కర్మ యోగము
భగవద్గీత
శ్రేయోదాయకమది. అది విగుణమని మానేయగూడదు గుణం లేని దేదో అది విగుణం. వాడి దృష్టిలో గుణం లేదని భావిస్తున్నాడు గాని నిజంలో గుణం లేనిది కాదది. గుణం లేనిదైతే శ్రేయస్సు కలగదు దానివల్ల. కాబట్టి విగుణమని అపోహ పడకుండా ఆచరించాలెవడి ధర్మం వాడు.
పరధర్మాత్ స్వనుష్ఠితాత్ - అంతేగాని పరులకు విధించిన ధర్మంలో తాను వేలు పెట్టరాదు. దీనికంటే అది ఎంతో బాగుంది నాకు అదే అనుకూలమని దాని వెంటబడరాదు. స్వనుష్ఠితాత్. అది తాను ఎంత నేర్పుతో అనుష్ఠించినా ఫలిత మివ్వదు. సత్ఫలితం లేకపోగా దుష్ఫలిత మిచ్చినా ఇవ్వవచ్చు. ఇంతెందుకు. స్త్రీ ధర్మం పురుషుడు చేసినా తప్పే. పురుషుడి ధర్మం స్త్రీ చేసినా తప్పే. ఒక విద్యార్ధి ధర్మం విద్యాభ్యాసం. అది మానేసి రాజకీయాల్లో తిరిగా డనుకోండి. సరియైన వయసులో చదువు కోక పాడయిపోతాడు. ఒక ఉపాధ్యాయుడు చదువు చెప్పటం మానేసి వ్యాపారం కూడా చేస్తూ పోయాడనుకోండి. ఉద్యోగంలో నుంచి తీసేస్తారు. అలాగే ఒక కూలివాడు కూలిపని మానినా తప్పే. యజమాని కూలిపనికి దిగినా తప్పే. ఎవడి పనివాడు చేయటమే మంచిది. అలా చేస్తూ పోతే అందరూ తమ తమ కృషి చేసి సామూహికంగా సమాజాభ్యుదయానికి తోడుపడవచ్చు. వ్యక్తిగతమైన జీవితమూ నిరాటంకంగా సాగిపోగలదు.
స్వధర్మే నిధనం శ్రేయః - స్వధర్మ మాచరిస్తూ అందులో దైవికంగా కన్నుమూశాడే అనుకోండి. అయినా వచ్చిన ఉపద్రవ మేమీ లేదు. ఎప్పుడైనా ఎక్కడైనా ఏ పని చేస్తున్నా కాలం దీరితే కన్నుమూయ వలసిందే.
Page 261