#


Index

సాంఖ్య యోగము భగవద్గీత

  అలా ప్రవర్తించటం మూలాన్నే మనసును కూడా తమ వెంట లాక్కొని పోతున్నాయి. వాటి వెంటబడి పోతూ మనసు కూడా ఆత్మాజ్ఞానానికి దూరమయి దెబ్బతింటున్నది. కనుక ఇంద్రియార్థాల మీదికి విచ్చల విడిగా పరుగెత్తకుండా ముందు మన ఇంద్రియాలను వెనక్కు మళ్లించాలి మనం. లేకుంటే అవీ మన వశంలో ఉండవు. వాటి వెంట పరుగెత్తే మనసూ మన మాట వినదు. ఇది ఆ రెండూ విషయాల మీదికి పరుగెత్తిపోతే మానవుడికి కలిగే అనర్ధం. పోతే ఆ రెండింటినీ నిగ్రహించ గలిగితే అదే మనకాత్మ జ్ఞానమనే ధనాన్ని పోగు చేసుకోటానికెంతైనా తోడుపడతాయి. అది గొప్ప పురుషార్ధం.

  ప్రస్తుత మీ రెండు శ్లోకాలలో దొరలిన భావాలు మనకు కఠోప నిషత్తులో వర్ణించిన సాధన మార్గాన్ని కండ్లకు కట్టినట్టు చూపుతున్నాయి. ఇంద్రియాలూ మనస్సూ మనకు ప్రతికూలంగా నడిస్తే ఎలా ఉంటుందో వర్ణించి అవే అనుకూలమైతే ఎలా మనకుపయోగ పడతాయో బ్రహ్మాండంగా వర్ణిస్తుందుపనిషత్తు.

యస్త్య విజ్ఞాన వాన్ భవ - త్యయుక్తేన మనసా సదా |
తస్యేంద్రియాణ్యవశ్యాని - దుష్టా శ్వా ఇవ సారధేః ||

  ఇంద్రియాలనేవి గుఱ్ఱాలలాంటివి. అవి మన వశంలోలేక - మన మనసు కూడా వాటి వశంలోబడి పోయిందో దాని ఫలితమేమిటో తెలుసా.

Page 190

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు