#


Back

ఐహికము - ఆముష్మికము

ధర్మార్ధ కామమోక్షలనే నాలిగింటిలో అర్ధ కామాలనే రెండింటికీ ఐహికమని పేరు. ఈ రెండు పురుషార్ధాలు ఆ బాల గోపాలం లోకంలో అందరికీ ప్రసిద్ధమే. ఒక మిఠాయి పొట్లం చేతికి తీసుకొని తింటూ తృప్తి పొందాలని ఒక బాలుడికెలా ఉంటుందో - అలా ఒక రాజ్యాన్ని పాలిస్తూ దర్జాగా బ్రతకాలని ఒక గోపాలుడికీ ఉంటుంది. అందుచేతనే ఆ బాల గోపాలమని పేర్కొనటం. ప్రతి ఒక్కడికీ జీవితంలో తనకు కావలిసిన పరికరాలన్ని సమకూర్చుకొని జీవితాంతం సుఖంగా గడపాలనే ఉంటుంది. కాని కష్టాల పాలు కావాలని ఎవరికీ ఉండదు. అప్పటికప్పుడు పుట్టిన శిశువు కూడా నాలుక మీద వేసిన పదార్ధాన్ని చప్పరిస్తుంది. పిచ్చివాడు కూడా చేతికి చిక్కిన పదార్ధాన్ని వదులు కోలేడు. చావబోయే శతవృద్ధుకూడా ప్రాణాలు నిలబెట్టుకోటానికి మందులు మాకుల కోసం ప్రాకులాడుతాడు. అర్ధకామాల మీద ఇంత గాఢంగా ఉంది మానవుని దృష్టి.

ఈ మాత్రం ఐతే ఇది జంతుజాలానికి కూడా ఉంది గదా ఇక ఈ రెండింటికి పురుషార్ధాలని పేరుపెట్టి సుఖమేమిటి అని అడగ వచ్చు. అర్ధ కామాలు జంతువులకూ ఉన్న మాట వాస్తవమే. కాని జంతువులకు కేవలం భౌతికంగానే ఉంటాయి అవి. మానవులకు భౌతికంగానే కాక మానసికంగానూ హార్దికంగానూ కూడా వాటిని మనం చూడవచ్చు. మానసికమైన అర్ధమే శాస్త్ర విజ్ఞానం. హార్దికమైనదే కళా విజ్ఞానం.

ఆ నాటి ఋగ్వేదాది శాస్త్రాల దగ్గర నుంచి ఈనాటి అణు శాస్త్రం వరకు అంతా శాస్త్ర ప్రపంచమే. అలాగే వంట చేయటం మొదలుకొని కవిత్వం చెప్పి మెప్పించే దాకా అంతా కళా సందోహమే. ప్రాపంచికమైన వస్తువుల గుణ దోషాలను పరిశీలించి వాటి స్వరూపాన్ని నిర్ణయించటమే శాస్త్రం చేసే పని. హృదయంలో సుప్తంగా ఉండే వాసనలను మేలు కొలిపి ఒకానొక లౌకికమైన ఆనందాన్ని ప్రసాదించటమే కళాకార్యం. ఒకటి పదార్ధ విజ్ఞానాన్ని అందిస్తే మరొకటి వాసనా జన్యమైన ఆహ్లాదాన్ని అందజేస్తుంది. ఈనాడు మూడు లక్షల మైళ్ళ దూరంలో ఉన్న చంద్ర మండలం మీదికి వెళ్ళి వచ్చాడంటే తనకు బాహ్యాంగా ఉన్న ఒక పదార్ధ తత్త్వాన్ని శోధించి తెలుసుకొన్నా డన్న మాట మానవుడు. అలాగే ఒక కమ్మని సంగీతం విని సంతోషించా డంటే తద్ద్వారా తన ఆంతర్యంలో దాగి ఉన్న వాసనా తరంగాలనే అనుభవిస్తున్నాడనే అర్ధం.

మొత్తం మీద బాహ్యంగా కనిపించే భూత రాశి ఆభ్యంతరంగా ఉండే వాసనా రాశి వీటి రెండిటినీ దాటి పోలేదు ఏ శాస్త్రమైనా, ఏ కళైనా. ఇవి రెండూ ఈ శరీరమున్నంత వరకే మన అనుభవానికి వచ్చేది. శరీరం ఎంతో కాలం మన అధీనంలో ఉండదు. చూస్తూ చూస్తుండగానే ఎప్పుడో మనకు చెప్పకుండానే తప్పించుకు పోతుంది. దానితో పాటు హృదయము మనసు పడిపోక తప్పదు. అవీ పోతాయి. దీనితో మనం చేసిన శాస్త్ర, కళా పరిశ్రమ అంతా కృష్ణార్పణమే. పాంచ భౌతికంగా చేసిన కృషి కాబట్టి పంచ భూతాలకే అప్పగించి పోవలసి వస్తుంది. చూడండి! చంద్ర మండలం పోయి వచ్చిన మానవుడు కూడా చివర కేమై పోయాడు. భూమండలం మీదనే తన ప్రాణాలు కోలుపోయాడు. కాబట్టి భౌతికమైన దేదీ నిలవదు. శరీరమున్నంత వరకే దాని అనుభవం. శరీరం పోయినా అనుభవించే అవకాశం వాటికి లేదు. ఆకలి దప్పుల లాంటి కేవల శారీరకమైన భావాలకూ లేదు. మనో హృదయ సంబంధమైన వైజ్ఞానిక భావాలకూ లేదు. కేవల శరీరకాలు మరీ ప్రాకృతము లైతే వైజ్ఞానిక బావాలు కొంచెం సున్నితమైనవి. అంత మాత్రమే తేడా. రెందూ అర్ధ కామాల కోటిలోనివే. రెండూ ఈ స్దూలదేహంతో నశించవలసినవే.

పోతే ఇక నశించన వంటూ ఏమైనా ఉన్నవా అని ప్రశ్న. అవి ఆముష్మికమైన ధర్మ మోక్షాలేనని మన ప్రాచీనులిచ్చిన సమాధానం. వీటికి ఆముష్మిక మని పేరు. మరణానంతరం అనుభవానికి వచ్చే దొకటైతే అసలు మరణమే లేదని అనుభవానికి వచ్చే దింకొకటి. అందులో మొదటిది ఢర్మం, రెండవది మోక్షం ధ్రియతే ధారయతే ఇతి ధర్మః తాను నిలిచి మానవుణ్ణి నిలబెట్టే దేదో అదే ధర్మం. దీనిని బట్టి చూస్తే అర్ధకామాల మాదిరి ధర్మమనే పురుషార్ధం నశించేది కాదని తెలుస్తూ ఉన్నది.

ధర్మం మాత్రమే నశించేది కాదని చెప్పటాని కేమిటి ప్రమాణం. ఇది దేహ పాతానికి పూర్వం కాక తర్వాత జరిగే కార్యక్రమానికి సంబంధించి ఉంది. దేహ పాతానంతరం దేహమే లేదు. దేహమే లేక పోతే ఇంద్రియాలు లేవు. మనసూ లేదు. అవి రెండూ లేకుంటే ప్రత్యక్ష - అనుమానాలనే రెండు ప్రమాణాలు ఎగిరిపోయాయి. ఇక మనకు ధర్మం బొధించే లోకాంతర జ్ఞానం కాని జన్మాంతర జ్ఞానం కాని ఎలా కలుగుతుంది? కలగకుంటే అవి ఉన్నాయనే నమ్మకమేమిటి? కనుకనే మొదటి నుంచి నాస్తిక వాదం లోకంలో ఏర్పడటాని కవకాశం వచ్చింది. ప్రత్యక్షా నుమానాల కతీతంగా ఏదీలేదని వాదించే వారే నాస్తికులు. ఆ వాదాన్ని మనం త్రోసి పుచ్చాలంటే ముందు మరి ఒక ప్రమాణాన్ని ఆశ్రయించి తీరాలి. ఏమిటది. అదే శబ్దమనే ప్రమాణం. ప్రమాణం లేకుండా ఏది చెప్పినా అది కేవల విశ్వాసం క్రిందికే వస్తుంది. విశ్వాసనేది హేతుబద్ధం కాదు కాబట్టి దాన్ని మనం స్వీకరిస్తే స్వీకరించవచ్చు, లేకుంటే లేదు. అదే ప్రమాణ పూర్వకమైతే తప్పకుండా స్వీకరించవలసి ఉంటుంది. అలా ప్రామాణికాలు కావటం మూలాన్నే ఐహికమైన అర్ధకామాలు అందరికీ శిరోధార్య మౌతున్నాయి. ప్రస్తుతం ధర్మానికి కూడా శబ్దమనే ప్రమాణ మొకటి ఉంది కాబట్టి మనం అంగీకరించ వలసిందే.

శబ్దమంటే ఏమిటి. మాటే శబ్దం. మాట వల్ల జ్ఞానం కలిగే మాట వాస్తవమే. ఐతే ఎవడంటే వాడు చెపితే దానికి ప్రామాణ్యం లేదు. ఫలానా చోట ఫలానా సందర్భాన్ని నేను చూచానని ఒకడు చెపుతాడు. వాడు కుర్రవాడైతే నమ్మలేము. మతి స్తిమితం లేని వాడైతే నమ్మలేము. అన్ని విధాలా విశ్వస నీయుడైన వాడే చెప్పాలా మాట. అలాటి విశ్వాస పాత్రుడే ఆప్తుడు. అతడు చెప్పిన మాట ఆప్తవాక్యం. కాబట్టి శబ్దమంటే ఆప్త వాక్యమని అర్ధం.

అంతే కాదు. అది మరలా నిన్న, నేడు ఒకరిద్దరు మాత్రమే చెప్పిందయితే దానికంత ప్రాబల్యం ఏర్పడదు. పదుగురాడు మాట అయి ఉండాలి. అనాది కాలం నుంచి అనుస్యూతంగా వస్తూ ఉండాలి. అలా ఒకే మాట అనేక మంది ఏక కంఠంగా చెపుతున్నారంటే దానికి తప్పకుండా విలువ ఉంటుంది. కనుక ఆప్తవాక్యమే కాక ఈ శబ్దం ఆగమం కూడా అవుతున్నది. ఆగమమంటే రావటమని అర్ధం. ఎప్పటి నుంచో ఈ మాట ఆనోటా ఈనోటా పడి మన దాకా వచ్చి చేరుతూ ఉంది కాబట్టి దీని ని ఆగమమని పేర్కొన్నారు.

అయితే ఇది ఎప్పటినుంచి అయినా రావచ్చు. మొదట ఎప్పుడో ఒకప్పుడు పుట్టి ఉండాలి గదా అది ఎలా పుట్టింది. నిగమంగా పుట్టిందని జవాబు. నిగమమంటే నిశ్చయం. అతి ప్రాచీన కాలంలో కొంతమంది మేధావంతులకు కలిగిన మనో నిశ్చయమే నిగమం. అదే ఆగమ రూపంగా ప్రసరించి మనదాకా వచ్చింది.

కాని నిగమమంటే నిశ్చయమని చెప్పాము. నిశ్చయమనేది ఎవరికి కలిగినా మానసికంగానే కలుగుతుంది. మానసికం రెండు విధాలు. అనుభవ పూర్వకంగా కలిగేది మానసికమే. కేవలం ఊహగా కలిగేదీ మానసికమే. ఇందులో అనుభవ జన్యమైతే అది ప్రామాణికం. కల్పనా గమ్యమైతే కాదు. మరి ఇది ఎలాంటి నిశ్చయమని ప్రశ్న వస్తుంది. అనుభవ జన్యమేనని సమాధానం. కనుకనే నిగమమని మాత్రమే గాక దీనికి దర్శనమని గూడా పేరు వచ్చింది. దర్శనమంటే చూడటం. తపస్సంపన్నులైన మన మహర్షులు సాక్షాత్తుగా చూచిన తర్వాతనే వాటిని సత్యాలుగా నిగమనం చేసారు. అవే ఆగమాలుగా మన వరకు వచ్చాయి. అది మనకు ఆప్త వాక్యమైన శబ్దమైంది. శబ్దమెప్పుడూ చెవులకు విన పడుతుంది. కాబట్టి దీనికి శ్రుతి అని గూడ మరి ఒక పేరు వచ్చింది. ఈ శ్రుతి మరలా మన కామహర్షుల జ్ఞానాన్నే అందజేస్తుంది. కాబట్టి అదే వేదమని కూడా పేర్కొన బడుతున్నది. "విదజ్ఞానే" వేదమంటే జ్ఞానమనే అర్ధం - ఇంతకూ ఒకప్పుడు పెద్దలు దర్శించిన సత్యమే ఇప్పుడు మనకు శబ్దంగా వినిపిస్తున్నది. వారి దర్శనం నిగమమై - నిగమ మాగమమై - ఆగమం శబ్దమై - శబ్దం శ్రుతియై, శ్రుతి - వేదమై, ఆ వేద మిప్పుడు మనకు ప్రమాణ భూతమైన శాస్త్రమై నిలిచింది. ఇప్పుడది అక్షర రూపంగా కనిపిస్తున్నా అక్షరాలలో బంధించబడిన అనుభవ జ్ఞానమే అది అని మనం గ్రహిస్తే చాలు. దాని ప్రామాణ్యానికి తిరుగు లేదు - ఇలాంటి శాస్త్ర ప్రమాణం ఐహికం కాదు. ఆముష్మికం . ఆముష్మికమైన ధర్మాన్ని మనకది చాటి చెపుతున్నది.

ధర్మ మనే మాటకు కర్మ అని అర్ధం. కర్మ అంటే పని. ప్రతి పనీ మనసుతోనో, వాక్కుతోనో, శరీరంతోనో మూడింటిలో ఏదో ఒక దానితో జరుగుతూ ఉంటుంది. పశు పక్ష్యాదులకు మనో వాక్కులంత బలంగా లేవు. పోతే వాటి కున్న దొక్క శరీరమే. దానితో అవి పనులు చేస్తూనే ఉంటాయి. ఐతే ఆ చేసే పనులు బుద్ది పూర్వం కాదు కాబట్టి వాటిని కర్మలని గాక చేష్టలని చెపుతారు పెద్దలు. పోతే బుద్ది పూర్వకంగా చేసే వాడొక మానవుడే. కాబట్టి వాడి పనులన్నిటికి కర్మలని పేరు పెట్టారు. ఈ కర్మలలో మరలా కర్తవ్యమని - అకర్తవ్యమని రెండు జాతులున్నాయి. ఏది తనకూ లోకానికీ హితమో అది కర్తవ్యం. ఏది కాదో అది అకర్తవ్యం. అందులో కర్తవ్యమైన కర్మకే ధర్మమని పేరు. దానికి భిన్నంగా అకర్తవ్యమైన దాని కధర్మమని పేరు. యుక్తాయుక్త వివేచనా శీలుడైన మానవు డధర్మాన్ని పరిహరించి ధర్మాన్ని మాత్రమే ఆచరిస్తూ పోవాలి.

ధర్మాన్ని ఆచరించాలంటే ఏది ధర్మమో ఏది కాదో గ్రహించే జ్ఞానముండాలి మొదట. అలాటి జ్ఞానం మానవుడి బుద్ధికి కొంత సహజంగా కలుగుతుంది. కాని అది చాలదు. దేశకాల నిమిత్త దశా విశేషాలను బట్టి ధర్మా ధర్మాలు చిత్ర విచిత్రంగా మారిపోతుంటాయి. ఒక దేశానికి ధర్మమైనది మరొక దేశానికి కాదు. ఒక కాలానికైనది మరొక కాలానికి వర్తించదు. ఇంతెందుకు. నీకు ధర్మంగానే కనిపించవచ్చు. అది నీ పొరుగు వాడికి కేవల మధర్మంగా తోచవచ్చు. కాబట్టి అల్పజ్ఞుడైన మానవుడు తన బుధ్ధితో మాత్రమే నిర్ణయించ వలసినవి కావీ ధర్మా ధర్మాలు. "తస్మాత్ శాస్త్రం" అన్నట్టు శాస్త్ర ప్రమాణమే మనకు మార్గదర్శకం.

శాస్త్రం అతీంద్రియ జ్ఞాన సంపన్నులైన ఋషి పుంగవుల అనుభవాల సంపుటమని కదా చెప్పాము. అలాటి సర్వతో ముఖమైన శాస్త్రం చెప్పలేని అంశమంటూ ఉండబోదు. శాస్త్రమంటే శ్రుతులు, స్మృతులు, ఇతిహాసాలు, పురాణాలు మొదలైన వాఙ్మయ ప్రపంచం. ధర్మాన్ని దర్శిస్తే అవి శ్రుతులైనాయి. పెద్దలైన వారు ఆచరిస్తూ వస్తే అవి స్మృతులైనాయి. దాన్నే దృష్టాంత పూర్వంగా వివరిస్తూ పోతే పురాణేతి హాసాలైనాయి. మొత్తంమీద అన్నీ మనకు బోధించేది ధర్మమే.

ఈ బోధ కూడా విధి ముఖంగా నిషేధ ముఖంగా రెండు ముఖాలుగా చేస్తుంది శాస్త్రం. ఇది ధర్మం దీనిని నీవాచరించి బాగుపడమని చెప్పటం విధి. ఇది అధర్మం దీని నాచరించ గూడదని హెచ్చరించటం నిషేధం. దీనిని బట్టే వేదాల దగ్గర నుంచి మన వాఙ్మయమంతా విధి నిషేధాత్మకంగానే విభక్తమై కూచుంది. "రామాది వ ద్వర్తితవ్యం న రావణాదివత్" రాముడి మాదిరి ప్రవర్తించు, రావణుని మాదిరి కాదు అని బోధించటం కన్న శాస్త్రానికి వేరే ప్రమేయమే ముంది. కేవల ధర్మాన్ని చెప్పినా లాభం లేదు. కేవల మధర్మాన్ని చెప్పినా సుఖం లేదు. రెంటినీ కలిపి చెప్పినప్పుడే ఆ ప్రమేయం సిద్ధించేది. ఇందులో అధర్మ జ్ఞానం అనర్ధాన్ని పరిహరించటానికి దారి చేస్తే ధర్మ జ్ఞానం అర్ధ ప్రాప్తికి తోడుపడుతుంది. అనర్ధ రహితమైన అర్ధమే కదా అసలైన పురుషార్ధం. కనుక వివేక శాలి అయిన పురుషుడు శాస్త్ర ప్రమాణాన్ని బట్టి అధర్మాన్ని వర్జిస్తూ ధర్మాన్ని మాత్రమే పాటిస్తూ పోవాలి. ధర్మం వలన కలిగే ఫలం చివరకు జీవితాభ్యుదయం. జీవితమంటే ఐహికమే కాదు. ఆముష్మికం కూడా. దానికే అభ్యుదయమని పేరు. అది లోకాంతర జన్మాంతరాల్లో అనుభవానికి వస్తుందని శాస్త్రం చెబుతున్నది. మనకు. ఇప్పుడే అది దృష్టం కాదు కనుక అదృష్టమని, అపూర్వమని నామకరణం చేశారు.

***