అదేదో వ్యష్టి రూపంగా కనిపించే ఒక విగ్రహమని చూడరాదు. వ్యష్టి రూపుడైన యీ జీవుడి మనో భావాల మేరకే దించి చూడరాదు కూడా. అలా చూస్తూ పోతే ఆ మహాబల సంపత్తికి దూరమై పోతాము మనం. సమష్టి భావనే బలమిస్తుంది. కాని వ్యష్టి భావన యివ్వదు. అంతకంతకు బలాన్ని కోలుపోతాడు మానవుడు. అలాంటి దుర్బల చిత్తంతో ఏది సంకల్పించినా అది నెరవేరదు. చేసినా అది ఫలించదు. అడుగడుగునా విఘ్నాలు అడ్డు తగులుతాయి. అప్పుడీ గణం మనపాలిటికి ప్రమథమై కూచుంటుంది. నిరంతరమూ మథించేదేదో అది ప్రమథం. ప్రమధ గణాలివేయీ భూత భౌతికాలు :- యీ దేహేంద్రియాలు. వ్యష్టి బలాన్నే బలమని నమ్ముకుంటే వచ్చే ప్రమాదమిది. విఘ్నేశ్వరుడు మన కార్యాలకు విఘ్న మాపాదిస్తాడని చెప్పేమాట కిదీ అర్ధం. అలా కాక సమష్టి రూపమైన ఆ దేవతనే నమ్మి అందులోనే వ్యష్టిని లయం చేసుకొని ఆ భావనతో దర్శిస్తే ప్రమథం కాదప్పుడు గణం మనకు ప్రథమ మౌతుంది. గణాలకు మనం ప్రాథమ్యం వహించి గణపతి భావాన్ని పొందగలమని భావం. పొందాలంటే అలా పొందే బుద్ధి ఏర్పడాలి సాధకుడికి. బుద్ధి ఏర్పడితే అదే సిద్ధిని ప్రసాదిస్తుంది. “యద్భావ స్తద్భవతి” బుద్ధిని పట్టి సిద్ధి. వినాయకునికి బుద్ధి, సిద్ధి భార్యలనే మాటలోని ఆంతర్యమిదే.
గణపతి నిలాటి ఆధ్యాత్మిక దృష్టితో చూస్తే అది సాక్షాత్తు భగవత్తత్త్వమే. కనుకనే సకల జనారాధ్యుడా దేవుడు. సర్వసిద్ధి ప్రదాయకు డయ్యాడు. దేవీ నవరాత్రాల లాగా గణపతి నవరాత్రాలు జరుపుకుంటున్నాము మనం. అక్కడ దేవి నవావరణ రూపిణి గనుక తొమ్మిది రోజులు తొమ్మిది రూపాలతో ఆమెను సేవిస్తాము. మంచిదే. మరి గణపతి
Page 70