#


Index

  కాబట్టి చిద్విశేషం కాదిది. చిత్సామాన్యం. అలాగే ఫలానాగా ఉండడం కాదు కాబట్టి సద్విశేషం కాదు. సత్సామాన్యం, మూడింటిని వ్యాపించిన సామాన్యం గాబట్టి దీనికి మహా సామాన్యమని పేరు పెట్టారు శాస్త్రజ్ఞులు. దీనికే ఆత్మ అని కూడా నామాంతరం. సచ్చిద్రూపమిది. ఇందులోనే జీవ జగదీశ్వరులనే విశేషాలు మూడూ తరంగ బుద్బుద ఫేనాలు సముద్రంలో మాదిరి చేరి ఏకమై పోతాయి. కాబట్టి ఇక అపరిపూర్ణమనే గంధం కూడా లేదు. అంతా గలిసి ఏకైకమైన పరిపూర్ణతత్త్వం.

  ఇది మనకు లభిస్తే చాలు. అదే మనకు పట్టే యోగం. సామాన్య విశేషాలు రెండూ కలిసి ఏకమైన దశ కాబట్టి అదే సమత్వం. ఈ దృష్టితో ఏ పని సాగించినా అది బంధకం కాదు కాబట్టి అదే కర్మసు కౌశలం. ఇందులో ఇక విశేషాల తాలూకు వృత్తులన్నీ వాటి పాటికవే తొలగిపోతాయి. కాబట్టి చిత్తవృత్తి నిరోధమూ ఇదే. ఆఖరుకిది పరోక్షంగా గ్రహిస్తే శాస్త్రజ్ఞానం. అపరోక్షంగా మారితే స్వానుభవం. ఇలాంటి పూర్ణమైన ఆత్మానుభవంలో ఆనాత్మ రూపమైన అనర్ధం లేదు కాబట్టి ఇదే పురుషార్ధం కూడా.

Page 82