జ్ఞాన యోగము
భగవద్గీత
ఇమం వివస్వతే యోగం ప్రోక్త వానహ మవ్యయమ్. ఇదుగో అర్జునా ఈ యోగాన్ని నేను మొదట సూర్యుడి కుపదేశించాను. అవ్యయమైన యోగమిది. చూచారా భగవానుడి మాట. యోగమని ఏకవచనంలో పేర్కొంటున్నాడు. ఒకవేళ విషాదం గాక పోయినా సాంఖ్యం కర్మ రెండు యోగాలు గదా గడచిపోయా యిప్పటికీ. రెండు యోగాలు జరిగిపోతే తాను చెప్పింది ఒకే యోగమంటా డేమిటి. భగవత్పాదు లేమంటున్నారో తెలుసా. యోయం యోగః అధ్యాయ ద్వయే నోక్తః రెండధ్యాయాలలో చెప్పిందీ ఒకే యోగమది ఏదోగాదు. జ్ఞాననిష్ఠా లక్షణః కర్మయోగోపాయః కర్మయోగమనే సాధనంతో కూడిన జ్ఞానయోగ మంటాడాయన. గంగా యమునల లాగా అది ఒకే ఒక ప్రవాహం. జ్ఞాన ప్రవాహం. అందుకే సాంఖ్యబుద్ధి యోగ బుద్ధి అని రెండింటికీ బుద్ధి అనే మాట తగిలించాడు చివర. బుద్ధి అంటే జ్ఞానమే.
ఇలాటి జ్ఞానయోగాన్ని మొట్టమొదట కృష్ణభగవానుడే సూర్యునికు పదేశించాడట. నిజమే నారాయణం పద్మభువమ్మని గదా గురుపరంపర. సాక్షాత్తూ నారాయణుడే గదా కృష్ణుడు. ఆ నారాయణుడు ఉపదేశించాడు సూర్యనారాయణుడికి. ఎలాంటి దాయోగం అవ్యయం. వ్యయమంటే మారిపోయేది. నశించిపోయేది. అది భౌతికమైతే జరుగుతుంది గాని అభౌతికమైన జ్ఞానాని కా బాధ లేదు. నిత్యనూతన మది పరమాత్మలాగా. కాగా ఆ సూర్యుడు మరలా గురుస్థానంలో కూచొని మనవే ప్రాహ.
Page 278