సాంఖ్య యోగము
భగవద్గీత
అది ఎప్పుడందు కొంటాడు. ఎలా అందుకొంటాడని ఇప్పుడు ప్రశ్న వచ్చింది. దానికిస్తున్నది సమాధాన మీ శ్లోకం.
శ్రుతి విప్రతి పన్నాతే బుద్ధిః - శ్రుతు లంటే ఋగాది వేద వాఙ్మయం. అది ఒక సూపరు బజారు. అందులో అన్ని రకాల వస్తువులూ దొరుకుతాయి. దేనికేది సాధనమో Means దేనికేది సాధ్యమో end అవి కూడా ఎన్ని జాతులో వాటికి పరస్పరమున్న సంబంధమేమిటో - ఇవన్నీ బయటపెట్టటమే వాటి ఉద్యోగం. అందులో ప్రవృత్తిని బోధించేవి కొన్ని. నివృత్తిని బోధించేవి మరి కొన్ని. ఇవన్నీ వినే కొద్దీ ఆచరించే కొద్దీ నీ బుద్ధి పరిపరి విధాలుగాచెదిరిపోతుంది. గందరగోళమై పోతుంది. ఏది చేయాలో ఎందుకు చేయాలో తోచక ఆందోళన చెందుతుంది.
అలాటి బుద్ధి యదాస్థా స్యతి నిశ్చలా. ఎప్పుడైతే నిశ్చలా-చలనమే మాత్రమూ లేకుండా స్తిమితంగా స్థిరంగా నిలబడుతుందో ఆ నిలబడట మెక్కడని. సమాధావచలా. సమాధిలో. సమాధి అంటే అర్ధం చెబుతున్నారు భాష్యకారులు సమాధీయతే చిత్త మస్మి న్నితి సమాధిః ఆత్మా. ఎక్కడ మానవుడి చిత్తం నిలకడ చెంది కదలకుండా ఉండిపోతుందో అలాటి ఆత్మచైతన్యమే ఇక్కడ సమాధి అనే మాటకర్థం. మనస్సెప్పుడూ దానికి మూలమైన ఆత్మలోనే చేరిపోతుంది. ఆత్మే దాని కధిష్ఠానం Basis. మనస్సు దానిమీద ఆరోపితమైన పదార్థం. ఆరోపిత మెప్పుడే గాని దాని అధిష్ఠానంలోనే గదా చేరవలసింది. ఆదిలో అది అధిష్ఠానమే. అంతంలోనూ అధిష్ఠానమే. మధ్యలోనే అది వృత్తి రూపంగా ప్రసరించి అదికానట్టు అభినయిస్తున్నది.
Page 159