కర్మ యోగము
భగవద్గీత
ఇది ఇటు ప్రాపంచికమూ అటు పారమార్థికమూ రెండు ఫలితాలనూ యధాశక్తిగా మనకందించే మార్గం. అదీ దీని విశిష్టత.
నియతం కురు కర్మ త్వం కర్మ జ్యాయో హ్యకర్మణః |
శరీరయాత్రాపి చ తే న ప్రసిద్ధ్యేదకర్మణః || 8 ||
అంచేత నియతం కురు కర్మ త్వమ్. అర్జునా నీవు నీకు నియతమైన కర్మ ఏదుందో - శాస్త్రం నీకు చేయమని ఏది విధించిందో అది నీవు చేస్తూ పో. కర్మ జ్యాయో హ్య కర్మణః - ఏ కర్మా చేయకుండా మానేసి కూచోటం కన్నా ఏదో ఒక సత్కర్మ ఆచరించట మనేది చాలా గొప్పదనుకో. శరీరయాత్రాపి చతే న ప్రసిధ్యే దకర్మణః - కర్మ చేయకుండా ఊరక కూచున్నందువల్ల నీవు సాధించే ప్రయోజన మేదీ లేకపోవట మలా ఉంచు. అసలు నీ శరీరం కూడా నిలవదు నీవే పనీ పెట్టుకోకపోతే. శరీరం నిలవాలంటే అన్నపానాలైనా సేవించాలి గదా మానవుడు. ఒక బండికి ఇంధనం Fuel లాంటివవి. ఇంధనం లేకుంటే బండి ఎలా ఒక అంగుళం కూడా ముందుకు నడవదో అలాగే శరీరమనే బండి కూడా ఆహారం పడకపోతే ఎందుకూ పనికిరాదు.
అంతేకాదు. అన్నమయం హి సోమ్యమనః ఆపోమయః ప్రాణః అని చాటుతున్న దుపనిషత్తు. అన్నం తినకపోతే మనసు పని చేయదు. నీరు త్రాగకుంటే ప్రాణం పనిచేయదు. చేయదంటే రెండూ ఆగిపోతాయని అర్థం. అవి రెండూ ఆగిపోతే అది మరణమే మానవుడికి. ఇక బ్రతికే
Page 220