#


Back

అద్వైతము

అద్వైతమనేది ఒక వాదం కాదు. ఒక మతం కాదు. అది సిద్ధాంతం. ఎవరి వాదం వారు వినిపించిన తర్వాత కోర్టులో జడ్జీగారు తీర్పు చెబుతారు. తీర్పు చెప్పిన తరువాత ఇక వాదం లేదు. అక్కడకన్నీ సమసిపోతాయి వాదాలు. అలాగే మీరు సాంఖ్య మనండి. యోగమనండి. న్యాయమనండి. వైశేషిక మనండి. ఆఖరుకు పూర్వోత్తర మీమాంశలనండి. అంతే్గాదు. ఆనాటి షడ్దర్శనాలే కాక ఈనాటి శాస్త్రజ్ఞులు చేసే పరిశోధనా ఫలితాలనండి మానవుడి విజ్ఞానం ఎన్ని మార్గాలలోనైనా సాగిపోవచ్చు. అదంతా పురోగతి అని మనమెంతైనా సంతోషించవచ్చు. కానీ ఇవన్నీ వారి వారి మతాలే-వాదాలే. సిద్ధాంతం కాదు. సిద్ధాంతమంటే ఇక దాని తరువాత నీవు తెలుసుకోవలసినది ఏదీలేక పోతేనే అది సిద్ధాంతం. అలాటిదొక్క అద్వైత జ్ఞానం తప్ప మరేదీ లేదు. అప్పుడూ లేదిప్పుడూ లేదెప్పుడూ లేదని ఘంటాపధంగా చెప్పవచ్చు.

అది ఎలాగా అని అడుగుతారేమో. అసలద్వైతమనే మాటలోనే ఉంది జవాబు. సృష్టిలో కనిపించే పదార్ధాలెన్నో అసంఖ్యాకంగా ఉన్నట్టు కనిపిస్తాయి నీకూ నాకూ, కాని విమర్శించి చూస్తే ఎన్నో కావవి. అన్నీ కలిసి ఒకే ఒక పదార్ధం. అది ఎదోగాదు నా నీ స్వరూపమే. ఇదీ అద్వైత మనే మాటకర్ధం. ద్వైతం కానిదేదో అది అద్వైతం. ద్వైతమంటే ఒకదానికొకటి వేరుగా అన్యంగా కనిపించేదంతా ద్వైతమే. సాంఖ్యం దగ్గరి నుంచి పూర్వోత్తర మీమాంసల వరకూ ఆయా మతాచార్యులు లోకానికి బోధించినదంతా ద్వైతమే నని అన్నింటికీ ద్వైతమనే ముద్ర వేశారు శంకరభగవత్పాదులు. ఒకటి అనే సంఖ్య దాటి ఇక ఎన్ని పరిగణించినా అది ద్వైతమే

సాంఖ్యాన్ని ప్రచారం చేసిన కపిలాచార్యుడు ప్రకృతి అని పురుషుడని రెండు పదార్ధాలు చెబుతాడు. ప్రకృతి కూడా ఒకటిగాదు. సత్వం రజస్సు తమస్సని మూడు గుణాలున్నాయందులో. దానితో మహత్తనీ అహంకార మనీ అనేక విధాలుగా మారిపోతుందది. అలాగే పురుషుడు కూడా ఒకడు గాదు. పురుషుడంటే జీవుడు. కోటాన కోట్లున్నారు జీవులు సృష్టిలో. ప్రకృతికీ పురుషుడికీ సంబంధం లేదు. జీవుడికీ జీవుడికీ లేదు - దేని స్వభావం దానిదే. పోతే యోగాచార్యుడు పతంజలి ప్రకృతి పురుషులతోపాటు ఈశ్వరుడనే మూడవతత్వాన్ని కూడా ఒప్పుకొన్నాడు. అందుకే కపిలుడిది నిరీశ్వర సాంఖ్యమైతే పతంజలిది సేశ్వర సాంఖ్యమని పేరు వచ్చింది. ఇక నైయాయికులూ వైశేషికులూ ఇద్దరున్నారు. మొదటి దానికి మూలపురుషుడు గౌతముడైతే రెండవ దానికి కణాదుడు మూలపురుషుడు. ఇద్దరికీ కలిపి తార్కికులని పేరు. ఇందులో నైయాయికులు పదహారు పదార్ధాలు పరిగణిస్తే వైశేషికులు ఏడు పదార్ధాలంగీకరిస్తారు. మరి పూర్వమీమాంసకులున్నారు జైమిని మహర్షి అనుయాయులు - కర్మ మీమాంసకులని పేరు వారికి. నిత్యనైమిత్తికాదులైన కర్మలుతప్ప వీరికేదీ కాబట్టదు. ఏవి విధులో ఏవి నిషిద్ధాలో తెలుసుకోవాలంటే ప్రమాణమొక్క వేదమే వారికి. సత్కర్మానుష్ఠానమూ దానివల్ల స్వర్గసుఖాలూ తరువాత ఉత్తమ జన్మలూ అందులో అంతకంతకూ అభ్యుదయ ప్రాప్తీ - ఇది తప్ప మరొక మాటే లేదు - ఆఖరుకు శబ్ద ప్రమాణమైన వేదం తప్ప విడిస్తే ఈశ్వరుణ్ణి కూడా ఒప్పుకోరు మీమాంసకులు. సాంఖ్యులెలా నిరీశ్వరులో వీరూ నిరీశ్వరవాదులే. ఇద్దరూ నాస్తికులే ఒకవిధంగా.

కాగా ఇక ఉత్తర మీమాంసకులు. వీరిలో ద్వైతులున్నారు - విశిష్టాద్వైతులున్నారు. ఇద్దరికీ వేదం ప్రమాణమే - దానితోపాటు వేదవైద్యుడైన ఈశ్వరుడూ వున్నాడు వీరికి. అయితే ద్వైతులా ఈశ్వరుడు విష్ణువనేగాక శివుడికి కూడా ఆయన తరువాత స్థానమిస్తే విశిష్టాద్వైతులకు విష్ణువు తప్ప శివుడికి ప్రవేశమే లేదు. ఈ రెండు మతాలూ వేదకాలం నుంచి వస్తూ ఉన్నవే. ద్వైతానికి బేధవాదమనీ విశిష్టాద్వైతానికి భేదా భేద వాదమనీ అప్పటి వ్యవహారం. కాలాంతరంలో రామానుజులు వచ్చి విశిష్టాద్వైతాన్ని ప్రచారం చేస్తే మధ్వాచార్యులు ద్వైతాన్నే పట్టుకొని ప్రచారం చేసారు. ఇందులో విశిష్టాద్వైతులు జీవుడు జగత్తు ఈశ్వరుడు మూడు పదార్ధా లొప్పుకున్నారు. వీటికే తత్త్వ త్రయమని పేరు పెట్టారు. ఈశ్వరుడికి శేషి అని జీవ జగత్తులకు శేషమని వారి పరిభాష. పోతే ద్వైతులు కేవలం భేదవాదులు కాబట్టి వారీ మూడింటిలోనే అయిదు భేదాలు కల్పించుకొన్నారు. అయిదూ సత్యమే వారికి. జీవుడికీ జీవుడికీ భేదం. జీవుడికీ జగత్తుకూ భేదం. జగత్తుకూ జగత్తుకూ భేదం. జగత్తుకూ ఈశ్వరుడికీ భేదం. ఈశ్వరుడికీ ఈ రెండింటికీ భేదం. ఇవే ఆ అయిదూ.

పోతే ఇక బౌద్ధులున్నారు, జైనులున్నారు, చార్వాకాదులున్నారు. వీరంతా నాస్తికులు. బౌద్ధులకు రూప విజ్ఞానాదులు పంచ స్కంధాలున్నాయి. జైనులకు జీవా జీవాదులైన సప్త పదార్ధాలున్నాయి. మరి భౌతిక వాదులైన చార్వాకాదులందరికీ జీవులున్నారు, జగత్తున్నది. కష్ట సుఖాలున్నాయి. జనన మరణాద్యను భవాలున్నాయి. మహా అయితే ఆత్మ లేదు. పరమాత్మ లేడు. పరలోకాదులు లేవు. జన్మాంతరాలు లేవు. అంత మాత్రమే.

ఇలా చూస్తూ పోతే ఏమతస్థుడైనా ఒకటిని మించే పదార్థాలను పరిగణిస్తూ వస్తాడు గాని ఉన్న పదార్థమొక్కటేనని అది మన స్వరూపమేనని ఏ మాత్రమూ ఒప్పుకోడు. పోనీ ఇవేవైనా మన జీవిత సమస్యను పరిష్కరించగలవా అని అడిగితే ఏ ఒక్కదానికీ ఆ సామర్ధ్యం లేదు. ఎలాగంటే సాంఖ్యం మొదలు ఈ చెప్పినవన్నీ రెండే తరగతులు. ఒకటి ఈ ప్రపంచ సృష్టికి జడ ప్రకృతే మూలమని పేర్కొంటే, మరొకటి జడం గాదు చేతనుడైన ఈశ్వరుడేనని భావిస్తుంది. అందులోనూ ప్రకృతి అంతకంతకూ పరిణామం చెందుతూ ప్రపంచంగా మారిందంటారు ప్రకృతివాదులు. కాదు కాదు చేతనుడైన ఈశ్వరుడే సంకల్పించి ప్రపంచాన్ని సృష్టించాడని వాదిస్తారు ఈశ్వర కారణవాదులు. ఈ రెండూ హేతువాదానికి నిలిచేవి కాదు అని త్రోసి పుచ్చుతారద్వైతులు. ఎందుకంటే ప్రకృతి అచేతనమని మీరే చెబుతున్నారు. అచేతనానికింత పెద్ద ప్రపంచాన్ని ఇంత పకడ్బందుగా కల్పించే సంకల్పం గాని సామర్ధ్యంగాని ఎలా కలుగుతుంది. కనుక ప్రకృతి కారణవాదం నిలబడదు.

పోతే చేతనుడైన ఈశ్వరుడికేమవసర మీ ప్రపంచాన్ని సృష్టించడానికి. ఒకవేళ సృష్టించినా ఇంతమంది జీవుల నింత విషమంగా సృష్టించి వారినింత కష్టాల పాలుచేసి చివరకందరినీ నిర్దాక్షిణ్యంగా రూపుమాపాలనే ఆలోచన ఎందుకేర్పడాలా ఈశ్వరుడికి. ఏర్పడితే వాడీశ్వరుడే గాదు. జీవులకంటే గొప్ప కర్కోటకుడు. రాగ ద్వేషాలు జీవులకున్నట్టే వాడికీ ఉంటాయని ఒప్పుకోవలసి వస్తుంది. అప్పుడిక జీవులదేమీ లేదు అపరాధం. అంతా ఈశ్వరుడిదే ఆ పాపం. ఎందుకని? ఈశ్వరుడేగా సర్వసమర్ధుడు. వాడే సృష్టించాడీ జగత్తును గానీ జీవకోటినిగానీ - అలాంటప్పుడిక జీవుడికి మంచి బుద్ధి అయినా చెడ్డ బుద్ధి అయినా అది ఈశ్వరుడి ప్రసాదమే. మరి జీవుడికెందుకు చెప్పారు పుణ్యపాపాలు - స్వర్గనరకాదులు, జన్మాంతరాలని పెద్ద ఆక్షేపణ వస్తుంది. అంతేకాదు. ఈశ్వరుడు సర్వవ్యాపకుడా కాడా? వ్యాపకుడైతే జీవ జగత్తులు వేరుగా ఉండే అవకాశం లేదు. కాకపోతే ఈశ్వరుడికి నామరూపాలేర్పడి వాడూ జీవుడిలాగా పరిమితమై కూచుంటాడు. రెండు విధాలా హేతువాదానికి నిలవదు. దీనికే ఈశ్వర కారణవాదీ జవాబు చెప్పలేడు.

పైగా ప్రకృతి అని పురుషుడని ప్రపంచమని ఈశ్వరుడని ఇన్ని భావాలెప్పుడు వచ్చాయో - అప్పుడు వీటన్నిటికీ ఏమిటి సంబంధమనే ప్రశ్న వస్తుంది. వస్తే కార్యకారణ రూపమైన సంబంధమే చెప్పవలసి వస్తుంది వాటికి. అందులో ఈశ్వరుడు సృష్టిస్తే జీవ జగత్తులు వచ్చాయన్నావా అది ఆరంభవాదం. లేదా అచేతనమైన పకృతి మారుతూ పోవటం వల్ల ప్రపంచమేర్పడిందంటావా అది పరిణామవాదం. ఏ వాదమైనా ఇందులో అది అర్థం లేనిదేనంటారు అద్వైతులు. అంతకు ముందు ఎక్కడా లేని జీవజగత్తులెలా వచ్చారున్నట్టుండి ఎలా లేకుండా పోయారని అడిగితే జవాబు లేదారంభ వాదులకు. ఏదీ హఠాత్తుగా రాదు పోదనే సూత్రానికది విరుద్ధం.

అలాగే అచేతనమైన ప్రకృతి తన పాటికి తానెలా మారిపోయి ప్రపంచమయింది. అయ్యే స్వభావమే దానికుంటే ఎప్పుడూ సృష్టి జరుగుతూనే పోవాలి. ప్రళయమనేది ఏర్పడగూడదు. ప్రళయమే స్వభావమైతే సృష్టి జరగకూడదు. కాబట్టి పరిణామవాదానికీ అర్థం లేదు. ఆరంభ పరిణామ వాదాలలో ఏది ఒప్పుకున్నా జీవుడికి జనన మరణా లెప్పుడూ ఏర్పడుతూనే ఉంటాయి కాబట్టి సంసార బంధం నుంచి ఎప్పటికీ మోక్షమనేది ఆసించలేము. మోక్షమే లేకుంటే మానవ జీవిత సమస్య కసలు పరిష్కారమే లేదు. సమస్యకు పరిష్కారం సూచించడానికే గదా శాస్త్రమనేది రంగంలోకి వచ్చింది.

అప్పటికీ సాంఖ్యయోగాది శాస్త్రాలన్నీ కేవలం ఎవరికి తోచినట్టు వారు లేవదీసిన మతాలూ వాదాలే గాని సిద్ధాంతమేదీ గాదు. జీవిత సమస్యను పూర్తిగా పరిష్కరించి ఒక నిర్ణయం చేయగలిగినప్పుడే అది సిద్ధాంతం. అలాటి నిష్కర్ష వీటిలో ఏదీ చేయలేకపోతున్నది. దానికి కారణమొక్కటే. ఒక జీవుడని జగత్తని వాటికి కారణం ప్రకృతి అని ఈశ్వరుడని ఇన్ని రకాలుగా ఇన్ని పదార్ధాలున్నాయని సృష్టిలో అనేకత్వాన్ని ఒప్పుకుని తదనుగుణంగా తమ తమ మతాలు ప్రతిపాదిస్తూ పోవటమే. అనేకత్వమనే దెప్పుడూ వాదానికి దారితీస్తుందే గాని సిద్ధాంతానికి తోడు పడదు. ఏకత్వమే సిద్ధాంతానికి దారితీసేది. అది అద్వైత విఙ్ఞానమొక్కటే. అద్వైతమంటేనే ఏకైకమైన తత్వమని పేర్కొన్నాము. అందుకే దానికి భిన్నమైన ఈ సాంఖ్యాది మతాలన్నీ ద్వైతమతాలే అవి కేవలం వాదాలే గాని సిద్ధాంతం కాదని త్రోసి పుచ్చింది అద్వైతులు.

అయితే ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే అద్వైత మేకత్వాన్నే చెబుతుందన్నారే ఏమిటా ఏకత్వం. అది మన సమస్యనెలా పరిష్కరిస్తుంది. అద్వైతం జీవుడనీ జగత్తనీ ఈశ్వరుడనీ ప్రకృతి అనీ ఇన్ని పదార్ధాలను ఒప్పుకోదు. పరస్పరం భిన్నంగా కనిపించే ఇవన్నీ అసలు లేనే లేవు. ఉన్నదొకే ఒక తత్వం. అది నిరాకారమూ సర్వ వ్యాపకమూ అయిన పరిశుద్ధమైన ఙ్ఞానం. ఙ్ఞానం గనుక నేను నేను అనే స్ఫురణ ఎప్పుడూ ఉంటుంది దానికి. దానికి అంటున్నాను. దానికి గాదు అని నేనే. అది నా స్వరూపమే ఆత్మే నేనే. తెలుగులో నేనంటే సంస్కృతంలో దాన్నే ఆత్మ అన్నారు. అంతే తేడా. పోతే ఈ ఆత్మ తప్ప ఇక దానికి గోచరించే దేదైనా సరే అది దీనికి ఙ్ఞేయం. ఆత్మ కాదది అనాత్మ. అయితే అది కూడా నా ఙ్ఞానానికే గోచరిస్తూ నా ఙ్ఞానమే దాని అస్తిత్వానికీ దాని స్ఫురణకూ ప్రమాణం కాబట్టి అది స్వత స్సిద్ధంగా లేదు. స్వతః ప్రమాణమైతేనే స్వతస్సిద్ధం. అది ఙ్ఞాన స్వరూపమైన ఆత్మే. మరి ఈ అనాత్మ అనేది ఙ్ఞానమనే ప్రమాణముంటే ఉండి లేకుంటే లేదు కాబట్టి దీనికన్యంగా వాస్తవం కాదు. ఙ్ఞానస్వరూపమైన ఆత్మే వాస్తవం. ఈ ఆత్మ ఆత్మగా ఉంటూ అనాత్మగా కూడా భాసిస్తున్నది. ఇలాంటి ఆభాస గనుకనే అది వాస్తవంగా తన పాటికి తాను లేదు. తరంగబుద్బుద తుషారాది రూపాలు జలంకంటే అన్యంగా వాస్తవంగా ఎలా లేవో అలాగ. ఇంతకూ ఏమిటీ అనాత్మ. జీవుడూ జగత్తూ ఈశ్వరుడూ. ఈ మూడూ అనాత్మే. ఙ్ఞానానికి గోచరించ వలసిందే ఎప్పుడూ. అందుకే ఆత్మకు వేరుగా లేవెక్కడా. కేవలం దాని ఆభాసలు.

ఇదీ అద్వైతుల పరిష్కారం. దీనివల్ల మిగతా ద్వైతులందరూ ఏకరువు పెట్టే పదార్ధాలన్నీ ఎగిరిపోయాయి. ఉన్నదొకే ఒక పదార్ధమని తేలిపోయింది. ఒకే ఒకటి అది నా స్వరూపమే నన్నప్పుడిక కార్యకారణ సంబంధాని కర్థం లేదు. రెండుంటే గదా కార్యమనీ కారణమనీ ప్రసక్తి. ఉన్నదొక్కటేనని తీర్మానించి నప్పుడిక సంబంధమేమిటి. సంబంధం లేకుంటే ఆరంభ పరిణామవాదాల కిక అర్థమే లేదు. వివర్తమే చెప్పుకోవలసిన మాట. వివర్తమేమిటి. కారణమే కారణరూపంగా కార్యరూపంగా రెండు విధాలుగా ఒక్కటే కనపడుతుంటే అది వివర్తం. ప్రస్తుతం ఆత్మే ఆత్మగానూ జీవ జగదీశ్వరులనే అనాత్మగానూ భాసిస్తున్నది గాబట్టి జలంగా తరంగ బుద్బుదాదులుగా కనినిపించేదంతా సముద్రమే నన్నట్టు అంతా అత్మే. "ఇదం సర్వం యదయ మాత్మా' అని ఉపనిషత్తు చాటిన సత్యమిదే.

అలాంటప్పుడిక ఆకాంక్ష కూడా లేకుండా పోయింది. దీని తరువాత ఏమిటి అనే ప్రశ్నకు తావిస్తూ పోతే దాని కాకాంక్ష అని పేరు. జీవ జగదీశ్వరులుగా కనిపించే అనాత్మ కూడా ఆత్మ విస్తారమే విభూతేనని ఎప్పుడు తీర్మానించామో ఇక ఏమి మిగిలిందని తరువాత ఏమిటని అన్వేషించటానికి. అంచేత ఆకాంక్షే లేదు. ఆకాంక్ష లేకపోతే జనన మరణాది జీవిత సమస్యలన్నీ బలాదూరయి పోయాయి. సమస్య అనేదుంటే గదా దాన్ని పరిష్కరించుకొనే ప్రయత్నం. సమస్యే లేదిప్పుడు. ఎందుకంటే జీవుడనే వాడు కూడా జీవుడు కాదు - ఆత్మేనన్నప్పుడు వాడికి సంబంధించిన జనన మరణాదుల కర్థమేముంది. వాడే లేకుంటే వాటికసలే అవకాశం లేదు. వాడూ ఆభాసే. అవీ ఆభాసే. అసలు జగత్తూ దీన్ని సృష్టించాడని ఊహించే ఈశ్వరుడే ఆభాస. ఇక జీవుడి అస్తిత్వాని కాస్కారమేముంది. వాడి జీవితానికీ జీవిత సమస్యలకూ అంతకన్నా ఆస్కారమేముంది. అంతా హుళక్కే. కనుకనే అద్వైతమనేది మిగతా ద్వైతమతాలలాగా ఒక వాదం కాదు. అన్ని వాదాలకూ ఆఖరి దశ కేవలం సిద్ధాంతమేనని మొదటనే నేను మనవి చేసింది.

ఇంకొక్క మాట. వాదాలంటే మీరేమనుకొంటున్నారో. ఆనాటి సాంఖ్యయోగాదులైన వాదాలే శాస్త్రాలేనని భావిస్తున్నారేమో. అవే కాదండి. ఈనాడు అణుశాస్త్రం దగ్గర నుంచీ అంతరిక్షశాస్త్రం దాకా ఎన్నో పరిశోధనలు చేసి ఎన్నో క్రొత్త విషయాలన్నీ లోకానికి బయటపెట్టి బోధిస్తున్నామని విర్రవీగే భౌతిక శాస్త్రఙ్ఞులూ వీరి భౌతిక పరిశోధనలూ ఇవన్నీ కూడా అవి పరిశోధనలూ కావు. క్రొత్త విషయాలూ కావు. అసలవి సత్యాలే కావు. కారణం ఒక్కటే. అద్వైత ఙ్ఞానమనేది రామబాణం లాగా అది ఆనాటి శాస్త్రాలకూ ఈనాటి శాస్త్రాలకూ అన్నిటికీ జవాబు చెబుతుంది. అది ఎలాగని అడుగుతారేమో. అప్పటి వారైతే నేమి ఇప్పటివారైతే నేమి. వీరందరూ చేస్తూ వచ్చిన చేస్తున్న పరిశోధనలన్నీ ఆభాసలోనేగాని వస్తువులో గాదు. ఆకాశంలో ఎగిరే పావురం వస్తువు Fact. ఎండలో నేలమీద ఎగురుతూ పోయేది దాని నీడ. అది పావురం కాదు. ఒక వేటకాడు తన బాణం ఆ నేలమీద పోయే పావురం నీడ మీద ఎక్కుపెడితే ఎలా ఉంటుంది. అది తన బాణం సోకి పడిపోయిందంటే ఎలా ఉంటుంది. అలాంటిదీ వీరి పరిశోధనలూ, వాటి ఫలితాలన్నీ. వాస్తవం కావివి. వాస్తవం ఒక్క ఆత్మ పదార్ధమే. అది ప్రకాశమైతే దాని తాలూకు ఛాయలూ ఆభాసలూ ఇవి. ఆభాసను పట్టుకొని నీవెంత కృషి చేసినా లోకానికేది చెప్పినా అది సత్యమెలా అవుతుంది. సత్యం చెబుతున్నాననేది నీ భ్రమ. ప్రమ గాదు. కనుకనే ఇవన్నీ కేవలం వారి వారి మతాలే వాదాలేగాని సిద్ధాంతం కాదని మాటిమాటికీ చాటి చెప్పటం. నూటికి తొంభయి తొమ్మిది ఇలాటి వాదాలుగా మిగిలిపోతే నూరవదొక్కటే సిద్ధాంతం. అది అద్వైత శాస్త్రం తప్ప మరేదీ కాదు.

అయితే ఇప్పుడొక ప్రశ్న. అవన్నీ వాదాలే గాని సిద్ధాంతం కావని కొట్టివేశారు. అద్వైతమొక్కటే సిద్ధాంతంగా చివరకు మిగిలేదని తీర్మానించారు. అద్వైతం గనుక జీవిత సమస్యకిక తావేలేదు. అన్నీ ఎక్కడివక్కడ పరిష్కారమయి పోతాయని కూడా హామీ ఇచ్చారు. బాగానే ఉంది. ఇదంతా వినటానికి చాలా ఇంపుగా ఉందేగాని హేతువాదానికి నిలుస్తుందా, ఈ సిద్ధాంతం మానవుడి అనుభవానికి వస్తుందా అని ప్రశ్న. ఇది ఏ ఒక్కరికో గాదు. ఏమీ తెలియని లోకుల దగ్గరి నుంచి ఎంతో తెలిసిందనే ప్రఙ్ఞావంతులైన శాస్త్రఙ్ఞుల వరకూ నిలదీసి అడిగే ఏకైకమైన ప్రశ్న. దీని కద్వైతి ఏమని సమాధానమిస్తాడు - అది ఎంత సహేతుకంగా నిరూపించగలడనేదే ఇప్పుడు పరిశీలించవలసి ఉంది.

అద్వైతి చెప్పేదేమంటే సృష్టిలో నీవే పదార్ధమైనా తీసుకొని చూడు. మానవుడి మనోభావాల దగ్గరి నుంచి బాహ్యమైన ఆకాశం వరకూ ఏదైనా సరే. ప్రతి ఒక్కదానిలో రెండు భాగాలుంటాయి. ఒకదానితో ఒకటి అవినాభావంగా కనిపిస్తాయి. ఒకటి సామాన్యం మరొకటి విశేషమని పేరు పెడతారద్వైతులు. ఇంతెందుకు. ఒక ఘటమో ఒక ఆభరణమో ఎదైనా సరే. బాగా తరచి చూశావంటే ఘటమనేది ఒకటి గాదు. అందులో రెండున్నాయి. మట్టి ఒకటి, ఆ ఘటం రూపమొకటి. ఇందులో మట్టి సామాన్యం. ఘటరూపం విశేషం. అలాగే ఒక ఆభరణంలో బంగారం సామాన్యం. ఆ కంటెలో, కాసుల దండలో వాటి ఆకారాలు విశేషం. కాగా ఈ విశేషాలనేవి ఒకదాని నొకటి వ్యాపించలేవు. దేనిపాటికదే. కంటె కమ్మగాదు. కమ్మ గాజు గాదు. గాజు ఒడ్డాణం కాదు - అంతే కాదు. ఏ ఒక్క విశేషమూ మొత్తం సామాన్యాన్ని వ్యాపించలేదు. ఒక కంటె లోకంలో ఉండే బంగారమంతా అదేగాదు. దాన్ని మించి ఉందా బంగారం. బంగారం సామాన్యమని గదా చెప్పాము. సామాన్యం గనుకనే అది కంటెలు, కాసుల దండలు ఇలాంటి ఆభరణ విశేషాలన్నిటినీ సమానంగా వ్యాపిస్తుంది. వాటి లోపలా వెలుపలా అంతా బంగారమే. అంత మాత్రమే గాదు. వాటన్నిటినీ వ్యాపించటమే గాక వాటిని మించి కూడా ఉంది ఎంతైనా. అంటే అవి లేకపోయినా తన పాటికి తానుండగలదు సామాన్యం. మరి సామాన్యం లేకపోతే దాని విశేషాలొకటి కూడా స్వతంత్రంగా ఏ మాత్రమూ ఉండలేదు. సామాన్యమందులో నుంచి తొలగిపోయిన మరుక్షణం పత్తా లేకుండా పోతుంది. నామరూపాలే ఉండవు దానికి.

ఇదీ సామాన్య విశేషాలకుండే సంబంధం. లోకంలో ప్రతి ఒక్కటీ సామాన్య విశేష సంబంధమున్నదేనని గదా పేర్కొన్నాము. ఈ సూత్రాన్నే ఎక్కడికక్కడ ఆగిపోకుండా మనం కొనసాగిస్తూ పోతే ఒక చెట్టుంది. దాని విత్తనముంది. చెట్టుముందా దాని విత్తనం ముందా అని ప్రశ్న వస్తుంది. రెండూ కావు. రెండూ కలిసి విశేషాలే. ఆ విశేషాలను రెండింటినీ వ్యాపించి ఉన్నది పృథివీతత్వం. భూమి అనేది లేకపోతే వృక్షం లేదు, బీజం లేదు. రెంటికీ అస్తిత్వమే లేదసలు. మరి ఆ రెండూ లేకపోయినా పృథివి కేమీ కొరత లేదు. అది తనపాటికి తాను దర్జాగా ఉండగలదు. ఇది మనందరికీ అనుభవసిద్ధమే.

కాగా ఇంకా ముందుకు సాగిపోతే మనం - ఈ పృథివి ఎక్కడి నుంచి వచ్చింది. జలం నుంచి. జలం దానికి కారణం. ఇది దానికి కార్యం. ఆ కారణం సామాన్యమైతే కార్యం దాని విశేషం. జలం గట్టిపడి బాగా ఘనీభవిస్తే అది పృథివి అయింది. మరి జలమెక్కడి నుంచి వచ్చింది. తేజస్సు చల్లబడి జలమయింది. తేజస్సుకేమిటి మూలం. చలనాత్మకైన వాయువు ఘర్షణ చెంది ఉష్ణగుణమైన తేజస్సయింది. వాయువెక్కడి దంటారు. అచలమైన ఆకాశమే చలించి వాయువయిందంటాడు అద్వైతి. మంచిదే. ఈ ఆకాశమెక్కడిదని అడిగితే అక్కడి కాగిపోతారు మామూలు లోకులూ శాస్త్రఙ్ఞులూ అందరూ. అంతకన్నా పైకిపోయి దానికి మూలమేమిటో అన్వేషించి పట్టుకొనే సామర్ధ్యం లేదెవరికీ. కాని అద్వైతి అలా ఆగిపోడు. ఇంకా ముందుకు సాగిపోతాడు. ముందుకు పోతే అతనికి కనిపించేదొక్కటే. అది కేవలం తన స్వరూపమే. తన ఙ్ఞానమే. దానికే ఆత్మ అని పేరు. పోతే దానికి గోచరించేవి ఆకాశం దగ్గరి నుంచీ ఈ భూత భౌతిక పదార్ధాలన్నీ అనాత్మ కిందకి వస్తాయి. కనేది ఆత్మ కనిపించేది అనాత్మ. కనేది ఒక్కటే ఙ్ఞానం. అందులో తేడా లేదు. పోతే దానికి కనిపించేవి మాత్రం సవాలక్ష. అది కనిపించేది కాదు. ఈ కనిపించేవి కనేది కావు. జీవ జగదీశ్వరులనేవి మూడూ ఙ్ఞానానికి గోచరించేవే గనుక ఆత్మ కావు. అనాత్మ.

కావచ్చు. అప్పటికీ ఆత్మ అనాత్మ అని రెండు పదార్ధాలు చెబుతున్నారు గదా మీరు. అది అద్వైతమెలా అయింది. అద్వైత మన్నప్పుడొకే ఒక పదార్ధం కావాలి గదా అని ప్రశ్న వస్తుంది. దాని కద్వైతి చెప్పే సమాధానమేమంటే ఆత్మనాత్మాలని మేము రెండుగా పేర్కొన్న అవి రెండూ వేర్వేరు పదార్ధాలు కావు. రెండూ కలిసి వాస్తవంలో ఒక్కటే. ఎలాగంటే ఆత్మ అంటే కేవలం ఙ్ఞానమేనని గదా చెప్పాము. ఙ్ఞానమే ప్రమాణం దేనికైనా. ప్రమాణం లేకపోతే ఏది గానీ ఉందని చెప్పలేము. దానికి అస్తిత్వమే లేకుండా పోతుంది. ఒకటి ఉందని చెప్పావంటే ఎలా చెప్పగలిగావు. ఙ్ఞానంతోనే గదా. ఙ్ఞానం లేదు అయినా అది ఉందా పదార్ధమని చెప్పావంటే దానికర్ధం లేదు. అదుగో రూపం నాకు కనిపిస్తూనే ఉంది గాని నాకు మాత్రం కళ్లు లేవని చెప్పినట్టుంటుంది, ఙ్ఞానమే ప్రమాణమని గదా అన్నాము. అప్పటికి ఙ్ఞానమనే ప్రమాణం మీద ఆధారపడే ఙ్ఞేయమైన ప్రపంచాని కస్తిత్వం. లేకుంటే అది నాస్తే. మరి ఙ్ఞానాని కేమిటి ప్రమాణమని అడుగుతావేమో. ఙ్ఞానమంటేనే ప్రమాణం. దానికి వేరే ప్రమాణ మక్కరలేదు. వెలుగు లేని దానికైతే వెలుగు కావాలి. అది వెలుగే అయినప్పుడిక దానికి మరలా వెలుగు దేనికి. ఙ్ఞానం తనకు తానున్నాని గ్రహిస్తూ తనకు గోచరించే ఙ్ఞేయ ప్రపంచాన్ని కూడా ఉన్నదని గ్రహించగలదు.

కనుక ఙ్ఞేయమైన పదార్ధానికి దేనికీ స్వతంత్రమైన అస్తిత్వం లేదు. ఙ్ఞానం తాలూకు అస్తిత్వమే దాని అస్తిత్వం. దాని స్ఫురణే దీని స్ఫురణ. దాని మూలంగానే ఇది ఉంటూ ఉంది, ఉన్నట్టు స్ఫురిస్తూ ఉంది గనుక ఙ్ఞేయ ప్రపంచం తన పాటికి తాను వాస్తవం కాదు. ఙ్ఞానస్వరూపమైన ఆత్మే వాస్తవం. అవాస్తవమైనా ఎలా కనిపిస్తున్నదీ అనాత్మ అని అడిగితే అది గాదు కనిపించటం. ఆత్మే అలా అనాత్మరూపంగా తనుకు తానే కనిపిస్తున్నది. అంతేగాని అనాత్మ అంటూ ఆత్మకు భిన్నంగా వేరుగా మరొక పదార్ధమేదీ లేదు పొమ్మంటారు అద్వైతులు. ఇది ఎలాంటిదంటే ఎండలో మనం నడచిపోతుంటే మన శరీరచ్ఛాయ మనకు కనిపిస్తుంది. అలా కనిపిస్తున్నా అది మన నీడే మన శరీరమేనని చూస్తామేగాని అదేదో శరీరంకన్నా వేరే పదార్ధమని చూడంగదా. అలాగే ఆత్మ తాలూకు ఒక నీడలాంటిదీ అనాత్మ ప్రపంచమనేది. దీనికే ఆభాస అని పేరు పెడతారు అద్వైతులు. ఆత్మే అలా అనాత్మగా భాసిస్తున్నదని అర్ధం. ఆభాస అనేది వస్తువు కాదు. కాబట్టి వాస్తవంగా ఉన్నదప్పటి కాత్మ అనేదొక్కటే. కనుక అద్వైత సిద్దాంతానికి భంగం లేదు. ఇదం సర్వం యదయ మాత్మా. ఈ అనాత్మగా నీవు భావించేదంతా ఆత్మే సుమా అని ఉపనిషత్తు చాటి చెప్పిందంటే ఈ అద్వైత భావాన్ని ఉద్దేశించే.

అనాత్మ అంతా ఆభాస అని ఎప్పుడు తీర్మానించామో అప్పుడు జీవుడూ జగత్తూ ఈశ్వరుడూ అనేవి మూడూ అబద్ధమే. ఆత్మగానే సత్యంగాని అవి అనాత్మగా కాదు. అంటే ఆత్మకు వేరుగా ఎక్కడా లేవు. ఒక రజ్జు సర్పాన్నంతటినీ రజ్జువే ఎలా వ్యాపించి ఉందో అలాగే అనాత్మగా భాసించే వీటి మూడింటినీ ఆత్మే వ్యాపించి ఉంది. అది ఎలాగా అని ఆశ్చర్యపడనక్కర లేదు. ఈ మూడింటిలో ప్రతి ఒక్కటీ నీ ఙ్ఞానానికి స్ఫురిస్తూనే గదా ఉంది. స్ఫురించకపోతే ఉందని చెప్పగలవా. లేదు. అలా అది స్ఫురిస్తూ ఉందంటే నీ స్ఫురణలోనే గదా స్ఫురించవలసింది. స్ఫురణతో స్పర్శ లేకుంటే అది స్ఫురించగలదా. స్ఫురించే పదార్ధాలన్నీ విశేషాలైతే స్ఫురణ అనేది సామాన్యం. మన సామాన్య విశేష సూత్రాన్ని ఇక్కడ అన్వయించి చూడు. స్ఫురించే పదార్ధాలన్నీ విశేషాలైతే స్ఫురణ అనేది వాటన్నిటినీ వ్యాపించిన సామాన్యం. మనసులో కలిగే ఆలోచనలేమిటి అనుభవాలేమిటి. వాటికి నామాలని Ideas పేరు. వాటికనుగుణంగా బాహ్యంలో కనిపించే ఆయా జడ చేతన పదార్ధాలేమిటి. వాటికి రూపాలని Things పేరు. వాటి రెంటికీ మధ్య నడిచే వ్యవహారమేమిటి. దానికి క్రియ Transaction అని పేరు. మనోభావాల దగ్గరి నుంచీ బాహ్యమైన ఆకాశం వరకూ అంతా నామరూప క్రియాత్మకమే ఈ సృష్టి. ఇందులోనే చెప్పుకొన్నా మింతవరకూ సామాన్య విశేషాల సంబంధాన్ని మనం. పోతే ఈ మొత్తం విశేషాలైతే ఈ మొత్తాన్ని వ్యాపించిన సామాన్యమిది. అందుకే దీన్ని మహా సామాన్యమని పేర్కొన్నదుపనిషత్తు.

ఇదుగో ఈ మహాసామాన్యమే ఆత్మ. స్ఫురణ అనండి. ఙ్ఞాన మనండి- ఆత్మ అనండి. అంతా ఒకటే. నేను నేననే ప్రఙ్ఞ. అదే ఈ నామరూపాది విశేషాలన్నింటినీ ఆవరించి ఉంది. ప్రతి ఒక్కటీ అది సామాన్యమైనా విశేషమైనా దాని దృష్టితో చూస్తే విశేషమే. ప్రతి విశేషంలోనూ లోపలా వెలుపలా అదే వ్యాపించి నప్పుడిక నామరూపాదులన్నీ దాని ఆభాస కాక తప్పదు. అంటే ఆత్మ చైతన్యానికి అన్యంగా ఏ ఒక్కటీ సత్యం కాదు. అందులో ఉన్న స్ఫురణే సత్యం. దానిలో స్ఫురించే ఆ పదార్ధం హుళక్కే. అనాత్మ పదార్ధాలన్నీ ఆత్మ వ్యాపించి నప్పుడనాత్మకిక చోటెక్కడిది ? అదీ ఆత్మే కావలసి ఉంది. అలాంటప్పుడిక ఒక జీవుడని వాడి జీవితమని అందులో వాడికేర్పడే కష్టసుఖానుభవాలని ఆఖరుకు జననమరణాలని, లోకంతర జన్మాంతరాలని - ఈ భావాల కసలాస్కారమే లేదు గనుక సమస్యలన్నీ వేటిపాటి కవి సులువుగా పరిష్కారమయి పోయాయి. ఎందుకంటే అవన్నీ ఆత్మ తాలూకు ఆభాసలే. ఆభాసలన్నీ విశేషాలే. ప్రతి విశేషంలో ఆత్మ హాజరయి ఉంది. ఆత్మ అంటే నేననే స్ఫురణే గదా. జననంలో మరణంలో కూడా స్ఫురణ అలాగే ఉన్నప్పుడిక దానికి జనన మరణాలెలా ఏర్పడగలవు? వాటిని కూడా అదే వ్యాపించి ఉన్నప్పుడవి దానికెలా సంభవం. విశేషమెప్పుడు గానీ సామాన్యాన్ని దెబ్బ తీయలేదని గదా పేర్కొన్నాము. కాబట్టి అద్వైతమొక్కటే సమస్యలన్నిటికీ పరిష్కారం. అందుకే మిగతావన్నీ వాదాలైతే అద్వైత మొక్కటే సిద్ధాంతమని ముందుగానే చాటి చెప్పాము.

అయితే సిద్ధాంతం వినటానికి చాలా బాగుంది గాని అది సిద్ధాంతంగా మాత్రమే నిలిచిపోతే ప్రయోజనం లేదు. మన అందరి అనుభవానికి కూడా సరిపడి ఉండాలెంత సిద్ధాంతమైనా. లేకుంటే తీర్థానికి తీర్థం. ప్రసాదానికి ప్రసాదం. పైగా సమస్యనది పరిష్కరిస్తుందని సంతోషిస్తున్నారే గాని అది మన గొంతెమ్మ కోరిక. జనన మరణాదికమైన సమస్య మానవుడి అనుభవంలో ఉన్నప్పుడు దానికి చేసే పరిష్కారం కూడా అనుభవానికే రావాలిగాని కేవలమది వాగ్రూపంగా శ్రవణం చేస్తే సరిపోదు. మీరు చెబుతున్నదీ వాక్కే. మేము వింటున్నదీ వాక్కే. అది అనుభవం కాదు. కష్టసుఖాలు లేవని చెప్పిన మాత్రాన లేకుండా పోవు. మరణం లేదని తీర్మానించిన మాత్రాన మానవుడు మరణించకుండా పోవటం లేదు. అంచేత అద్వైత సిద్ధాంతం కేవలం మాటేనా - మానవుడి అనుభవానికి కూడా వస్తుందా అని ఇప్పుడు ప్రశ్న.

ఎందుకంటే ఆత్మే మహా సామన్యం. నామరూపాది పదార్ధాలన్నింటిలో అదే వ్యాపించి ఉందని గదా సిద్ధాంతం. ఆత్మ అంటే ఏమిటి. నేననే ఒకానొక స్ఫురణే గదా. ఆ నేననే స్ఫురణ ఇప్పుడు మనందరిలో ఉండనే ఉంది. క్రొత్తగా తెచ్చిపెట్టుకోబని లేదు. అలాంటప్పుడు నేను ఈ నామరూప ప్రపంచాన్ని అంతటినీ వ్యాపించి ఉన్నాను - ఇవన్నీ నా విశేషాలేనా. ఆభాసలే నాకంటే అన్యంగా ఏదీ లేదీ ప్రపంచంలో - జనన మరణాదులు కూడా నా ఆభాసలే - నాకవి వాస్తవంగా లేవనే గొప్ప అనుభవం - మనలో ప్రతి ఒక్కరికీ కలగాలి గదా. ఎందుకు కలగటం లేదని ప్రశ్న. నిజమే. కలగాలిసిందే. కాని అలా కలగకపోవటానికి కారణమీ దేహాత్మాభిమానమే నంటాడు అద్వైతి. సర్వ వ్యాపకంగా కాక కేవలమొక శరీరం మేరకే దించి ఇదే ఆత్మ అని భావిస్తున్నాము మనం. ఆత్మ ఇందులోనే జీవిస్తూ ఉన్నదని మరెక్కడా జీవించటం లేదని భావించేసరికి సర్వాత్మ భావం జీవాత్మగా మారి కనిపిస్తున్నదిప్పుడు. ఆత్మ అంటే స్ఫురణ లేదా నేననే భావం. అది శరీరంలోనే జీవిస్తున్నది గనుక రెండూ కలిసి జీవాత్మ అనే పేరు వచ్చింది. అంతే కాదు. ఈ ఒక్క శరీరాన్నే నమ్ముకొని ఇదే నేనని అభిమానించటం మూలాన ఇది అసలైన ఆత్మకు దూరమై నకిలీ అత్మగా చెలామణి అవుతున్నది. కనుక దీనిని జీవాత్మ అనేగాక మిధ్యాత్మ అని కుడా వ్యవహరిస్తారద్వైతులు. ఇదెప్పుడీ మిధ్యాత్మ శరీరం మేరకే ఆగిపోయిందో ఇదే నేనని భావించిందో దీని చుట్టూ ఉన్నది నేను కాదని భ్రమలో పడ్డది. నేను కాకపోతే ఏమిటది. నాది. అది ఆత్మ అయితే ఇది ఆత్మీయం. దాని మీద ఎంత అభిమాన ముందో వచ్చీపోయి అలాంటి అభిమానమనే గుణంతో ఇండ్లూ వాకిండ్లూ పెండ్లాం బిడ్డలూ ఆస్తులూ పాస్తులూ కూడా చూచుకొంటున్నది కాబట్టి జగత్తు గౌణాత్మ అని చెలామణి అయింది. అది జీవాత్మ ఇది గౌణాత్మ.

కాబట్టి ఇది ఎందుకిలా జరిగిందని గాదు మనం వేయవలసిన ప్రశ్న. ఎలా పోతుందని అసలైన నా స్వరూపాన్ని ఎలా పట్టుకొని దీనిలో నుంచి బయటపడాలని. ఎలా వచ్చిందనే ప్రశ్న భూత కాలానికి సంబంధించింది. అది సమస్యని చెబుతుందే గాని మరేమీ కాదు. మరి ఎలా పోతుందని వేయాలి ప్రశ్న. అది భవిష్యత్తుకు సంబంధించిన ప్రశ్న. సమస్యకు పరిష్కారాన్ని సూచిస్తుందది. మనమిప్పుడు వర్తమానంలో ఉన్నాము మనకు కావలసింది సమస్య నలాగే నెమరు వేయటం కాదు. దానికి పరిష్కారమేమిటా అని అన్వేషించి పట్టుకోవడం. అంచేత ఎలా వచ్చిందో ఏమో మనకక్కరలేదు. అఙ్ఞానమింకా వదలలేదు కాబట్టి అది తేలేది గాదు. అందుకే అనిర్వచనీయమని త్రోసిపారేస్తా రద్వైతులు. వారు మనకిచ్చే సలహా ఏమిటంటే సమస్య పరిష్కరించుకొనే మార్గం చెబుతాం వినండి. అది పాటించావంటే పాటించి ఫలితం పొందావంటే - అసలీ సమస్య ఎందుకు వచ్చిందనే ప్రశ్నకు కూడా సమాధానం వస్తుంది. ఆ మాటకు వస్తే అసలప్పుడు సమస్యే మనసుకు రాదడగటానికి. స్వప్నంలో నుంచి మెలకువ వస్తే ఎవడు ప్రశ్నిస్తాడీ స్వప్నం నాకేలా వచ్చింది ఎందుకు వచ్చిందని. నీ మెలకువే చెబుతుందదంతా అబద్ధం దాన్ని గురించి ఎందుకాలోచిస్తావని. అలాగే మిధ్యాత్మ ఏమిటి గౌణాత్మ ఏమిటి ఎందుకిలా ఇవి ఏర్పడ్డాయని గాదు. ఇవి ఎలా తొలగించుకొని బయట పడాలని సాధన మార్గమన్వేషించాలి మనమంటారద్వైతులు. సాధన చేసి సిద్ధికి నోచుకున్నామంటే చాలు - అప్పుడిదంతా స్వప్నంలాగా ఆభాస అని మనకే తెలిసిపోతుంది. ఇక ప్రశ్నేముంది జవాబేముంది.

అయితే సాధన చేయనంత వరకూ సమగ్రమైన పరిష్కారాన్ని మనమెప్పటికీ ఆసించలేము. సమస్య సమస్యగానే మిగిలిపోతుంది. ఎందుకంటే విశేషఙ్ఞానమే ఉంటుందిగాని మనకప్పుడు సామాన్యఙ్ఞాన గంధం కూడా ఉండదు. విశేష ఙ్ఞానమే అఙ్ఞానమని గదా పేర్కొన్నాము. అద్వైత ఙ్ఞానం లేదు. ద్వైత ఙ్ఞానముంది. అదీ అఙ్ఞానమంటే. ఇలాంటి ద్వైత ఙ్ఞానంలో బ్రతుకుతున్నంత వరకూ శరీరం మేరకే ఉన్న ఈ జీవుడూ వాస్తవమే. వీడు చూచే జగత్తూ వాస్తవమే. ఈ రెంటికీ అతీతంగా ఉండి వీటికి నియామకుడైన ఈశ్వరుడూ వాస్తవమే. జీవుడి జనన మరణాలూ ప్రపంచంవల్ల వాడికి జీవితంలో కలిగే కష్టసుఖాలూ అనుభవాలూ అన్నీ సత్యమే అవుతాయి. స్వప్నంలో తిరుగుతున్నంత వరకూ ఆ స్వప్నానుభవమంతా సత్యమనే గదా మనం భావిస్తాము. అలాగే ఇదంతా సత్యమే మన దృష్టికి. దీనికే వ్యావహారిక సత్యమని పేరు పెట్టార ద్వైతులు ఒక స్వప్నంలాంటి దశ ఇది. స్వప్నం సత్యమా గాదా. దానితో వ్యవహరిస్తున్నంత వరకూ అది సత్యం. తెల్లవారితే ఏదీ సత్యం కాదు. ఆ దొంగలు తరుముకొని రావటం లేదు. ఆ లాటరీ డబ్బు లెక్కపెట్టుకోవడం లేదు. అసలదంతా చూచే మనమూ లేము. మనకు కనిపించే ఆ ప్రపంచమూ లేదు. అలాగే ఇప్పుడీ నేననుకొనే జీవుడూ వీడు చూచే ఈ జగత్తూ ఇందుమూలంగా కలిగే కష్టసుఖాలూ అన్నీ దీనితో వ్యవహరిస్తున్నంతవరకే ఇది నిజం. ఈ నిజమే అసలైన నిజమనుకొని వ్యవహరిస్తున్నారు లోకులంతా. లోకులే గాదు. ఆయా శాస్త్రఙ్ఞులు నిత్యమూ సాగించే పరిశోధనలూ వాటి ఫలితాలూ అవీ ఇలాటి నకిలీ బాపతే. అంతే కాదు. మీమాంసకులు కల్పించుకొన్న యఙ్ఞయాగాది క్రియలూ వాటివల్ల ప్రాప్తిస్తాయని భావించే స్వర్గసుఖాదులూ జన్మాంతర లోకాంతరాలలో పొందుతామను కొనే అభ్యుదయమూ - ఉపాసకులు కలగంటున్న దేవతలు వారి సాయుజ్యమూ - ఈ కలాపమంతా వట్టి ఆభాసే. అసలైన సత్యం కాదు. కనుకనే మానవుడా క్షేత్రంలో ఎంత ఙ్ఞానం సంపాదించినా కృషి చేసినా అదంతా స్వప్నంలో పొందిన ఙ్ఞానమూ అనుభవంలాగా మిధ్యాభూతమే. అసలైన సత్యంగాదు. వ్యవహారిక సత్యమంటే ఇదే అర్ధం. దానివల్ల మన జీవిత సమస్యకెప్పుడూ శాశ్వతమైన పరిష్కారం లేదు.

అయితే మరేమిటి పరిష్కారం. అది విశేష ఙ్ఞానం వల్ల ఎప్పటికీ ఆసించలేము. సామాన్య ఙ్ఞానమే దానికి సాధనం. దానికే పారమార్ధిక సత్యమని నామకరణం చేశార ద్వైతులు. వ్యావహారికం స్వప్నం లాంటిదైతే ఇది జాగ్రత్తులాంటిది. ఇందులో విశేషానికి చోటు లేదు. జీవజగదీశ్వరులు మూడూ విశేషాలనే గదా మొదటినుంచీ చెబుతూ వచ్చాము. ఇక్కడ జీవుడనే మిధ్యాత్మ లేదు. జగత్తనే గౌణాత్మ లేదు. దీని కతీతంగా ఊహించే ఈశ్వరభావం లేదు. జీవుడే లేడు కాబట్టి జనన మరణాలూ కష్టసుఖాలూ లోకాంతర జన్మాంతరాలనే ప్రసక్తి అసలే లేదు. అంతా హుళక్కే అన్నింటి స్థానంలో నిలిచి ఉన్నదొకే ఒక పదార్ధం. ఏదో గాదది. దేశ కాల వస్తువులన్నింటినీ వ్యాపించి నిరాకారంగా నిరుపాధికంగా ఉన్న నేను నేననే ఙ్ఞానస్వరూపమైన ఆత్మ. అదే మనబోటి జీవుల స్వరూపం - మనం చూచే జగత్తుకూ స్వరూపం. ఆ ఈశ్వరుడికీ స్వరూపం. జనన మరణాదులూ కష్టసుఖాలూ జన్మాంతర లోకాంతరాలూ - అన్నింటికీ అదే స్వరూపం ఇదీ పారమార్ధిక సత్యమంటే.

తమాషా ఏమిటంటే మనం వ్యావహారిక దశలో ఉన్నప్పుడు కూడా పారమార్ధికమే ఉంది. అసలీ వ్యావహారికమంతా పారమార్ధికమే ఆ మాటకు వస్తే. అదే జీవ జగదీశ్వరాదులుగా భాసిస్తున్నది. అనుభవానికి వస్తున్నది. అది ఇది గాదు గాని ఇదంతా అదే. దాని ఉపాధులివి. అంటే ఆ సామాన్య ఙ్ఞానమే ఆయీ రూపాలుగా ఆయీ మనోభావాలుగా ఆయీ సుఖదుఃఖాద్యనుభవాలుగా అభివ్యక్తమయి కనిపిస్తున్నది. దాని శక్తి విలాసమే ఇది. అందుకే అది స్వరూపమైతే ఆ ఙ్ఞానం - దాని విభూతే ఈ ఙ్ఞేయ ప్రపంచమంతా నంటారు భగవత్పాదులు. స్వరూపంతో కలిపి పట్టుకోవాలీ ఙ్ఞేయ జగత్తును. అప్పుడే సమస్యకు పరిష్కారం. అలా కాక స్వరూప ఙ్ఞానం లేకుండా దీన్ని చూచినా దీనితో వ్యవహరించినా సుఖం లేదు. ఫలితం లేదు. కృషి అంతా నిష్ఫలమే. సామాన్య ఙ్ఞానమే స్వరూపం. దానికోసమే సాగించాలి ప్రతి ఒక్క మానవుడూ తన ప్రయత్నం. అసలు రహస్యమేమంటే మనం ప్రయత్నం చేసినా చేయకున్నా ఎప్పుడూ సిద్ధంగానే ఉందా ఙ్ఞానం. సిద్ధమే గాని సాధ్యం కాదది. అలాంటప్పుడు ఇక ప్రయత్నం దేనికి. నిజమే - అక్కరలేదు. కాని తనపాటికి తాను వస్తు సిద్ధంగా ఉన్నదే గాని అది మన బుద్ధికి స్ఫురించటం లేదు. ఏదైనా బుద్ధితో పట్టుకొన్నప్పుడే మానవుడి కనుభవం - దానిపాటికది ఉంటే గాదు. ఇప్పుడాకాశ మంతటా ఉంది. లోపలా వెలపలా నిండి నిబిడీకృతమయి ఉంది. కాని దానిమీద దృష్టి లేకుంటే అది ఉన్నా మన గ్రాహితాకు రాదు. దాని అనుభవం కలగదు. అలాగే ఈ సామాన్య ఙ్ఞానం కూడా మన స్వరూపమే అయినా అనుభవానికి రావటం లేదు.

స్వరూపమే అయి అనుభవానికి రాకపోవట మెలాగని అడగవచ్చు. దానికి కారణం విశేషాల తాలూకు ఆలోచనలు. వాటికే వృత్తులని పేరు. ఈ విశేషాకార వృత్తులే జాగ్రత్స్వప్నదశలలో అనుక్షణమూ పనిచేస్తూ మన సామాన్య ఙ్ఞానం మన కనుభవానికి రాకుండా కప్పి పుచ్చుతుంటాయి. ఒక తరంగ సమూహం సముద్ర జలాన్ని కప్పినట్టు ఒక మేఘ మండలమాకాశాన్ని కప్పినట్టు. మరి సుషుప్తి మూర్ఛా మరణాది దశలలో వృత్తులు లయమయి పోయాయిగదా. అప్పుడా సామాన్య ఙ్ఞానమెందుకుగాను పైకి వచ్చి కనపడగూడదని అడుగుతారేమో. విశేషవృత్తులు తాత్కాలికంగా నశించినా అవి పూర్తిగా నశించవు. విశేషవాసనలుగా మారిపోయి ఆ దశలలో అదృశ్యంగా పని చేస్తుంటాయి. అదే అప్పుడు మనకు కలిగే అయోమయావస్థ. ఏదీ తెలియకుండా పడిపోతున్నామంటే విశేషవాసన లుంటాయప్పుడు. అందుకే మరలా మెలకువ వచ్చేసరికవి వృత్తులుగా మారి ప్రత్యక్షమవుతాయి. మరణానంతరం కూడా మరలా జన్మ వస్తుందని శాస్త్రం చెబుతున్నదంటే ఇదే అందులో ఉన్న ఉపపత్తి.

అంచేత అవస్థాత్రయమంతా అటు విశేష ఙ్ఞాన వృత్తులో ఇటు వాటి విశేష వాసనలో రాజ్యం చేస్తుంటాయి కాబట్టి మన సమస్యకు పరిష్కారం లేదు. పరిష్కారమే కావాలంటే ఎప్పటికైనా సామాన్య ఙ్ఞాన మలవడాలి. అది ముందు వృత్తిరూపంగా ఉదయించి క్రమంగా బలపడి వాసనగా మారాలి. దానికే ఆత్మాకార లేదా బ్రహ్మాకార వృత్తి అనీ బ్రహ్మ వాసన అనీ పేరు అద్వైతంలో. వృత్తికి వృత్తి జవాబు చెబితే, వాసనకు వాసనే చెప్పాలి జవాబు. ఈశావాస్యమని శాస్త్రం చెబుతున్నదంటే దాని తాత్పర్యమిదే. ఏతావతా సాధకుడు ప్రప్రధమంగా ఈ అద్వైత రూపమైన సామాన్య ఙ్ఞానమలవరచు కోవాలి. అది మొదట శ్రవణం, తరువాత మననం ఆ తరువాత నిదిధ్యాసన చేస్తేగాని క్రమంగా ఏర్పడదు. వాసనగా మారదు. శ్రవణమంటే ఆత్మ అంటే ఏమిటో, దాని నిజ స్వరూపం గుర్తించటం. మననమంటే అనాత్మగా కనపడేది కూడా ఆత్మే, దానికన్యం కాదని గ్రహించటం. మరి నిదిధ్యాసనమంటే అన్యంగా కనపడుతున్న ప్రతి ఒక్కటి ఆత్మ తాలూకు విభూతే మరేదీ గాదని ఆత్మలోనే దాన్ని ఏకం చేసుకొని చూస్తూ పోవటం. ఇలా జాగ్రత్తగా భావన చేస్తూ పోతే ఆత్మాకార వృత్తి ఏర్పడుతుంది. అది అంతకంతకు బాగా గట్టిపడి వాసనగా మారుతుంది. అది బలమయ్యే కొద్దీ. అనాత్మకు చెందిన విశేష వృత్తులూ వాసనలూ రెండూ పూర్తిగా నశించి సాధకుడు జీవించి ఉండగా జీవన్ముక్తి-ప్రారబ్ధం తీరి శరీరం పడిపోతే విదేహముక్తీ తప్పకుండా లభించి తీరుతాయి.

కాని శ్రవణమననాదుల ద్వారా ఈ సామాన్య ఙ్ఞానమెలా సాధించాలి దాని విధానమేమిటని మనం విచారణ చేయవలసి ఉంది. అది మొదట మనమింతకు ముందు పేర్కొన్న మిథ్యాత్మతో ప్రారంభం కావలసి ఉంది. అంతటా ఉన్న నా ఆత్మస్వరూపం ఈ శరీరం మేరకే ఆగిపోయి ఇదే నేనని దీనితో మమేకమైపోవటం వల్లనే గదా మనం జీవాత్మగా మారిపోయాము. ఈ శరీరాదులు మన ఙ్ఞానం కావు. ఙ్ఞానానికి గోచరిస్తున్న ఙ్ఞేయ పదార్ధమిది. ఇది నా శరీరం. ఇది నా ప్రాణం ఇది నా మనస్సు ఇవి నా ఆలోచనలు. ఇవి నా సుఖదుఃఖాదులూ అని తెలుసుకుంటున్నానంటే తెలుసుకొనే నా ఙ్ఞానం తెలుసుకోబడే ఈ శరీరాదులెలా అవుతుంది. అలాగే ఈ తెలుసుకోబడే శరీరాదులు నా ఙ్ఞానమెలా కాగలవు. ఙ్ఞానానికి గోచరించే ఙ్ఞేయమే అవి. కాని నా అఙ్ఞానం వల్ల ఇవన్నీ నామీద వచ్చిపడ్డాయి. దీనికే అధ్యారోపమని పేరు అద్వైతంలో. ఇప్పుడీ అధ్యారోపం వల్ల నా అనంతమైన స్వరూపం నాకు గుర్తు రావటం లేదు. అది వీటిచేత మరుగుపడింది. కనుక వీటినొక్కొక్క దాన్నీ నేను కాదు, నేను కాదని తొలగించుకొంటూ పోవాలి. దీనికే అపవాదమని పేరు. అలా తొలగిస్తూపోతే చివరకు మనోభావాలు సుఖదుఃఖాదుల వరకూ అవి నేను కాకుండా పోయి నా ఙ్ఞానానికి దారి ఇస్తాయి. ఇస్తే అవి ఇక విశేషఙ్ఞానం కాదు. విశేషాలన్నిటి నుంచీ బయటపడ్డ సామాన్య ఙ్ఞానం. బయటపడితే ఇక శరీరంలోనే ఉండనక్కరలేదు. నిరాకారం గనుక సాకారమైన శరీరం నుంచి బయటికి రాగలదు. ఇలా బయటికి వచ్చిన ఆత్మకు ప్రత్యగాత్మ అని పేరు. మరి బయటికి వచ్చి అక్కడి కాగదు. నిరాకారం గనుకనే ఆకాశంలాగా సర్వత్ర వ్యాపిస్తుంది. ఇలా వ్యాపకమైన ఆ ప్రత్యగాత్మే పరమాత్మ లేదా ముఖ్యాత్మ. మరొక మాటలో చెబితే బ్రహ్మం. ఇంతవరకూ మన అఖండమైన ఆత్మస్వరూపం మనం గ్రహించగలిగితే దానికి ప్రత్యభిఙ్ఞ అని పేరు సాధనమార్గంలో. ఇది పూర్వార్ధం.

పోతే ఇక ఉత్తరార్ధం సాధనలో. దానికి ప్రవిలాపనమని పేరు. ప్రవిలాపన మంటే కరిగించి పారేయటం. దేన్ని కరిగించటమంటే ఆత్మకు భిన్నమైన అనాత్మ ప్రపంచాన్ని. ఏమిటది. జీవుడూ జగత్తూ ఈశ్వరుడూ. ఇదంతా అనాత్మే - అసలాత్మ ఎప్పుడు శరీరం మేరకే తగ్గిపోయిందో అప్పుడీ మూడూ దానికి భిన్నంగా కనిపిస్తూ వచ్చాయి. అంతేగాక వాటి పాటికవి మూడూ వాస్తవంగానే ఉన్నాయనిపించాయి. ఎప్పుడైతే ఆత్మక్షేత్రం విస్తరించి అది శరీరాత్మభావాన్ని వదిలేసి సర్వత్ర వ్యాపించి సర్వమూ తన స్వరూపంగా భావిస్తుందో అప్పుడిక అనాత్మ ఏదీ వాస్తవమూ కాదు నా స్వరూపాని కన్యమూ కాదు. ఇలా అనాత్మ ప్రపంచమంతా ఆత్మ కనన్యమూ, అవాస్తవమూ అని అనుభవానికి రావటమే ప్రవిలాపనం. మరేదీ గాదు. అయితే సర్వమూ మన ఆత్మ స్వరూపమే ఎలా అయింది. అంతకన్నా అన్యంగా ఏదీ వాస్తవంగా లేకపోవటమేమిటి. ఇదంతా అద్వైతులల్లిన కాకిపిట్ట కధ- స్వకపోల కల్పితమే గాని హేతువాదానికే మాత్రమూ నిలవదని ఇటు లోకులకే గాక అటు భౌతికశాస్త్రఙ్ఞులందరికీ మనస్సులో ఉన్న పెద్ద అనుమానం. దీనికి సమాధానమింతకు ముందే చెప్పాము. ప్రతి ఒక్కటీ మనోభావాల దగ్గరి నుంచీ బాహ్యమైన ఆకాశం వరకూ ఉందని చూస్తున్నావు. అలాగే స్ఫురిస్తున్నదని కూడా చూస్తున్నావు. ఈ అస్తిత్వమూ స్ఫురణా తప్పించి ఆ పదార్ధాన్ని చూడగలవా. లేదు. ఇదుగో ఈ సత్తా స్ఫూర్తులే ఆత్మ అంటే. అది సామాన్యమైతే సద్విశేష చిద్విశేషాలే మిగతా పదార్ధాలన్నీ. విశేషాలు వాటి సామాన్యం కంటే అన్యం గావు గనుక అదే ఆయా రూపాలుగా భాసిస్తున్నదని ఎంత శాస్త్రఙ్ఞుడైనా ఒప్పుకోక తప్పదు. కాబట్టి ప్రత్యభిఙ్ఞ కలగాలే గాని ప్రవిలాపన మనేది అనుభవానికి వచ్చి తీరుతుంది. అది ఒక్కటే సాధన.

కాని ఙ్ఞానమనేది మాత్రమే సరిపోదు. దానికి తోడు కర్మాచరణా యోగాభ్యాసమూ ఈశ్వరోపాసనా భక్తీ మంత్రజపాదులూ ఇలాంటి వన్నీ కావలసి ఉంటాయి. వాటి వల్ల కూడా మోక్షం ప్రాప్తిస్తుందని చాలామందికొక అపోహ ఉందీ లోకంలో. అది కేవలం అపోహ మాత్రమే. కారణమేమంటే ఒక పదార్ధం తయారుకావటానికీ - తయారయిన దాన్ని పొందటానికి అయితే కర్మకవకాశం ఉంటుంది. ప్రస్తుత మీ ఆత్మస్వరూప మింతకు ముందే సిద్ధమయి ఉంది. క్రొత్తగా తయారయ్యేది కాదు. అలాగే అది సర్వత్ర పరుచుకొని ఉంది. క్రొత్తగా పొందవలసిందీ కాదు. కనుక కర్మకస లవకాశమే లేదు. అలాగే యోగం కూడా. చిత్తవృత్తులను త్రోసివేసి మనస్సును ఖాళీ చేసుకోటంగాని ఈశ్వర ప్రణిధానం చేయటం గాని అభ్యసించమంటారు యోగులు. త్రోసివేస్తే ఎక్కడికి పోతాయా వృత్తులు. సర్వత్ర ఆత్మే ఉన్నప్పుడందులోకే గదా. అవి కూడా దాని విశేషాలే గదా. వాటిని పరాయిగా చూడటం దేనికి. పైగా ఈశ్వరుడు ఆత్మకు భిన్నమా అభిన్నమా. సర్వత్ర ఆత్మే ఉన్నప్పుడు ఈశ్వరుడు కూడా అదే గదా. ఇక యోగం క్రొత్తగా అభ్యసించటం దేనికి. మరి ఉపాసన అంటారా. దేన్నిఉపాసిస్తావు? ఆత్మనా మరొక దాన్నా. మరొకటి లేనే లేదు. అంతా ఆత్మే - పోనీ దాన్నే ఉపాసిస్తానంటావా. ఉపాసకుడవైన నీవు వేరూ అది వేరూ కాదు గదా. ఇక ఉపాసన ఏమిటి - అలాగే భక్తి కూడా. భక్తుడూ భగవంతుడూ వేరుగాదు కదా ఆయనను వీడు భజించటానికి. ఆత్మస్వరూపంగా ఇద్దరు ఒకటే గదా. అలాగే మంత్ర జపాదులూ. అయితే ఇవన్నీ ఎందుకు చెప్పారు పెద్దలు. కేవలం చిత్తశుద్ధికీ ఏకాగ్రతకూ పనికి వస్తాయని మాత్రమే వీటిని సిఫారసు చేశారు. అంతేగాని ఆత్మ దర్శనానికి కాదు. దానికి ఆత్మఙ్ఞాన మొక్కటే సాధనమని అద్వైతుల మాట.

అంతా అయిన తరువాత ఇక ఈ సాధనవల్ల కలిగేది ఏమిటి. సిద్ధి. అదే గదా మోక్షమన్నారు. అది క్రొత్తగా మనం సాధించేదా కాదా. సాధిస్తే అది అంతకు ముందు లేదని గదా అర్ధం. దీనికేమిటి జవాబని అడిగితే అద్వైతులొక్కటే జవాబిస్తారు. "ప్రాప్తస్య ప్రాప్తిః పరిహృతస్య పరిహారః" - ఉన్నదే ఉందని మరలా గుర్తించటమే మోక్షం. లేనిదే ఎప్పుడూ లేదని గట్టి చేసుకొవటమే సంసార బంధం. అప్పటికి సిద్ధాంతమని, సాధనమని సిద్ధి అని మూడూ వేరుగాదు. సిద్ధాంతమే సాధన. సాధనే సిద్ధి. అంతా కలిసి ఒక్కటే. అసలున్నదెప్పుడూ నిర్వికల్పంగా ఒకే ఒక ఆత్మ అయినప్పుడిక ఏది చెప్పినా అది దాన్ని వికల్పించటమే విభజించి చూపటమే. అదైనా ఎందుకంటే ఉన్నదెప్పుడూ నా స్వరూపమే, అంతకన్నా వేరుగా ఏదీ లేదని నీకు గుర్తు చేయటానికే నంటారు పెద్దలు. 'ఉపదేశాదయం వాదః ఙ్ఞాతే ద్వైతం నవిద్యతే' అని గౌడపాదుల వారి మాట.

పోతే మోక్షావస్థను గురించి ఒక్క మాట. ఆత్మ అన్నా బ్రహ్మమన్నా మోక్షమన్నా మూడూ ఒకే తత్త్వం - అదే మన స్థితి అని గుర్తించా మనుకోండి. అంతేనా మరేదైనా లాభముందా మనకు. ఊరక ఉండటమే అయితే ఇప్పుడీ జడ పదార్ధాల స్థితికీ ఆ స్థితికీ ఏమిటి తేడా. ఉంది. ఇది జడస్థితి అయితే అది పరిపూర్ణ చైతన్య స్థితి. చైతన్యం పరిపూర్ణమైతే దానికి పరిపూర్ణమైన శక్తి కూడా అవినాభావంగా ఉండి తీరుతుంది. అల్పఙ్ఞులమైన మనకే ఇప్పుడంతో ఇంతో శక్తి ఉంటే సర్వఙ్ఞుడైన ముక్తుడికి సర్వశక్తులుండటంలో ఆశ్చర్యమేముంది. శక్తి ఎప్పుడుందో అది ప్రదర్శిస్తే ప్రదర్శించ వచ్చు. లేదా ఊరకే దగ్గర ఉంచుకోవచ్చు - ఒక ఐంద్రజాలికుడి దృష్టాంతం గుర్తు చేసుకోండి తెలిసిపోతుందంటారు అద్వైతులు. అంతేకాదు. ప్రదర్శించటం కూడా నిరంకుశంగా జరగదు. ఆయా జీవులకు కలిగే అనుభవాలను బట్టి అలాగ ప్రదర్శిస్తున్నట్లు భాసిస్తుందంటారు. ఒక రజ్జువు సర్పాకారంగా కనిపించ గలిగినా సర్పంగా నీవు చూడకపోతే అలా కనిపించదు. చూస్తేనే కనిపిస్తుంది. కాబట్టి ముక్తావస్థలో రాగద్వేషాలకు చోటు లేదు. పైగా ఆయా నామరూపక్రియలుగా శక్తి పరిణమిస్తున్నా అది యదార్ధం కాదు. ఇంద్ర జాలంలాగే అది కూడా మాయామయమే. ఆభాసే. పరమాత్మ విభాతే కనుక దానివల్ల మోక్షస్థితి కెలాటి వికల్పమూ వికారమూ సంక్రమించదని కూడా అద్వైతులు పరిష్కారం చేస్తారు.

ఇక్కడికి అద్వైత విఙ్ఞానమంటే ఏమిటో దాని విశిష్టత ఏమిటో అది ఒక్కటే మానవుడి సమస్యలన్నిటికీ పరిష్కారమెలా అయిందో - పూర్తిగా తెలిసిపోయింది మనకు. కనుకనే మిగతావన్నీ మతాలూ కేవలం వారి వారి వాదాలూ అభిప్రాయాలైతే, అద్వైతం వాదం కాదు సిద్ధాంతమయి కూచుంది. ఇలాటి గొప్ప సిద్ధాంతం సాంగోపాంగంగా లోకులకు బోధించి వారి నుద్ధరించటానికే ఉపనిషత్తుల దగ్గరి నుంచీ అవతరించాయి లోకంలో. మాండూక్యం వాచా చెబుతున్నది. 'శివ మద్వైతం చతుర్థం మన్యంతే సఆత్మా సతు విఙ్ఞేయః' అద్వైతమే మోక్షదాయకం అదే ఎప్పటికైనా అనుభవానికి తెచ్చుకోవాలట. పోతే గౌడపాదుల వారు దానిమీద నెపం పెట్టి అద్వైత సిద్ధాంతమంతా నాలుగు ప్రకరణాలలో శ్లోకరూపంగా రచించి మూల సూత్రాలనన్నిటినీ చాటి చెప్పారు. ఆ తరువాత శంకర భగవత్పాదులు దానికే గాక ప్రస్థాన త్రయానికంతటికీ అద్భుతమైన భాష్యం రచించి హేతు దృష్టాంతాలతో అద్వైత సిధ్ధాంతం సాధన సిధ్ధి మూడూ ఏ ఒక్క అంశం బీరు పోకుండా ప్రతిపాదించి కట్టుదిట్టం చేశారు. శాస్త్రీయమైన మార్గంలో గొప్పగా సర్వతోముఖంగా సాగిన విచారణ అది. ఎంత స్వతంత్రంగా సర్వాంగ సుందరంగా బోధించాడంటే అద్వైతమంటే శంకరుల వారే శంకరులే అద్వైతమనే గొప్ప పేరు వచ్చింది లోకంలో.

తరువాత ఆయనగారి శిష్యుడు సురేశ్వరాచార్యులు శాస్త్ర రహస్యాల నన్నిటినీ వివరిస్తూ అద్వైతం మీద ప్రతిపక్షులు చేసే విమర్శలనన్నింటినీ ఎదుర్కొని అన్నిటికీ అన్ని సమాధానాలిస్తూ గురువుగారి భాష్యం మీద గొప్ప వార్తిక గ్రంధాలు వ్రాశారు. అంతేగాక మానసోల్లాసం - నైష్కర్మ్య సిధ్ధిలాంటి ప్రకరణ గ్రంధాలు రచించి సాధకులు కెంతో ఉపకారం చేశారు. అటు పిమ్మట వచ్చిన విద్యారణ్యులైతే నిజంగా విద్యారణ్యులే. ఆయన వేదాంతపంచదశేమిటి, అనుభూతి ప్రకాశమేమిటి, జీవన్ముక్తి వివేకమేమిటి - అన్నీ అమూల్యమైన రత్నరాసులే. సిధ్ధాంతాన్ని మించి సాధనా, సాధనను మించి అనుభవమూ వెదజల్లే రచనలాయనవి. ఇలా చెబుతూ పోతే ఈ గురుశిష్య పరంపర చాలా ఉంది. నిన్న మొన్నటి వివేకానందుని వరకూ సాగుతూ వచ్చిన సంప్రదాయమది.

అసలు శంకరులే శంకరులు. వివేకానందులే వివేకానందులు. ఆయన బాల్యంలోనే సన్యసిస్తే ఈయనా అలాగే సన్యసించారు. ఆయన ముప్పయి ముప్పయి ఆరు సంవత్సరాలు జీవిస్తే ఈయన అలాగే చాలా తక్కువ కాలమే జీవించారు. ఆయనగారారోజులలోనే ఆసేతు శీతాచలం దేశం నలుమూలలా సంచరించి అద్వైత ప్రచారం చేస్తే ఈయన స్వదేశమేగాక విదేశాల వరకూ పట్టుకు పోయి అక్కడి వారందరికీ పంచి పెట్టాడా ఙ్ఞానధనాన్ని. ఆయన గారు తన ప్రచారంలో భాగంగా అక్కడక్కడా మఠాలు స్థాపిస్తే ఈయనా స్థాపిస్తూ వచ్చాడు. అయితే ఇక్కడ ఒక మాట చెప్పవలసి వస్తున్నది. శంకరులు పీఠాలని పీఠాధిపతులని స్వామి అని ఎక్కడా తన రచనలలో పేర్కొన లేదు. పరమహంస సన్యాసి పరివ్రాజకుడనే మాటలే వస్తూంటాయి భాష్యంలో. ఒకవేళ పీఠాలు నలుదిక్కులా స్థాపించటం సత్యమే అయినా వారికి లోకుల దగ్గర అన్న భిక్ష స్వీకరించి వారికి ఙ్ఞానభిక్ష చేస్తూ ఉండమని చెప్పి ఉండవచ్చు. అంతేగాని అద్వైతానికి విరుద్ధంగా అభిషేకాలూ అలంకారాలూ పాదపూజలూ గజారోహణాదులూ అలంకార పాకాలూ ఇలాంటి ఆడంబరాలన్నీ సాగిస్తూ పొమ్మని గాదు. జీర్ణ దేవాలయాలు అక్కడక్కడా ఉద్ధరించి అక్కడ శ్రీచక్ర ప్రతిష్ఠ చేశాడని పేర్కొనటం కూడా సబబు గాదు. అది ఆయన మనస్తత్వానికీ సిధ్ధాంతానికే విరుద్ధం. ఉపాసనా మార్గం పరిణామ వాదాన్ని బలపరుస్తుంది గాని వివర్తవాదాన్ని కాదు. కాబట్టి ఇవన్నీ ఇప్పటి వారి స్వకపోలకల్పనలు. అంతే కాదు. ఆయన పరకాయ ప్రవేశమూ ఆకాశగమనమూ, ఇలాటి మహిమలూ కూడా గురుభక్తి మరీ అతిగా ప్రదర్శించే వారాయన గారికంట గట్టినవే. సౌందర్య లహర్యాది మంత్రశాస్త్ర రచనలు కూడా ఇలాటి అధ్యారోపణలే. అసలద్వైతమంటే ఏమిటో దాని తత్త్వమున్నదున్నట్లు గ్రహించి అలాగే దాని నమలు పరిచే దృష్టి ఉన్న జిఙ్ఞాసువులు నూటికి కోటికొకరుంటే ఎక్కువ. మిగతావారు అద్వైతమంటూనే, శివాద్వైతమనీ శాక్తాద్వైతమనీ ద్వైతా ద్వైతమనీ తొంభయి ఆరు నకిలీ అద్వైతాలు తెచ్చిపెట్టి అసలైన అద్వైతం పూర్తిగా మరచిపోయారు. అందులోనూ కర్మానుష్ఠానం కావలసి నంత చొప్పిస్తున్నారు. దీనితో శుద్ధమైన అద్వైతమేదో తెలియకుండా పోతున్నది.

కాగా అలాటి శుద్ధమైన అద్వైత సంప్రదాయమింకా అడుగంటి పోకుండా ఈనాటి వారికందివ్వాలని యధాశక్తిగా మాబోటి శిష్య పరమాణువుల మిప్పటికీ మాప్రయత్నం సాగిస్తూ ఉన్నాము. జగద్గురు మహోపదేశం లాంటి తత్త్వసాహిత్య రచనలే గాక భారత భాగవతాది సాహిత్య గ్రంధాలకు ముడిపెట్టి అద్వైత ఙ్ఞానమందిస్తూ సాహిత్య తత్త్వాన్ని విప్పి చెప్పే గ్రంధాలు చాలా వెలువరించాను. అంతే గాక ఎన్నో పట్టణాలలో అద్వైత తత్త్వ జిఙ్ఞాసువు లెందరికో అద్వైత భాష్య ప్రవచనం ఎన్నో సంవత్సరాల నుంచీ చేస్తూ వస్తున్నాను. ఇప్పటికే ఎన్నోవందల సీడీలు క్యాసెట్లు తయారయి ఉన్నాయి. ఎందరో ప్రపంచ వ్యాప్తంగా శ్రవణం చేస్తూ ఉన్నారు కూడా. 'స్వయంతీర్ణః పరాంస్తారయతి' అన్నారు. మనం తరించి పదిమందిని తరింప చేయాలి. అదే ఉభయ తారకం. మానవ జీవితానికింత కన్నా కావలసిన పరమార్ధ మేమున్నది.

సర్వేజనాః సుఖినోభవంతు

***