సాంఖ్య యోగము
భగవద్గీత
అందుకే నేను హెచ్చరిస్తున్నాను. నిస్త్రైగుణ్యోభవార్జున. త్రిగుణాల క్షేత్రాన్ని దాటిపో నీవు అర్జునా. త్రిగుణాతీతమైనది ఏదో గాదు జ్ఞానమే. అది ఈ త్రిగుణాత్మకమైన సృష్టిని గమనించి చూస్తున్నది. అది తనకు తాను సాక్షి అయి సమస్త సృష్టికీ సాక్షి అవుతున్నది. ఇప్పుడూ ఉన్నదది నీ దగ్గర. అయితే ఈ గుణాలతో చేతులు కలిపి కలుషితమయి పోయింది. పరిమితమయి పోయింది. ఈ గుణాల కాలుష్యం కడిగేసుకొని పరిశుద్ధ మయిందంటే పరిపూర్ణమయి తన వ్యాప్తిని తాను గుర్తిస్తుంది. గుర్తిస్తే అది ఇక కర్మ గాదు. జ్ఞానమే. దానికి దారితీసే కర్మ ఏదో అది యోగం. అప్పుడిక ఏ కర్మా ఆచరించటానికి బుద్ధి పుట్టదు. పుట్టటానికది కర్మ అయితే గదా. అది వేదమయితే గదా. అదంతా వ్యవసాయాత్మకమైన బుద్ధిగా మారి తేడా కనిపించదు.
నిర్ద్వంద్వో నిత్య సత్త్వస్థో నిర్యోగ క్షేమ ఆత్మవాన్ అని దానివల్ల కలిగే గొప్ప ఫలితమేదో దాన్ని చాటి చెబుతున్నది శాస్త్రం. సుఖదుఃఖాది ద్వంద్వాలు పనిచేయవు వాడిమీద. గుణాత్మకమైన సంసారదశలోనే అవి. గుణాతీతమైన భూమినందుకొన్న మనస్సుకా చింత ఉండదు. అది లేకపోతే నిత్యసత్త్వస్థః రజస్తమో గుణాల దాడి పూర్తిగా తగ్గి ఎప్పుడూ సాత్త్వకమైన స్థితిలోనే ఉంటాడు. శుద్ధసత్త్వ సంపన్నుడయితే నిర్యోగక్షేమః యోగక్షేమాలు చూచుకోడు. అనుపాత్తస్యోపాదానం యోగః ఉపాత్తస్య రక్షణం క్షేమః అని అర్ధం చెప్పారు భాష్యకారులు. మనకంతకు ముందు లేనిది ప్రాప్తిస్తే అది యోగం. ప్రాప్తించింది ఎప్పటికీ నిలిచి ఉంటే క్షేమం.
Page 142