#


Back

ప్రబోధము

అద్వైత మనేది ఎంత ప్రాచీనమో అంత నవీనం. ఎంత శాస్త్రీయమో అంత లౌకికం. ఎంత సిద్ధాంతమో అంత అనుభవం. అద్వైత విజ్ఞానమొక మహాసాగరమైతే మిగతా విజ్ఞానశాఖలన్నీఅందులో చేరిపోయే నదుల లాంటివి. అదే పరాకాష్ఠ మానవ విజ్ఞానానికీ జీవితానికీ. మానవుడి జీవిత సమస్యలన్నింటికీ అదే ఏకైక పరిష్కారం.

అలాటి జ్ఞానాన్ని నూటికి 90మంది స్వాములవార్ల మహిమలలో చూచి సంతోషిస్తున్నారు. స్వాములవార్లను పాదపూజలకూ అనుగ్రహ భాషణలకూ దించి చూస్తున్నారు. పూజలూ పునస్కారాలూ ఇవేనని భ్రాంతి పడుతున్నారు. తమ గురువులు తమకు బోధించే ఏవేవో మంత్రాలే వేదాంతమనుకొంటున్నారు. ఆయా దేవతోపాసనలూ యోగాభ్యాసాదులే గదా అంతకన్నా ఏముంది వేదాంతమంటే అని భావిస్తున్నారు. గుడ్డివాళ్ళు ఏనుగును చూసిన సామెతగా ఉంది వీరి వ్యవహారం. ఎవరెస్టు శిఖరమెక్క లేక మనమెక్కిన రాళ్లగుట్టే ఎవరెస్టను కొంటే ఎలా ఉంటుంది.

అలాగే ప్రతీ ఒక్కడూ ఈరోజుల్లో అంతో ఇంతో తెలుసుకొని తనకు తెలిసినదే గొప్ప అద్వైత విజ్ఞానమని మూర్ఛ పోతున్నాడు. చెప్పేవారూ అలాగే చెబుతున్నారు. వారిని వినేవారూ అలాగే వింటున్నారు. జనరంజకంగా చెప్పి పేరు ప్రఖ్యాతలూ ధనార్జనా తప్ప చెప్పేవారికేదీ అక్కరలేదు. అలాటి వారిని వింటే చాలు వారిని దేవుడిలా సేవిస్తే చాలు అన్నీ వచ్చి ఒళ్ళో పడతాయనే ఈ లోకులకూ మరేదీ అక్కర లేదు. ఇది పచ్చి నిజం.

నిజం చెబితే ఎప్పుడూ నిష్ఠూరంగానే ఉంటుంది. నిష్ఠూరమైనా సరే చెప్పాలి నిజం లోకానికి. అందుకే లోకుల కిష్టమున్నా లేకున్నా లోకహితం కోరి ఉపనిషదృషులందరూ అద్వైత సత్యాన్ని కొన్ని వేల సంవత్సరాల క్రిందనే లోకానికి చాటి చెప్పారు. శంకర భగవత్పాదుల లాంటి భాష్యకారులందరూ ఆ కఠిన సత్యాన్నే పదేపదే తమ గ్రంథాల ద్వారా నిర్మొగమాటంగా బోధిస్తూ వచ్చారు. అదే అసలైన విజ్ఞాన మదే అసలైన గురు శిష్య సంప్రదాయం. అది తెలుసుకొని తదనుగుణంగా జీవితాన్ని మలచుకుంటేనే మానవ జీవితం బాగుపడుతుంది. జీవిత పరమార్థం బోధపడుతుంది.

పెద్దలందరూ చూపుతూ వచ్చిన ఆ రాజమార్గ మిటీవల మూతపడే ప్రమాదమేర్పడుతూ వస్తున్నది. ప్రక్కదారులూ సందు గొందులే ఇప్పుడు మనవాళ్ళకు రాజమార్గాలయి కూచున్నాయి. ఇలాటి పెడదారులు త్రొక్కడం శ్రేయోదాయకం కాదు - జీవిత సమస్యకిది పరిష్కారం కాదని తెలపటమే మా ఈ ఉద్యమం లోని ఆంతర్యం. అసలైన సిసిలైన వేదాంత విజ్ఞానమేమిటో భాష్యకారాదులీ లోకానికేది చాటిచెబుతూ వచ్చారో దాన్ని మరలా ఈనాటి శాస్త్రజ్ఞానానికీ లోకవ్యవహారానికీ చక్కగా సమన్వయించి నలుగురికీ చాటిచెప్పడమే తప్ప ఇంతకన్నా మేము కోరుకొనే ప్రయోజనం వేరొకటేదీ లేదు. ఒక్కమాటలో చెబితే పరవంచన పనికిరాదని గురువులకూ, - ఆత్మవంచన అంతకాన్నా చెడ్డదని వారిని గ్రుడ్డిగా అనుసరించే లోకులకూ నిర్మొగమాటంగా చాటిచెప్పటమే దీని ద్వారా మేము మీకు చేయగల ఉపకారం. ఇది అందుకొని ఉభయులకూ సమ్యక్ జ్ఞానోదయమైతే అదే మీరు మాకు చేసే ప్రత్యుపకారం. ఇక సెలవు.


***