#


Index

సాంఖ్య యోగము భగవద్గీత

ఎడ తెరపి లేని బుద్ధులవి. ఎవరికీ బుద్ధులు. అవ్యవ సాయినాం. నిశ్చయ స్వభావం లేనివారికి. నిశ్చితమైన స్వభావమున్న వాడికొకే ఒక ఆలోచన ఉంటుంది. అలాంటి నిశ్చయానికి Conviction నోచుకోకపోతే కందిరీగల లాగా ఎన్నెన్నో ఆలోచనలు మనసులో రేగి ప్రాణం తీస్తుంటాయి మానవులను.

  మసకచీకట్లో మనమొక తాడు చూచి పామని భయపడతాము. అది తాడనే దృష్టితో చూస్తే భయం లేదుగాని అలా కాకపోతే అది పామైనా కావచ్చు. గుడ్డపేలికైనా కావచ్చు. నీటి చారికైనా కావచ్చు. నేల చీలికైనా కావచ్చు. ఏదైనా కావచ్చు. మొదటిది వ్యవసాయాత్మకమైతే ఇది అవ్యవసాయాత్మకం. అది నిర్వికల్పమైతే ఇది సవికల్పం. అది సమ్యక్రమాణ జనితం కాబట్టి ఏకం. ఇది అలా కాదు కాబట్టి అనేకం. అనంతం. పోనీ ఏదైతేనేమి అనుకోటానికి వీలులేదు. ఉన్నదున్నట్టు చూస్తే భయంలేదుగాని దాన్ని నీవు వికల్పించి చూస్తే భయపడవా. అలాగే ప్రస్తుత మాత్మ అనేది ఏకైకమైన తత్త్వం. దాన్ని అలాగే పట్టుకొంటే మోసం లేదు గాని దాన్నే మనం నామరూపాత్మకంగా చూచా మనుకోండి. అది మనకెప్పటికైనా భయావహమే. బంధమే. వ్యవసాయత్మకమైన దృష్టిలేని వారంతా నూటికి తొంభయిమంది ఇప్పుడలాగే చూస్తున్నారు. ఆత్మతత్త్వాన్ని వికల్పించి బయట చరాచర పదార్ధాలుగా లోపల వాటికి సంబంధించిన నానావిధమైన ఆలోచనలుగా దర్శిస్తున్నారు. ఇలాటి అవ్యవసాయాత్మకమైన బుద్ధి ఉండటం మూలాన్నే అనేక విధాలైన సంసారబాధలకు గురి అవుతున్నారు.

Page 135

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు