#


Index

కర్మ యోగము భగవద్గీత

దారి తీస్తుంది కాబట్టి దీనికన్నా అది చాలా నికృష్ణమైనది దాని వైపు చూడవద్దని ఆదేశించాడు. ఇదీ భగవత్తాత్పర్యం. అందుకే అక్కడ కర్మ అని మాత్రమే గాక మాఫలేషు - కర్మఫల హేతుర్భూః అనే మాటలు దానికి తగిలించి చెప్పటం. కాగా ఇక్కడ దానికి యోగమనే మాట చేర్చి సూటిగానే కర్మయోగమనే మాట సెలవిచ్చారు. ఇక అర్జునుడు గాని మనం గాని అయ్యో కర్మ చేయమంటాడే జ్ఞానమెందుకు చెప్పడా అని పులవటం దేనికి. జ్ఞానాని కెలాగూ సాధనమేగా ఇది. ఇది ఎలాంటిదంటే నేను I.A.S. గదా వెంటనే నాకు కలెక్టరు ఉద్యోగ మెందు కివ్వరా అని అడిగినట్టుంది. కొంతకాలం ట్రైనింగుంటుంది దేనికైనా. అది అయితే ఎందుకివ్వరు తప్పకుండా ఇస్తారు. అలాగే కర్మయోగి కొంతకాలం నిష్కామంగా చేస్తూపోతే చిత్తశుద్ధి ద్వారా జ్ఞానాన్ని అందుకొంటాడు. ఏమిటింత తక్కువగా చూచారు నన్నని వాపోవటం దేనికి.

న కర్మణామనారంభాన్నైష్కర్మ్యం పురుషోఽశ్నుతే |
న చ సంన్యసనాదేవ సిద్ధిం సమధిగచ్ఛతి || 4 ||

  అసలు ఉన్న విషయ మేమంటే అధ్యాత్మ మార్గంలో ఎవరూ తక్కువా గాదు. ఎక్కువా గాదు. మార్గంలో లేకుంటేనే తక్కువ. అది కేవలం యాంత్రికంగా చేసే కర్మకాండ. కాగా కర్మయోగ మలాంటిది గాదు. అది మార్గంలోనే ఉన్నది. జ్ఞానానికది విజాతీయం కాదు. సజాతీయం. ఉత్తమాధికారులకు కాకపోయినా మధ్యమాధికారుల కిది చాలా అవసరం. ఇది లేకపోతే జ్ఞానమనే దానికే నోచుకోలేడు మానవుడు.

Page 210

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు