#


Index

జననము - మరణము

  మానవుడు పుట్టినప్పటి నుంచీ అతని కెదురైన సమస్య ఇదే. అప్పటి నుంచి ఇప్పటి దాకా ఆలోచిస్తూనే ఉన్నాడు దీన్ని. ఆలోచించేవాడీ సృష్టిలో ఒక్క మానవుడే. మనస్సున్న వాడు గదా మానవుడంటే. మనసుకుండే లక్షణం ఆలోచించటమే. ఎన్నో ఆలోచించాడు అన్వేషించాడు పరిష్కరించాడు మానవుడు. అయితే అన్నీ ఒక ఎత్తు. ఇది ఒక ఎత్తు. ఆలోచనకే అందనిదీ సమస్య. ఉపనిషత్తులే ఏకరువు పెడుతున్నాయి. నచికేతుడనే కుర్రవాడు యమలోకానికి వెళ్ళి యముణ్ణి నిలదీసి అడిగాడట పుట్టుకేమిటి చావేమిటి చెప్పమని. కఠోపనిషత్తులో చర్చించిన విషయమంతా ఇదే. ఇది చాల దన్నట్టు భారతంలో సనత్సుజాతీయ మంతా దీన్నే చిలువలు పలువలు పెట్టి వర్ణించింది. అసలు ఛాందోగ్యంలో బృహదారణ్యకంలో మృత్యు విచారమెంతో దూరం చర్చించబడింది. ఆ మాటకు వస్తే భగవద్గీత ఈ సమస్యను పరిష్కరించటానికే గదా అవతరించింది.

  ఇంతకూ ఎందరెన్ని విధాల విచారిస్తూ వచ్చినా సమస్య సమస్యే ఇప్పటికీ. మానవుడీ జన్మించట మేమిటి. మరణించటమేమిటి. జనన మరణాలయినా మనకు కనిపిస్తున్నాయి. చూస్తున్నాము. కాని మరణించిన తరువాత ఏమి జరుగుతున్నదో మనమేమయి పోతామో అసలే అంతు పట్టటం లేదు. మరి ఇంతేనా ఇది దీనికి పరిష్కారమే లేదా అంటే నూటికి తొంభై తొమ్మిది మతాలు చేతులెత్తాయి. కాని ఒకే మతం మాత్ర మలాకాక ధైర్యంగా ఎదుర్కొని తేల్చివేసిందీ విషయం. అదేదో గాదు.

Page 90