#


Index

సాంఖ్య యోగము భగవద్గీత

  అలా కమ్మే కొద్దీ సంగస్తేషూ పజాయతే. వాటిలో తగులు కొంటాడు. అవి పొందాలనే ఆసక్తే అందులో తగులుకోటం. సంగా త్సం జాయతే కామః ఆసక్తి ఏర్పడే కొద్దీ వల్లమాలిన కోరికలు గుఱ్ఱాలలాగా పరుగెడు తుంటాయి వాటి నెప్పుడెప్పుడు వాటేసుకొందామా అని. కామాత్ క్రోధోభి జాయతే కోరికలనేవి అక్కడి కాగవు. ఎలాగైనా అవి నాకే దక్కాలని మరెవరికీ దక్కగూడదని స్వార్ధం పెరుగుతుంది. కాని నీ పక్కవాడు కూడా స్వార్ధపరుడనే సత్యం నీవు మరచిపోతున్నావు. వాడూ తనకే కావాలని దానిమీద చేయి వేశాడో అది నీవు భరించలేవు. వాడిమీద కోపం పెంచుకొంటావు.

  క్రోధా ద్భవతి సమ్మోహః కోపం బాగా పెరిగిపోయిందో సమ్మోహానికి వశమై పోతావు. కార్యాకార్య వివేకం కోలుపోవటమే సమ్మోహం. Lack of Wisdom యుక్తాయుక్త వివేక మెప్పుడు తొలగిపోయిందో స్మృతి విభ్రమః - నీకున్న స్మృతి కాస్తా నశిస్తుంది. స్మృతేమిటి. స్మృతి అంటే అర్ధం చెబుతున్నారు భగవత్పాదులు - శాస్త్రాచార్యోపదేశాహిత సంస్కార జనితమని. అంతకు ముందు ఎంతో కాలం శాస్త్రాధ్యయనం చేసి ఉంటావు. ఎంతోమంది సద్గురువుల నాశ్రయించి వారివల్లా అనుభవ రహస్యాలెన్నో గ్రహించి ఉంటావు. తద్వారా ఎంతో సంస్కారం పోగు చేసుకొని ఉంటావు. అది నీకు స్మృతి పధంలో మెదులుతూ ఉంటుంది. అది కాస్తా ఇప్పుడీ సమ్మోహం వల్ల ఏ మాత్రమూ పైకి రాక అడుగంటి పోతుంది.

Page 180

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు