కర్మ యోగము
భగవద్గీత
ఈ దేవత లెవరండీ. వారిని మన మారాధించట మేమిటి - వారు మనకన్నీ ప్రసాదించట మేమిటని సందేహమా. అలాటి సందేహా లేవీ పెట్టుకోకండి. మీరీ భూలోకంలో బ్రతికే మానవులైతే వారీ భూలోకం కన్నా అతీతమైన భువస్సువరాది ఊర్ధ్వలోకాలలో నివసించే దివ్య శరీరధారులు. మీ మానవుల శక్తి కన్నా ఎన్నో రెట్లు అతీతమైన శక్తి వారిది. అలాటి శక్తి సంపన్నులను యజ్ఞభావితాః - యజ్ఞం ద్వారా మీరు సేవిస్తే వారు ప్రసన్నులై ఇష్టాన్ భోగాన్ హి వో దేవా దా స్యంతే. మీకిష్టమైన సకల భోగాలనూ మీకు ప్రసాదించటానికి వారు సమర్థులు. తప్పకుండా ప్రసాదిస్తారు.
తై ర్దత్తా నప్రదాయైభ్యో - అయితే ఒక్కమాట. వారలా ప్రసాదించిన స్త్రీ పశుపుత్ర గృహక్షేత్రాది సంపద నంతా వారి ఋణం తీర్చకుండా కేవలం స్వార్ధబుద్ధితో అనుభవిస్తూ పోయారంటే స్తేన ఏవసః అది దొంగ బతుకే మానవులకు. దొర బతుకు కాదు. దొంగ బతుకెలా అయిందని అడుగుతారేమో. దేవస్వాపహారీ అని వ్రాస్తున్నారు భాష్యకారులు. దేవస్వమంటే దేవతల సొమ్ము. అది గదా వారిస్తే నీవు తింటున్నావు. ఇస్తేనే గదా తింటున్నానని అడగవచ్చు నీవు. తినటంలో తప్పులేదు. కాని వారు చేసిన దానికి మారు చేయకుండా అనుభవించటమే నీ తప్పు. అప్పుడది దొంగసొమ్మే గాని నిజాయితీగా నీవు గడించిన సొమ్ముగాదు. కాబట్టి దేవతల ఋణం తీర్చుకోనంత వరకూ ప్రతి మానవుడూ దొంగే. దొర అనిపించుకోలేడు.
Page 226