సాంఖ్య యోగము
భగవద్గీత
కనుకనే తస్మాద్యోగాయ యుజ్యస్వ. ముందు నీవు ఇటూ అటూ చూడక బుద్ధి యోగం కోసమే కంకణం కట్టుకో. అదే నీకు మార్గం చూపుతుంది ఆత్మజ్ఞానానికి యోగః కర్మసు కౌశలం. యోగమంటే ఏమనుకొంటున్నావో నీవు. కర్మసు కౌశలం కర్మాచరణలో ఉండే చాతుర్యం నేర్పు. సిద్ధి అసిద్ధి ఏది కలిగినా ఒకటేనని ఈశ్వరార్పణ బుద్ధితో కర్మలన్నీ సాగిస్తున్నావంటే ఎంత కౌశలమది. బంధన స్వభావ మున్న కర్మలన్నీ సమత్వ బుద్ధితో ఎప్పుడు నీవు చూచావో అప్పుడా స్వభావం నుంచి వాటి పాటికవే తప్పుకొంటాయి. అంతకన్నా కౌశల మేముంది. కోరలు తీసిన పాములయి పోతాయి కర్మలు. అహంకారమమ కారాలే కర్మ అనే సర్పాని కుండే కోరలు. అవి సమత్వబుద్ధితో లాగేశాడు యోగి. ఇక కర్మ నిన్నేమి చేయగలదు. ఉన్నా అది లేని దానితో సమానమే. ఇదీ కర్మయోగంలో ఉన్న సౌలభ్యం.
కర్మజం బుద్ధియుక్తా హి ఫలం త్యక్త్వా మనీషిణః |
జన్మబంధవినిర్ముక్తాః పదం గచ్ఛంత్యనామయమ్ || 51 ||
అసలు రహస్యమేమంటే బుద్ధి యుక్తా మనీషిణః కర్మయోగ మవలంబించి ఆ మార్గంలో పయనించే వారెప్పటికైనా మనీషు లవుతారు. మనీషి అంటే జ్ఞాని. చెప్పాము గదా కర్మయోగం చిత్తశుద్ధి నిస్తుందని అది జ్ఞానోత్పత్తికి దారి తీస్తుందని. కర్మఫలం మీద దృష్టి ఉన్నంతవరకూ రాదది. ఫలం మీద దృష్టి వదలకుంటే అది అనుష్ఠానమే గాని యోగం గాదని ముందే స్పష్టం చేశాడు భగవానుడు. మరి యోగ మెప్పుడవుతుంది.
Page 154