కర్మ యోగము
భగవద్గీత
వాస్తవమే. పైకి చూస్తే అలాగే అనిపిస్తుంది. సాంఖ్యంలో ఆత్మ జ్ఞానానికి సంబంధించిన విషయమే ఉండాలి. దాని కదనంగా కర్మ ఎక్కడా ప్రస్తావించ గూడదు. ఇది మనందరి అభిప్రాయం. కాని వ్యాసమహర్షి అభిప్రాయం వేరు. ఆయన దృష్టిలో జ్ఞానమూ కర్మా ఒకదానితో ఒకటి తెగదెంపులు చేసుకొన్న విషయాలు కావు. మీదు మిక్కిలి రెండింటికీ చాలా సన్నిహితమైన సంబంధముంది. ఇంతకుముందే చెప్పామొక విషయం. కర్మయోగం చిత్తశుద్ధి ద్వారా ఆత్మజ్ఞానానికి దారి తీస్తుందని. అసలా మాటకు వస్తే జ్ఞానమే సాగితే అది కర్మ. కర్మ ఆగితే అది జ్ఞానం. జ్ఞానమంటే ఆత్మ. కర్మ అంటే అనాత్మ. ఒకటి స్వరూపమైతే మరొకటి దాని విభూతి. ఆత్మ విస్తారమే గదా అనాత్మ ప్రపంచం. కాకుంటే ప్రపంచమంతా పరమాత్మేననే మాట కర్ధమేముంది.
అంచేత కర్మకూ జ్ఞానానికీ ఇంత ప్రగాఢమైన సంబంధముంది. జ్ఞానం సాధ్యం End కర్మ దానికి సాధనం Means. సాధ్య సాధన సంబంధముంది రెంటికీ. సాధనం లేకుండా సాధ్యమనేది సిద్ధించదు. సాధ్యమనేది లేకుంటే సాధన మనేదాని కర్ధం లేదు. కర్మజ్ఞానాల కున్న ఈ ఆంతరంగిక సంబంధం బాగా గుర్తించినవాడు గనుకనే గీతాచార్యుడు మనకది గుర్తు చేయటానికే సాంఖ్యయోగంలో కర్మయోగాన్ని ప్రవేశపెట్టి రెంటినీ మిళితం చేసి చూపాడు. అలా చూపి మరలా దేని స్వరూప మెలాటిదో దేనికది విడగొట్టి చూపుతున్నా డిప్పుడు మొదట కర్మయోగమని
Page 204