#


Index

సాహిత్య సౌరభము

1. సాహిత్య మనే మాట అటు శాస్త్రకోటినీ ఇటు కావ్య కోటినీ రెండింటినీ పరామర్శించే మాట. రాగా రాగా ఇది కావ్య శాఖకు మాత్రమే పరిమితమైనది. కనుక ఇప్పుడు సాహిత్య మని ఎవరెక్కడ ప్రయోగించినా దాని కర్థం కావ్య ప్రపంచమే గాని మరొకటి గాదు. Literature అనే ఇంగ్లీషు పదానికిది సబ్రహ్మచారి.

2.అసలు శాస్త్ర జగత్తుకూ - కావ్య జగత్తుకూ ఉత్తర దక్షిణ ధ్రువాలకున్నంత దూరమున్నది. కావ్య మనేది ఒక విలక్షణమైన సృష్టి, శాస్త్ర సృష్టి లాంటిది కాదది. శాస్త్రమేదైనా తీసుకొని చూడండి. అది మానవ జీవితం చుట్టూ ప్రదక్షిణం చేస్తుందే గాని జీవితాలయంలో ప్రవేశించదు. కావ్య మనేది అలా కాదు. అది సరాసరి జీవితంలోకి చొచ్చుకొని పోయి దాని లోతులనే స్పృశిస్తుంది. శాస్త్రానికి జీవితం చుట్టూ ఉండే లోకమే సామగ్రి అయితే కావ్యానికి జీవితమే సామగ్రి. అంతే కాదు. శాస్త్ర ప్రపంచ మొకవాస్తవాన్ని Fact చెప్పి ఊరకుంటుంది. మరి కావ్య మంతటితో నిలవదు. ఆ వాస్తవాలన్నిటికీ ఒక ఆదర్శాన్ని వెదకి పట్టుకొని దానితో వీటిని ముడిపెట్టటానికి యత్నిస్తుంది. అందుకే దీని నొక్క దానినే సాహిత్యమని పేర్కొన్నారు పెద్దలు.

3.ఆ మాటకు వస్తే ఒక శాస్త్రమే గాదు. మానవుడు గడించిన అన్ని జ్ఞానాలకూ మిన్న సాహిత్య జ్ఞానం. లోక జ్ఞానం శాస్త్ర జ్ఞానం కళా జ్ఞానం అని మూడు జ్ఞానాలు గదా మానవుడికున్నది. ఇందులో లోక జ్ఞానం మనకు మంచీ చెడ్డా అంతా కలగా పులగం

Page 17