానికి జన్మ ఎలా లేదో దేహ బంధమెలా లేదో అలాగే బ్రహ్మభూతుడైన జీవుడికీ లేవు. ప్రారబ్ధం తీరి ఈ దేహాన్ని వదిలేశాడంటే ఇక మరలా ఒక జన్మ ఎత్తటంగాని శరీరాన్ని ధరించటంగాని ఉండబోవు. జన్మను పొందటానికి మారుగా పరమాత్మ నైన నన్నే పొందుతాడని హామీ ఇస్తున్నాడు కృష్ణభగవానుడు. ఇప్పుడర్ధ మవుతుంది మనకు ఎవరికీ జననమరణాలు లేవు అని ఎందుకు చెప్పాడో పరమాత్మ. గుర్తిస్తే లేదని అర్ధం చేసుకోవాలి మనం. గుర్తించే జ్ఞానికి లేవని. గుర్తించని అజ్ఞానికే ఉన్నాయి. అది కూడా వాస్తవం కాదు. ఆభాసగానే. అంతేకాదు. మరలా ఈ బంధం లోనుంచి బయటపడాలంటే ఏ కర్మానుష్ఠానమో ఏ ఉపాసనో ఏ యోగాభ్యాసమో కాదు మార్గం. కేవలమా పరిపూర్ణ జ్ఞానమే నా స్వరూపం ఈ శరీరాది సంఘాతం కాదనిపూర్తిగా అవగాహన చేసుకోటమే ఏకైక సాధనమని కూడా తేటపడుతున్నది.

వీతరాగభయక్రోధా మన్మయా మాముపాశ్రితాః |
బహవో జ్ఞానతపసా పూతా మద్భావమాగతాః || 10 ||

Page 298

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు