కర్మ యోగము
భగవద్గీత
చికీర్షు ర్లోక సంగ్రహమ్. ఇప్పుడీ జ్ఞాని కేవల మనాసక్తుడే గాక లోక సంగ్రహార్ధం కూడా కర్మ చేయవచ్చు. కర్మయోగికి Port folio లేదు. జ్ఞాన యోగికి మాత్రమే ఇది. ఎందుకంటే కర్మయోగి కర్మ సత్త్వశుద్ధికీ జ్ఞానప్రాప్తికే చేస్తుంటాడు. వాడికదే ప్రయోజనం. జ్ఞానికిక శుద్ధి ప్రాప్తి అనే ప్రమేయం లేదు కాబట్టి వాడి ప్రయోజనమిక లోక సంగ్రహమే. ఇదీ మనమిక్కడ గుర్తుంచుకో వలసిన సూక్ష్మం.
న బుద్ధిభేదం జనయేదజ్ఞానాం కర్మసంగినామ్ |
జోషయేత్ సర్వకర్మాణి విద్వాన్ యుక్తః సమాచరన్ || 26 ||
ఇంకొక మాట. జ్ఞాని అయిన వాడు లోకసంగ్రహం చేసే పని పెట్టుకొన్నప్పు డొక విషయం గుర్తుంచుకో వలసి ఉంది. చేయమన్నారు గదా అని మూకుమ్మడిగా అందరినీ తన మార్గానికి బలవంతంగా మరల్చటానికి పూనుకోగూడదు. తాను చెప్పింది వినేవారుంటారు. పెడచెవిని బెట్టే వారుంటారు. లోకులందరిదీ ఒకే స్వభావం కాదు గదా. ఎవరి మతం వారిదే. అందులో కొంతమంది తమ మతమెంత రెటమతమైనా అదే కరెక్టని వాదించే వారుంటారు. అంతకుమించి మంచి చెప్పినా ఆలకించే వివేచన ఉండదు వారికి. కనుకనే భగవానుడు జ్ఞానులను హెచ్చరిస్తున్నాడు. న బుద్ధి భేదం జనయే దజ్ఞానం కర్మసంగినాం. తమకేది హితమో తెలియక యావజ్జీవం హోష్యామి అని కర్మానుష్ఠానం లోనే తల మునక లయిన వారి జోలికి వెళ్లవద్దు. మంచో చెడ్డీ వారొక లక్ష్యం పెట్టుకొని జీవితానికి అదే
Page 248