#


Index

కర్మ యోగము భగవద్గీత

తరువాత జ్ఞానయోగమని. ఇప్పుడీ మూడవ అధ్యాయం కర్మయోగమైతే దీని తరువాత నాలుగవది జ్ఞానయోగం. ఆ తరువాత ఈ కర్మయోగాన్ని జ్ఞానయోగంలో కలిపి ఒకే ఒక యోగంగా మార్చి చూపబోతాడు కర్మ సన్న్యాసమనే అయిదవ అధ్యాయంలో. కర్మయోగం చివరకు జ్ఞానయోగంలో చేరిపోవటమే కర్మ సన్న్యాసం. అప్పుడీ కర్మయోగంతో పరిపక్వమైన ఆత్మజ్ఞానమే అఖండంగా సాధకుడి అనుభవానికి రాగలదు. ఇదీ వ్యాసమహర్షి హృదయం. దాని కనుగుణంగానే నడుస్తున్న దాయన రచనా ప్రణాళిక.

  ఇది ఇలా ఉండగా అర్జునుడి కిప్పు డున్నట్టుండి ఒక పెద్ద సందేహం పట్టుకొన్నది. అదేమిటంటే కర్మణ్యేవాధికారస్తే అని కర్మకే నీ వధికారివి కర్మే నీవు చేస్తూ ఉండమని నాకు పురమాయించాడు బావగారు. అలా పురమాయించి వెంటనే దూరేణ హ్యవరం కర్మ బుద్ధి యోగాత్. జ్ఞానం కన్నా కర్మ అనేది చాలా నికృష్ట మయిందని దాన్ని తీసిపారేశాడు. అలాంటప్పుడు ప్రశస్తమైన జ్ఞానమార్గమే నాకుపదేశించకుండా పనికిమాలిన దని ఒక పక్క తానే చెబుతూ అలాటి కర్మ చేయమని నాకు ఆదేశించట మేమిటి. ఎంత అన్యాయమిది అని అతని ఆక్షేపణ. ఈ అభిప్రాయంతోనే స్వామివారిని నిలదీసి అడుగుతున్నా డిప్పుడొక ప్రశ్న.

జ్యాయసీ చేత్ కర్మణస్తే మతా బుద్ధిర్జనార్దన |
తత్ కిం కర్మణి ఘోరే మాం నియోజయసి కేశవ || 1 ||

Page 205

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు