#


Index

దర్శనమే Vision కదా. కనుకనే నానృషిః కురుతే కావ్యమనే నానుడి ఏర్పడింది లోకంలో. ఇలాంటి ఋషికల్పులైన మహాకవు లెప్పుడూ దర్శిస్తూనే ఉంటారా తత్త్వాన్ని. తాము దర్శించిన ఆ సత్యాన్నే మరలా తమ కావ్య నేపథ్యం మీద చిత్రించి ఈ లోకానికి ప్రదర్శిస్తుంటారు. ఈ ప్రదర్శన వ్యాపారం కూడా ఒకటి గాదు. బాగా పరిశీలించి చూస్తే ఇందులో నాలుగంతస్తులు గోచరిస్తాయి. అవి ఒక దాని కంటే ఒకటి ఉన్నతమూ ఊర్ధ్వాభి ముఖమూ. పట్టుకొని పోవాలే గాని సహృదయుణ్ణి అంతకంత కవి ఊర్ధ్వముఖం గానే సాగించుకొని పోతాయి. చిట్ట చివరకు జీవిత గౌరీ శిఖరం మీదనే తీసుకొని పోయి నిలుపుతాయి.

17. భూమికా చతుష్టయంలో మొట్టమొదటి భూమిక పేరు అభిరుచి Taste. అంతవరకూ కేవల మీ ప్రాపంచిక జీవనం తోనే తృప్తి పడే మానవుణ్ణి సాహిత్య ప్రపంచం వైపు మళ్ళించాలంటే దాని పైన మొదట వాని కొక అభిరుచిని కల్పించాలి. ఆహారం మానవుడికి కావలసిందే అయినా అది రుచిగా ఉంటేగాని భుజించలేము. తోటి మానవులతో మాటాడటం కూడ అని వార్యమే గాని ఆ సంభాషణ వినాలని బుద్ధి పుట్టించాలే గాని కంపతొడుగులాగా శుష్కంగా సాగితే వినలేము. ఏ వ్యవహారమైనా లోకంలో మన మనస్సుకు రుచిస్తే గాని అందులో మనం ప్రవేశించబోము. సరిగా ఈ లోక వ్యవహారం లాంటిదే సాహిత్య వ్యవహారం కూడా. సాహిత్యం కూడా అన్నింటి కన్నా ముందు సహృదయుడి కిలాంటి ఒక అభిరుచి నందజేయాలి. అది ఒక ప్రరోచన. దాని చేత ప్రలోభితుడైన మానవుడు సాహిత్య క్షేత్రంలో తనపాటికి తానే ప్రవేశిస్తాడు.

Page 31