#
Back

Page 2

అద్వైత ప్రశ్నావళి

46. గుర్తించిన తర్వాత అంతకు ముందున్న జ్ఞాన, జ్ఞేయాలు ఏమవుతాయి? త్రోసేయాలా? కలుపుకోవాలా?

47. కలుపుకుంటే యిక ద్వైతం లేదు కదా! వ్యవహారమెలా సాగలి? స్వారి

48. జోడు గుర్రాల ప్రతి క్షణమూ సంభవమా?

49. అవస్ధాత్రయమడ్డు పడదా? దానికేమిటి పరిష్కారం?

50. శరీరమన: ప్రాణాలనే ఉపాధులను వదిలేసి నేను స్వతంత్రంగా ఉండగలనా? ఉంటే దానికేమిటి ఆధారం?

51. అద్వైతంలో పుణ్యపాపాలు, జనన మరణాలు ఇహ పరాలు ఇలాటి ప్రసక్తి ఎందుకు వచ్చింది? అవి అసలు ఉన్నవా? లేదా?

52. లేకుంటే కర్మకాండ కర్ధమేమి? ఉంటే జ్ఞానకాండకేమిటర్ధం?

53. వ్యవహారాన్ని కాదనకుండా పారమార్ధికాన్ని ఎలా సమర్ధించటం?

54. మరణమజ్ఞానికే గాక జ్ఞానికి కూడ తప్పదన్నప్పుడు ఇక మోక్షమనే దానికి అర్ధమేమిటి? మరణమే మోక్షమనవచ్చు కదా?

55. "ఎప్పుడు మనం పరమాత్మ స్వరూపులమే" అయినపుడీ జీవభావమెలా ఏర్పడింది?

56. అఖండమైన జ్ఞానంలో అజ్ఞానమెలా ప్రవేశించింది?

57. ప్రవేసించిందంటామా? అది అద్వైతానికే విరుద్ధం. లేదంటావా? మన అనుభవానికె విరుద్ధం ?

58. అజ్ఞానమిక్కడిదనే ప్రశ్నే లేదు. జ్ఞానం ఉదయిస్తే చాలు ఆ ప్రశ్నే ఉదయించదంటారా?

59. జ్ఞానం ఉదయించకముందు అంటే సచ్చిత్తులు నీకు తెలియకముందు వస్తుసిద్ధంగా ఉంది కదా! అది అజ్ఞాతమెలా అయిందని మరల ప్రశ్న?

60. కాలేదు. అయినట్లు భాసిస్తున్నదంటారా? ఆభాసించటం దానికా? మనకా? మనమూ లేము అదా అఖండము ఇక భాసించడమెలా సంభవం?

61. అంతే కాదు రేపు కష్టపడి మనం మోక్షం సంపాదించినా మరలా సంసారంలో పడమనే ఏమిటి గ్యారంటీ? అజ్ఞానం వల్లనే కదా ఇంతకు ముందు కూడ వచ్చి పడ్డాము. అది అప్పుడూ మనలను వదలి పెట్టదు కదా?

62. ఇది కూడ వాస్తవమే. కేవలాభాసే మన భ్రాంతేనంటారా? ఇది ప్రశ్నకు సమాధానం చెప్పలేక తప్పించుకోవటమేమొ?

63. ఆత్మ, అనాత్మ అంటే ఏమిటి? రెండింటిలో ఆత్మ వాస్తవం, అనాత్మ వాస్తవం కాదు ఆభాస అని ఎలా చెప్పగలవు?

64. జీవుడు, జగత్తు, ఈశ్వరుడు ఇవి మూడూ ఆభాసా? వాస్తవమా? ఆభాస అని చెబితే ఏమిటి లాభం? వాస్తవమంటే ఏమిటి నష్టం?

65. ఆత్మ వాస్తవమైతే నిద్రలో, కోమాలో, మరణంలో ఆచూకీ లేకుండా ఎలా పోతున్నది? అలా పోయేది విశేషాత్మ కాని, సామాన్యాత్మ కాదంటారా? నేననే జ్ఞానమే కదా ఆత్మంటే నిరాకారమైన జ్ఞానంలో విభేదమెలా ఏర్పడింది?

66. శరీరాదులతో మమేకమవ్వటమే దానికి కారణమంటామా? అయితే అలా బందీ అయిన విశేషాత్మ దానికతీతమైన సామాన్యాత్మనెలా అందుకోగలదు?

67. అందుకోలేదంటావా, జీవిత సమస్యకు పరిష్కారమే లేదు? అందుకోగలదంటావా, అదెలా సాధ్యం? దానికేమిటి మార్గం?

68. జీవిత సమస్య మరణమే కదా! అది విశేషాత్మకు వుండి సామాన్యాత్మకు ఎలా రాకుండా పోతుంది?

69. ఈ విశేషాత్మ ఉన్నపుడు కూడ సామాన్యాత్మ ఉన్నది కదా? అదే నా స్వరూపమిది కాదని ఎందుకు గుర్తించలేక పోతున్నారు మానవులు?

70. దానికి వీడి అజ్ఞానమే కారణమంటావా? అజ్ఞానం వల్ల జీవుడు తయారైనాడా? జీవుడు తయారైతే వాడికజ్ఞానమా? ఏది ముందో ఎలా నిర్ణయించగలవు?

71. అసలు జ్ఞానస్వరూపమైన ఆత్మకజ్ఞానమెలా ఏర్పడింది? ఏర్పడితే కాదా ఈ ఆత్మ భేదం చెప్పవలసింది?

72. ఇప్పుడు విశేష రూపమైన ఆత్మ సామాన్యాత్మగా కావాలంటే కొత్తగా మారాలా అంతకు ముందే అయి ఉన్నదా? అయి ఉంటే ఎందుకు మనకయినట్లు అనుభవం లేదు? కొత్తగా కావాలంటే ఎలా కావాలి? దాని కేమిటి మార్గం?

73. అది ఒక ప్రయత్నం కదా! ఆ ప్రయత్నమేమిటి? కర్మా? ఉపాసనా? యోగమా? జ్ఞానమా? కర్మాదులేవీ కావు జ్ఞానమేనని ఎలా సమరిధించగలవు?

74. జ్ఞానమంటే ఏమిటి? నేనా సామాన్యమేనని భావంచడం కదా? అలా భావించగనే అది అయిపోతుందా? ఈ జీవుడు మనసులో భావించినంతమాత్రాన అది అనుభవమెలా ఔతుంది?

75. ఒక వేళ అది అనుభవానికి వచ్చిందనుకో! అప్పుడు దేహంతో వాడికి సంబంధం ఉంటుందా? లేదా? లేదంటే దేహం దాటి బయట ఉండాలి. వాడు ఉండగలడా? క్షుత్పిపాసల మాటేమిటి? అవి అనుభవానికి రావా?

76. అంతేకాదు శరీరాదులతోబాటు బాహ్యమైన బంధు మిత్రాదులు, వస్తు వాహనాదులు వీటి మాటేమిటి? ఇవన్నీ వాడికి కనపడతాయా? లేదా? లేదంటే అది అనుభవానికే విరుద్ధం. ఉన్నాయంటే సర్వమూ ఆత్మ స్వరూపమనే అద్వైత సిద్ధాంతమెలా చెల్లుతుంది?

77. అసలాత్మ శరీరాన్ని వదలి బయటకు రావటమెలా సంభవం? మానసికమా? అది వాస్తవంగానా? మానసికమే అయితే పరిష్కారం కూడ మానసికమే. వాస్తవంగా ఏర్పడదు. అలా కాక వాస్తవమే అయితే ఇక ఈ ప్రాణము మనస్సూ రెండూ త్రోసి పుచ్చి నీవు నీవుగా బయటకు రావాలి. రాగలవా? వస్తే నీకు ప్రాణం లేదు. తెలివి లేదు. ఎక్కడ ఉండగలవు? ఎలా ఉండగలవు?

78. ఇంతకు ముందున్న శరీరము, ప్రాణము, మనస్సు బదులు నీకు శరీరమేది? ప్రాణమేది? మనస్సేది? అవి లేకుండా నేనున్నాననిగాని, ఉన్నట్లు తెలుసుననిగాని, ఫలానా విధంగా ఉన్నాననిగాని అనుభవమెలా ఏర్పడుతుంది?

79. పైగా ఇదంతా సిద్దమే గాని, క్రొత్తగా సాధించేది కాదని గదా సిద్ధాంతం చేశాము. అలాటప్పుడది పూర్వమే మనకు దృష్టమై ఉండాలి కదా. ఇక ప్రయత్నమెందుకు చెప్పవలసి వచ్చింది?

80. అలా దృష్టం కాని వాడికే చెప్పాము ప్రయత్నం అయిన వాడికి కాదంటారా? అయిన వాడెవడు? వాడు అయ్యానని మనకు చెప్పాడా? లేక మనమూరకబుద్ధిబలంతో ఊహిస్తున్నామా?

80. అలా దృష్టం కాని వాడికే చెప్పాము ప్రయత్నం అయిన వాడికి కాదంటారా? అయిన వాడెవడు? వాడు అయ్యానని మనకు చెప్పాడా? లేక మనమూరకబుద్ధిబలంతో ఊహిస్తున్నామా?

81. అంతే కాదు. వారిలో ఒక ఆత్మ, మనలో ఒక ఆత్మ లేదు కదా! ఆత్మ అనేది అఖండంగా ఒకటే కదా అలాటప్పుడు ఒకడు బద్ధుడు ఒకడు సాధకుడు అనే తేడా ఎలా ఏర్పడింది?

82. కాకపోయినా ఏమి తెలియని లౌకుకుడెలా మరణిస్తున్నాడో సాధకుడు, సిద్ధుడు కూడ అలా మరణించడం చూస్తున్నాము కదా! మరణమనే సమస్య ఎవరికీ తప్పనప్పుడు యిక అద్వైత జ్ఞానం పరిష్కారమెలా అయింది?

83. అలాటప్పుడు మరణం వరకే ఈ మల్లగుల్లాలు. మరణంలో అన్ని సమస్యలు ఎలాగూ పరిష్కారమౌతాయి గదా! ఇక ఎందుకీ అద్వైత సిద్ధాంతం అని ఎందుకు అనుకోరాదు?

84. మరణమే సమస్యకు పరిష్కారం కాదని, మరణానంతరం కూడ సమస్య ఉంటుందని, ఎలా నిరూపించగలవు? జన్మాంతరాలంటావా? దానికి ప్రమాణమేమిటి? సృష్టిలో వైషమ్యనైర్ఘుణ్యాలంటావా? అది ఈ సృష్టిలో సహజమేనని ఎందుకనుకోరాదు?

85. కాదు. అకృతాగమ, కృత విప్రణాశ దోషప్రసక్తి వచ్చి పడుతుందంటావా? అది కూడ నీ బుద్ధి కల్పితమే కావచ్చు కదా?

86. అసలా సర్వాత్మ భావం కూడ బుద్ధి కల్పితమే ఎందుకు కాకూడదు. అది ఒకటి ఉందని బుద్ధేగదా చెబుతున్నది?

87. కనుక మానవుని బుద్ధే ఫైనల్. దానికతీతంగా ఏది లేదు. దానికతీతంగా ఒకే ఆత్మ ఉన్నది. దానికేసమస్యా లేదనేది బుద్ధికి కలిగిన ఆలోచనే. తనకొక శరీర ప్రాణాదులు చుట్టూ ఒక ప్రపంచం ఉన్నాయనేదీ బుద్ధి చెబుతున్నదే. చివరకు జీవితంలో కష్టసుఖాలననుభవిస్తున్నదీ బుద్ధే రేపు శరీరాన్ని ఇక్కడే వదిలేసి ప్రాణంతోబాటు లయమైపోయేది బుద్ధేనని సిద్ధాంతం చేస్తే సరిపోలేదా అప్పటికీ జీవితమే అన్ని సమస్యలకు ఆలవాలం. మరణమే అన్నిటికీ ఆఖరి పరిష్కారమనే భౌతికవాదమే సిద్ధాంతమని ఎందుకు వప్పుకోరాదు. ఒప్పుకుంటే వచ్చిన ప్రమాదమేమి?

End