#


Index

కర్మ యోగము భగవద్గీత

సక్తాః కర్మణ్యవిద్వాంసో యథా కుర్వంతి భారత |
కుర్యాద్విద్వాంస్తథాసక్తశ్చికీర్షుర్లోకసంగ్రహమ్ || 25 ||

  అసలు కర్మయోగమని చెప్పామే అది చాలా మంచి శిక్షా మార్గం సాధకుడికి. సాధించవలసింది చివర కాత్మజ్ఞానమే అయినా అది కర్మయోగం ద్వారానే కలగాలి. మరో మార్గం లేదు. కర్మయోగమన్న మాత్రాన అది కర్మానుష్ఠానమని ఎప్పుడూ భ్రమపడరాదు. అనుష్ఠానం జ్ఞానానికే మాత్రమూ తోడ్పడదు. కారణ మందులో సమష్టి దృష్టి లేదు. వ్యష్టి చింతనే ఉంటుంది అందులో. నేను అనే అహంకారమూ నాకోసమనే మమకారమూ తప్పనిసరి కర్మాచరణలో. అది వదలకుండానే ఎంతో పట్టుదలతో చేస్తుంటాడు వాడా పని. సమష్టి జ్ఞానం లేదు కాబట్టి వాడు విద్వాంసుడు కాడు. అవిద్వాంసుడు. అజ్ఞాని.

  సక్తాః కర్మణ్యవిద్వాంసో యధా కుర్వంతి ఇలాంటి అజ్ఞాని అయినవాడు తన విధ్యుక్త కర్మలెలా ఫలాసక్తితో క్రమం తప్పకుండా చేస్తాడో. కుర్యాద్విద్వాం స్తధా సక్తః - జ్ఞాని అయిన వాడు కూడా అలాగే అనాసక్తితో అంత పట్టుదలగా సాగించాలి కర్మయోగం. కర్మయోగమైనా కావచ్చు ఇది. జ్ఞానయోగమైనా కావచ్చు. కర్మయోగమైతే ఈశ్వర దృష్టి వదలకుండా చేసి చివరకాత్మ జ్ఞానం సంపాదిస్తాడు. అలా కాక ఆత్మజ్ఞాని అయితే ఈశ్వరుడు కూడా తన కాత్మ స్వరూపుడే కాబట్టి సర్వత్రా ఆత్మనే చూస్తూ ప్రారబ్ధం తన కప్పగించిన కర్మ ఎంతో అంత సాధిస్తూనే ఉంటాడు. మొత్తం మీద ఇద్దరూ అనాసక్తులే.

Page 247

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు