సాంఖ్య యోగము
భగవద్గీత
ఉపయోగపడుతుంది. అలాగే కర్మ కర్మకోసమని మామూలుగా చేస్తూ పోతే పెద్ద ఫలితమివ్వదు. మహా అయితే పితృలోక ప్రాప్తే దాని ఫలితం. అయినా సుఖం లేదు. అది ఖర్చు కాగానే మళ్లీ వెనక్కు మళ్ల వలసిందే తప్పదు. కాని అదే కర్మ యోగంగా మారిందో సత్త్వశుద్ధి ద్వారా ఆత్మజ్ఞానాన్నే అందించి నీ జీవితం సార్ధకం చేయగలదు. ఇంతకూ కర్మానుష్ఠానం మోక్షమార్గానికే దూరమైతే కర్మయోగం ఆ మార్గంలో నిన్ను ప్రవేశపెడుతుంది. అది క్రమేణ నిన్ను గమ్యం చేరుస్తుంది.
అంచేత మనమంతా మందాధికారులమా అని బెంగ పెట్టుకోరాదు. అధ్యాత్మరంగంలో ప్రవేశం దొరికిందే అని ఎంతో సంతోషించాలి. అది ఎలాగో వివరిస్తున్నాడు పరమాత్మ. మా ఫలేషు కదాచన మా కర్మఫలహేతుర్భూః ఫలితం మీద వల్ల మాలిన అభిమానం పెట్టుకోకుండా పనిచేయి అర్జునా కర్మ ఫలానికి నీవు హేతుభూతుడవు కూడా కావద్దు. ఫలదృష్టి మమకారమైతే దానికి హేతువనే దృష్టి అహంకారం. నేను చేస్తున్నాననే కర్తృత్వ బుద్ధి అహం. దీనివల్ల ఈ ఫలం నాకు తప్పకుండా కలగాలనే భోక్తృత్వ బుద్ధి మమ. ఇవి రెండే జీవభావం. వీటిలోనే సుడి తిరుగుతున్నంత వరకూ నీవు అసలైన ఆత్మ తాలూకు జ్ఞానాన్ని ఆసించలేవు. అవి దూరం చేసుకొన్నప్పుడే జీవాత్మ ప్రత్యగాత్మగా నీకు దర్శనమిస్తుంది.
అయితే ఏ కర్మా చేయకుండా మానేస్తే సరిపోదా అని మళ్లీ బోల్తా పడతావేమో. అది అసలే పనికిరాదు. సోమరివయి పోతావు కర్మలు మానేస్తే.
Page 148