#


Index

20. పోతే ఇంతకన్నా పయినున్న రెండవ భూమిక అభినివేశం Engrossment. బాహ్యమైనది అభిరుచి అయితే ఆభ్యంతరమైన దభినివేశం. బాహ్య ప్రకృతి కంటే అంతః ప్రకృతి మానవుడి కింకా సన్నిహితం కదా. అది జీవితాని కుద్దీపకమైతే ఇది కేవల మతని జీవితమే. జీవిత మంటే అది శారీరకమూ కావచ్చు - వాచికమూ కావచ్చు - మానసికమూ కావచ్చు. మూడింటి సమాహారమే జీవిత మంటే. అందులో శారీరకమైతే అవి చేష్టలు. వాచికమైతే మాటలు సంభాషణలు - మరి మానసమైతే భావాలు ఆలోచనలు ఆవేశాలు - అనుభూతులు - ఇలా ఎన్నో. వీటినే అలంకారికులు అనుభావాలనీ - సంచారి భావాలనీ సాత్వికభావాలనీ పేర్లు పెట్టి వ్యవహరించారు. వీటి కాలంబనం విభావం. అది మానవుడే. వాడికి వెలపల ఉన్న ప్రకృతీ ఒక విభావమే. దాని కుద్దీపన మని పేరు. మొత్తానికీ ఉద్దీపనం మూలంగానైతేనేమి, సహజంగా నైతేనేమి. మానవుడికి ఏర్పడే ఈ అనుభవాదులున్నాయే అవే అసలు మానవతత్త్వం. మిగతాదంతా దానికి బాహిరమే. అంచేత బాహిరమైన దృశ్యాలను వర్ణించిన దానికంటే ఈ అంతస్తత్త్వాన్ని వర్ణించినప్పుడే సహృదయుడి మనస్సు ఎక్కువగా స్పందిస్తుంది - దీపిస్తుంది - ద్రవిస్తుంది - తాదాత్మ్వం చెందుతుంది. ఎందుకంటే అది మనదైతే ఇది కేవలం మనమే. అందుకే దీని నభినివేశ మన్నారు. బాగా లోపలికి దిగటమని అర్థం. జీవితంలోకి దిగిపోయి అందలి మాధుర్యాన్ని చవిచూచే అనుభూతి ఇందులోనే మనకెక్కువగా లభిస్తుంది.

Page 35