అవి నామరూపా లన్నింటినీ లయం చేసుకొని నిరాకారంగానే శేషించిన భావాలు గనుక లింగరూపం. రూపంగాని రూపమిది. శివలింగాని కిప్పుడు రూపమేముంది. శివతత్త్వాని కాది మధ్యాంతాలు లేవని చెప్పటానికే దాన్ని లింగరూపంగా భావన చేశారు మన పెద్దలు. లింగ మండాకారం. దానికేది మొదలు ఏది తుద అని నిర్ణయించలేము. భగవత్తత్త్వ మిలాంటిదే కదా. నిరాకార మైనప్పుడే ఆద్యంత రహిత మౌతుంది. అప్పుడే అది శివ మౌతుంది.
అలా కాక సాకారమని భావించినా శివమే అది. అప్పుడది అమూర్తమైన లింగం కాదు. మూర్తమైన శివ విగ్రహం. అష్టమూర్తి అదే. ఏమిటా అష్టమూర్తులు పృధి వ్యాదులైన పంచభూతాలు బాహ్యమైన రూపమైతే - మనో బుధ్యహంకారాలు మూడూ ఆంతరమైన జీవభావం. ఈ జీవ జగత్తులు రెండూ కలిసి అష్టమూర్తులు. ఇవి ఆ పరమాత్మ విగ్రహంలోనే లీనమై అందులో ఏకమై ఉన్నాయని భావం. ఆయన భస్మానులేపనం పృధివికి గంగాజటా జూటం జలానికి- ఫాలనేత్రం తేజస్సుకు - నాగభూషణత్వం వాయువుకు - దిగంబరత్వం ఆకాశానికి సంకేతమైతే - చంద్రశేఖరత్వం మనస్సుకు - వృషభ వాహనం బుద్ధికి గజచర్మధారణ మహంకారానికి చిహ్నాలు. మరి త్రిశూల ధారణం త్రిగుణాలు తన కధీనమై యున్నాయని తాను త్రిగుణా తీతుడని చెప్పటమే. పోతే అమ్మవారు శరీరాన్నే పంచుకొని ఉందంటే ఏమిటర్ధం. చిద్రూపం శివతత్త్వమైతే - సద్రూపం శక్తి తత్త్వం. సచ్చిత్తు ల వినాభూతమైనవని చూపటమే అది. దానికి రూపకల్పనమే ఆయన అర్ధనారీశ్వరత్వం. ఇది పూర్ణరూపంలో శివశక్తులైతే - అపూర్ణ రూపంలో జీవతత్త్వం. మనలో అపూర్ణ రూపంగా ఉన్న శివశక్తులే మనః ప్రాణాలు.
Page 84