#


Index

26. ఇలా చెబుతూ పోతే ఎంతైనా చెప్పవచ్చు ఈ అభినివేశాన్ని గూర్చి. మానవ సహజమైన భావాలన్నీ అభినివేశ దాయకములే. అలంకారికులు చిత్తవృత్తులని ఉదాహరించిన వివే. అవి ముప్పదిమూడనివారు నిరూపించారేగాని అవి అంతమాత్రమే అనుకోరాదు. 33 అనే సంఖ్యను వారు కేవలమూ For Example ఉపలక్షణంగా భావించి ఉంటారు. ఎలాగైతే నివిదలలో దేవతల సంఖ్య ముప్పదిమూడని పేర్కొన్నా ప్రాకామ్య సిద్ధిబలం చేత 33 కోట్లు రూపా లెత్తగలరో అలాగే ఈ భావాలు 33 అయినా ఆవాపోద్వాపాలను బట్టి 33 కోట్లు కావచ్చు. ఒక్క మాటలో చెబితే అనంతములూ విచిత్రములూ. సూక్ష్మాతి సూక్ష్మములైన ఆ దారులన్నీ తిరిగి చూడాలే గాని మాటలతో వర్ణించేవి గావు. మహాకవులంతా అలా యధేచ్ఛగా సంచరించిన వారే. రవి గాంచనిచో కవి గాంచునే గదా. మామూలు వాడూహించని అందాలెన్నో చిందుతుంటాయి వారి వర్ణనలలో. చూడండి. మహాభారతంలో ధర్మరాజంటే మనకండ్ల కెంతో సాత్త్వికుడుగా సౌమ్యుడుగా కనిపిస్తుంటాడు. అదే భీముడనే పేరు వింటూనే అలా కనిపించడు. పెద్దపెద్ద మీసాలు మిడిగ్రుడ్లు పెట్టుకొని గదాదండ మొకటి చేత పట్టుకొని భీకరంగా వచ్చి కండ్ల ముందు నిలుచుంటాడు. మరి అలాంటి పాత్రల స్వరూపాన్ని ఆయాసందర్భాల కనుగుణంగా మార్పిడి చేసి మహాకవులు వర్ణిస్తుంటే అతడేనా ఇతడని మనకాశ్చర్యం వేస్తుంది.

Page 41