సాంఖ్య యోగము
భగవద్గీత
ఉన్నదానికి మోసం లేదు. శత్రుసంహారం చేసి భూతలస్వర్గమే అనుభవిస్తావు. అక్కడ చచ్చి అయితే ఇక్కడ బ్రతికుండే అనుభవిస్తా వన్నిభోగాలూ. అంచేత ఎటుచూచినా నీవు పరుగెత్తి పోవటం కంటే పరులతో యుద్ధం చేయటమే లాభదాయకం. తస్మాదుత్తిష్ఠ. కాబట్టి ఇక ఎలాటి భయాందోళనలూ మనసుకు రానీయక యుద్ధాయ కృత నిశ్చయః పోరాడటానికే నిశ్చయం చేసుకో. లే. లేచి గాండీవం చేతికి తీసుకో. శత్రువుల మీద శరవర్షం కురిపించు. ధీరుడవూ వీరుడవని పించుకో అని బోధ. మనకూ ఒక గొప్ప హితబోధే ఇది. ఏదైనా అనుకూలిస్తే మహా ఉత్సాహం మనకు. ఎగిరి గంతు వేస్తాము. సంతోషంతో పొంగిపోతాము. ప్రతికూలిస్తుందని తోచిందో విషాదంతో కుంగిపోతాము. అలా మోద విషాదాలకు బానిస అయిపోగూడదు మానవుడు. మన జీవితాన్ని ముందుకు నడపవలసింది సుఖదుఃఖాది బుద్ధిగాదు. ధర్మబుద్ధి. ఇది ధర్మమిది నాకు కర్తవ్యమని తోచినప్పుడది వెంటనే ఆచరించటం శ్రేయోదాయకం. దానివల్ల కష్టమా సుఖమా అని డోలాయమానం పనికిరాదు. అలాగైతే ఏమంచి పనీ చేయలేము. చేసేది మంచిదని నిశ్చయం కలిగినప్పుడది తాత్కాలికంగా ప్రతికూలించినా చివరకదే అనుకూలంగా మారి మన కానంద మిస్తుంది. సందేహం లేదు. పడ్డవాడెప్పుడూ చెడ్డవాడు కాదంటారు. అది అక్షరాలా సత్యం.
సుఖదుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయాజయౌ |
తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపమవాప్స్యసి || 38 ||
Page 124