కర్మ యోగము
భగవద్గీత
బాగా ఆలోచించి బోధించ మంటున్నా డర్జునుడు. ఇప్పుడు దీనికి పరమాత్మ ఇచ్చే సమాధాన మేమిటో విందాం.
లోకేఽస్మిన్ ద్వివిధా నిష్ఠా పురా ప్రోక్తా మయానఘ |
జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినామ్ || 3 ||
లోకేస్మిన్ ఈ లోకంలో నివసించే మానవులందరికీ నేను పురా సృష్ట్యాది లోనే ప్రోక్తా - బోధించాను సుమా. ఏమిటది. ద్వివిధా నిష్ఠా రెండు విధాలైన నిష్ఠ ఏమిటా రెండు విధాలని అడుగుతావేమో. జ్ఞానయోగేన సాంఖ్యానాం - సాంఖ్యబుద్ధి ఉన్నవారికి జ్ఞానయోగం బోధించాను. కర్మయోగేన యోగినాం. యోగ బుద్ధి ఉన్నవారికి కర్మయోగం బోధించాను. సాంఖ్యం యోగమనే మాట లింతకు ముందే వచ్చాయి. వాటి కప్పుడర్ధం కూడా చెప్పాము. సాంఖ్యమంటే జ్ఞానమని - యోగమంటే కర్మ అని. అది సాంకేతిక భాష అయితే ఇప్పుడు దాని వివరణ వింటున్నాము. అప్పటికి సాంఖ్యయోగాలంటే ఏవో గావు. జ్ఞానకర్మలని అర్ధం చేసుకొంటే చాలు సరిపోతుంది.
ఇక్కడ కేవలం జ్ఞానం కర్మ అని పేర్కొనటం లేదు భగవానుడు. రెండింటికీ ప్రక్కన యోగమనే మాటకూడా చేర్చి పేర్కొంటున్నాడు. జ్ఞానా లెన్నైనా ఉండవచ్చు. లోకజ్ఞానం దగ్గరి నుంచి ధర్మజ్ఞానం వరకు అన్నీ జ్ఞానాలే. అవి కావు మాకు కావలసింది. ఆత్మజ్ఞానం. అదే జ్ఞాన యోగం. అలాగే కర్మలు కూడా సవా లక్ష ఉండవచ్చు. సహజ కర్మలు - శాస్త్రోక్త కర్మలు అందులో కూడా నిషిద్ధ కర్మలు - విహిత కర్మలు - కామ్యకర్మలు
Page 207