సాంఖ్య యోగము
భగవద్గీత
మనో వ్యాపారం. ఆత్మ మనస్సుకూ ఇంద్రియాలకూ అతీతమైనది. అవిషయమైనది. అది విషయి Subject గాని విషయం Object కాదు. అలాంటప్పుడు దాన్ని వీటి ద్వారా ఎలా పట్టుకోగలం.
అయితే ఏమిటిక మార్గమని మనకు గాబరా. ఒక్కటే ఉపాయం. కేనోపనిషత్తు చెబుతున్నది. యద్వాచా అనభ్యుదితం యేనవా గభ్యుద్యతే ఏది వాక్కుతో చెప్పలేవో మీదు మిక్కిలి ఏది వాక్కునే నడుపుతున్నదో అదీ ఆత్మ. అంటే చూడటం చెప్పటం వినటం ఇలాటి వ్యాపారాల నన్నిటినీ ఏది ప్రేరణ చేస్తున్నదో ఏది ఉదాసీనంగా వెనకాల ఉంటే దాన్ని ఆలంబనం చేసుకొని అవన్నీ ప్రసరిస్తున్నాయో అలాటి సాక్షి జ్ఞానమే ఆత్మ అని అర్ధం చేసుకొంటే చాలు. అదే దాన్ని పట్టుకొనే మార్గం. ఇది ఎలాంటిదంటే ఏ ప్రకాశాన్ని ఆధారం చేసుకొని ఈ చరాచర పదార్ధాలన్నీ మనకు స్ఫురిస్తున్నాయో అది సూర్య ప్రకాశమని చెప్పటం లాంటిది.
దేహీ నిత్య మవధ్యోయం - దేహే సర్వస్య భారత తస్మా త్సర్వాణి భూతాని - నత్వం శోచితు మర్హసి - అలాంటప్పుడీ శరీరాదులు పోతే అది పోయిందని విచారించటం దేనికి. దేహీ నిత్య మవధ్యోయం దేహే సర్వస్య - దేహం నశిస్తున్నదే గాని దాన్ని ధరించిన దేహి నశించటం లేదు. తరంగ రూపం నశిస్తున్నదేగాని తరంగంలో ఉన్న జల మెక్కడికీ పోలేదు. అది ధరించిన రూపమే తరంగం. అలాగే ఆత్మ చైతన్యం తాలూకు రూపమీ దేహం. రూపం పోతే పదార్ధం Substance పోతుందా పోదు. ఎప్పటికీ పోదు.
Page 113