#


Index

సాంఖ్య యోగము భగవద్గీత సర్వస్వం

ఇక నిర్వేదం. నీకే రోత పుడుతుంది. విరక్తి ఏర్పడుతుంది. ఎందులో విరక్తి. శ్రోత వ్యస్య. ఇంకా ఏదో ఉంది అది విందామని. శ్రుతస్యచ విన్న విషయం ఎంత గొప్పది అది వినటమే నా భాగ్యమని . ఈ రెండంటిలోనూ నీకు వైరాగ్య మేర్పడుతుంది. ఎందుకంటే అవి రెండూ కనపడవప్పుడు నీకు. ఇదం సర్వం య దయమాత్మా అని సర్వమూ నీకు నీ స్వరూపంగానే దర్శన మిస్తున్నప్పుడీ విన్న భావాలెక్కడ ఉన్నాయి. వినవలసిన భావాలెక్కడ ఉన్నాయి. ఉన్నాయంటే అవి రెండూ ఆత్మకు వేరుగా ఉన్నాయా. ఆత్మగా ఉన్నాయా. ఆత్మగా ఉంటే నీకవి కనపడవు. కనుక ఆత్మ జ్ఞాన ముదయించనంత వరకే ఇది నేను శ్రవణం చేశాను-అది ఇంకా శ్రవణం చేస్తే బాగుండు ననే మాట. ఆ జ్ఞానమెప్పు డుదయించిందో ఇక శ్రుతమూ లేదు శ్రోతవ్యమూ లేదు. ఉన్నట్టు చూస్తున్నా అది వస్తువు కాదు ఆ భాస. ఆభాస అని చూస్తున్నప్పుడు దానిమీద రక్తి ఎలా ఏర్పడుతుంది. రక్తి లేదంటే విరక్తే. నిష్ఫలమై పోతాయని అర్ధం వ్రాస్తారు గురువుగారు. ఫలమనేది స్వానుభవానికి వచ్చినప్పుడు అంతవరకూ తోడ్పడిన సాధనమిక నిష్ఫలమే గదా.

శ్రుతి విప్రతి పన్నాతే - యదా స్థాస్యతి నిశ్చలా
సమాధా వచలా బుద్ధి - స్తదా యోగ మవాప్స్యసి - 52

  సరే కర్మయోగాన్ని అవలబించి కొంతకాలానికి మోహ కలిలమనేది దాటిపోయి కర్మయోగానికి పర్యవసానమైన పరమార్ధ యోగాన్ని అందుకొంటాడు సాధకుడని గదా హామీ ఇచ్చాడు పరమాత్మ.

Page 158

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు