ధ్యానం
మానవుడు నిత్యమూ తన మనసులో స్మరించవలసింది - ధ్యానించవలసింది ఏమిటని ప్రశ్న. కళ్లు మూసినా తెరచినా కనిపించేది మనకీ ప్రపంచమే. కాబట్టి అందులో విషయాలే మనసుకు వస్తుంటాయి. వీటిని గుర్చే ఆలోచిస్తుంటాము. అందులోనూ మనకు కొన్ని ఇష్టమైనవైతే కొన్ని ఇష్టం లేనివి. ఇష్టం లేని వాటిని పరిహరిస్తూ ఇష్టమున్న వాటిని గురించే ధ్యానిస్తుంటాము. ఇదే సహజంగా ప్రతి మానవుడు చేస్తున్న పని. పగలంతా మెలుకువగా ఉన్నంత వరకూ ఇదే. రాత్రి స్వప్నంలోనే మనమేదీ ఆలోచించనిది. ఆలోచించకున్నా ఈ ఆలోచనల సంస్కారాలే అక్కడా పనిచేస్తూ మనలను వెంటాడుతుంటాయి. మొత్తంమీద ప్రాపంచిక విషయాలతోనే నిండి నిత్యమూ సతమతవుతూంటాయి మానవుడి మనోవ్యాపారలన్నీ. అయితే ఈ ఆలోచనల వల్ల ఏమైనా సుఖమా శాంతా అని చూస్తే ఏదీ లేదు. లేదని పెద్దలు చెప్పటమే గాదు. ఆబాలగోపాలమూ అందరికీ అనుభవసిధ్ధమే. శాంతి సౌఖ్యాలకు నోచుకోనప్పుడీ ఆలోచనలెన్నిపెట్టుకొని ఏమి ప్రయోజనం. మానవుడెప్పుడూ కోరుకొనేది అవి రెండే గదా. మరి ఎలా సిధ్ధిస్తాయవి. దేనివల్ల సిధ్ధిస్తాయి. ప్రాపంచికం వల్ల కాదని ఎప్పుడన్నామో ఇక పారమార్ధికం వల్లనే కావాలది. ఇది ఈ ప్రాపంచక పదార్ధాలన్నింటినీ వ్యాపించిన ఒక మహాచైతన్యం. నిరాకారమైన దానివల్లనే ఈ ఆకారలన్నీ ఏర్పడుతున్నాయి. నిశ్చలమైన దాని వల్లనే ఇవన్నీ ఇలా చలిస్తున్నాయి. సర్వవ్యాపకమైన దాని భంగిమలే ఈ పరిమితమైన విశేషాలన్నీ. కాబట్టి దాన్ని గురించే ఎప్పుడూ మనం ధ్యానించవలసింది. ఆత్మ చైతన్యంతో సంబంధమే నిజమైన జీవితం మానవుడికి. అనాత్మ ప్రపంచ సాంగత్యమే మరణం. ఆత్మ ధ్యానంలో ఉన్న మానవుడు మిగతా మానవుల మధ్య మృతకళేబరాల మధ్య ఒక కాటి కాపరిలాగా జీవుస్తుంటాడని వాక్రుచ్చారు పెద్దలు. అయితే ఏమిటీ ఆత్మ ధ్యానము. అది ఎలా చేయాలని ప్రశ్న. నాలుగు భూమికలున్నా యిందులో. మొదటిది నోటితో ఏదో జపిస్తూ కీర్తిస్తూ కూచోటం. ఇది నోటి వరకే. మనసు మీద పని చేయదు దాని ప్రభావం. మనసు ఏ భావమూ లేక స్తబ్ధంగానే ఉండిపోతుంది. అయితే ఎంతవరకంటే పిచ్చి పిచ్చి ప్రసంగాలతో కాలం వృధా పుచ్చక దైవప్రార్ధన చేస్తూ పోవటం కొంచెం మేలు. పోతే రెండవది నోటితో అనే దాని భావం మనసులో ప్రవేశించటం. అంటే శబ్దాన్ని దాటి అర్ధం దగ్గరికి వచ్చామన్నమాట. కాని అంతవరకే అది. మనసులో ప్రవేశించినా నిలకడగా ఉండదది. మెరుపులాగా వస్తూపోతూ ఉంటుంది. పోతే మూడవది పరమాత్మ రూపం బాగా మనసులో నాటుకొని కదలకుండా నిలచి ఉండటం. ఎంతగా నిలుస్తుందంటే మిగతా ప్రాపంచిక విషయాల మీదికి మరలా దాన్ని త్రిప్పాలంటే బలవంతంగానే త్రిప్పాల్సివస్తుంది. రెండవదానికిది కేవలం ప్రతి ద్వంద్వి అయిన భూమిక. పోతే ఇక నాలుగవది ఆఖరిది ఏమంటే మనసులో భగవద్రూపాన్ని గూర్చిన ఆలోచన గాదు. భగవత్తత్వమే నిలచి ఉండాలి. ప్రపంచమూ - భగవంతుడూ - దాన్ని గూర్చిన ఆలోచనా - అన్నీ కలసి భగవత్స్వరూపంగానే అనుభవానికి రావాలి సాధకుడికి. అది కూడా తనకు భిన్నంగా కాక తన ఆత్మ స్వరూపంగానే సాక్షాత్కరించాలి. నేనొక ధ్యాతను - నాకొక ధ్యేయమైన పదార్ధముంది - దాన్ని గూర్చే ధ్యానిస్తున్నాననే భావమే ఉండదప్పుడు. ధ్యాతా నారాయణః ధ్యానం నారాయణః -- అన్నట్టు అంతా ఆత్మ స్వరూపమే. ఇదే ధ్యానానికి పరాకాష్ఠ.
***