కర్మ యోగము
భగవద్గీత
రెచ్చగొట్టే వరకే ప్రారబ్ధానికి హద్దు. అంతకు మించి మన ప్రవర్తన వరకూ ప్రభావం చూపలేదది. మనమా పనిలో ప్రవర్తించనూ వచ్చు. మానుకోనూ వచ్చు. అది మన విమర్శ మీద ఆధారపడి ఉంటుంది. ఈ విమర్శే మానవ ప్రయత్నం. ప్రతిపక్ష భావన అనిపేరు పెట్టారు దీనికి భాష్యకారులు. రాగద్వేషాలకు ప్రతిపక్ష ముదాసీనత. అది మనచేతిలో ఉంది. అంచేత మానవుడు బుద్ధి జీవుడయినందుకు తన వివేక జ్ఞాన ముపయోగించుకొని ఏది హితమో ఏది అహితమో ఆలోచించి పనిచేస్తూ పోవాలి. లేకుంటే రాగద్వేషాలు చెప్పినట్టు చేసి దెబ్బతినవలసి వస్తుంది. తేహ్యస్య పరి పంధినౌ. అసలీ రాగద్వేషాలే మన పాలిటికి దొంగలు. దారి దోపిడీ దొంగలు. పరిపంధులంటే అదీ అర్ధం. తస్కరా వివపధి అని వ్రాశారు గురువుగారు. శ్రేయోమార్గంలో అడ్డుతగలటమే అవి చేసే తస్క రత్వం. తస్కరులేమి చేస్తారు. మన దగ్గర ఉన్న డబ్బూ డాలకం దోచుకొంటారు. ఇక్కడ కూడా అదే. మానవుడి కంతో ఇంతో ఉన్న జ్ఞాన ధనాన్ని కాజేస్తాయి ఈ రాగద్వేషాలనే గజదొంగలు. ఇదీ విషయం.
ఇవి రెండూ చాలా విలువైన శ్లోకాలు. ప్రారబ్ధమా ప్రయత్నమా అని మీమాంస వస్తే అంతా ప్రారబ్ధమూ గాదు. అంతా ప్రయత్నమూ గాదని జవాబు. ప్రారబ్ధం గతానికి సంబంధించినదైతే ప్రయత్నం భవిష్యత్తుకు చెందినది. మన మిప్పుడు భూతంలో లేము. భవిష్యత్తులో లేము. వర్తమానంలో బ్రతుకుతున్నాము. కర్తా భోక్తా అన్నారు మనలను. భోక్తలం కాబట్టి ప్రారబ్ధ ఫలమిప్పు డను భవిస్తుంటాము. కర్తలం కూడా గనుక భవిష్యత్ఫలమైన జ్ఞానానికీ మోక్షానికీ ప్రయత్నిస్తుంటాము.
Page 259