#


Index

కర్మ యోగము భగవద్గీత

పరిష్కార మేమంటే సర్వమూ ఆత్మ స్వరూపమనే జ్ఞాన ముదయించిన వాడి కిదేదీ లేదు. స్వర్గం లేదు. దేవతలు లేరు. వారికీ మానవులు ఋణపడటం లేదు. అది తీర్చుకోటానికి యజ్ఞాదులు చేయనక్కర లేదు. అసలది బోధించే వేదాలు లేవు. అదంతా ఆత్మ స్వరూపమే వాడికి.

  పోతే అలాటి అఖండాత్మ జ్ఞానమింకా ఉదయించ నంతవరకూ వాడి దృష్టిలో ఉందీ వ్యవహారమంతా. అందుకే దీనికి వ్యావహారిక సత్యమని పేరు పెట్టారు వేదాంతులు. భేదదృష్టితో వ్యవహరిస్తున్నంత వరకూ ఉన్నట్టు చూస్తాడు కాబట్టి వ్యావహారికం. వ్యావహారికమే గాని పారమార్ధికం కాదిది. రజ్జు సర్పం లాంటిది. సర్పమని భ్రమించినంత వరకే సర్పం మనకు యధార్ధం. రజ్జు వనేజ్ఞానం కలిగితే చాలు అది ఎగిరి పోతుంది. ఒక స్వప్నంలాంటిదని కూడా అనుకోవచ్చు. స్వప్న ప్రపంచ మిప్పుడు సత్యమా కాదా చెప్పండి. అది ఎంత కాలముందని చూస్తామో అంత కాలమూ అది సత్యమే. మెళకువ వచ్చిందో అంతా అబద్ధమే. అలాగే ధర్మ పురుషార్ధానికి సంబంధించిన ఈ వర్ణన కూడా ఒక వ్యావహారిక సత్యమే. పారమార్ధికం కాదు. పరమార్ధ మాత్మ స్వరూపమే. అలాటి ఆత్మ జ్ఞాన ముదయించిందో ఇది లేదు. అంతా స్వప్నంలాగా తేలిపోతుంది.

  అయితే మరి పారమార్ధికమైన దృష్టితో దీని నెలా సమన్వయిస్తారని అడిగితే కొంత లోతుకు దిగి చూడాలి మనం గీతా హృదయం. అన్నమంటే పృధివి. పర్జన్యమంటే జలం. యజ్ఞమంటే అగ్నిహోత్రాదికంతో ముడిపడి ఉంది కాబట్టి అది తేజస్సు. కర్మ అంటే చలనాత్మకం కనుక వాయుతత్త్వం.

Page 234

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు