అలా పట్టుకొంటే అది పోయిన బలం పుంజుకొని అసద్రూపమైన ఈ సమస్తాన్ని తనలోనే కలుపుకొని ఆత్మేమిటి అనాత్మేమిటి అంతా తన స్వరూపం గానే అనుసంధానం చేసుకోగలదు. ఎప్పటికీ అలాగే ఉండిపోగలదు. ఉంటే ఇక నాకూ నీకూ జననం లేదు. మరణం లేదు ఇహం లేదు. పరం లేదు. ఏదీ లేదు. నాకు నేనే. నాదీ నేనే. నేనూ నేనే. అనే అఖండాద్వయాత్మ భావం అనుక్షణమూ అనుభవానికి వస్తూ ఉంటుంది. దీనికే ఏకాత్మ భావమని, సర్వాత్మ భావమని పెద్దలు పెట్టిన పేరు. ఇది అందుకో గలిగితే జనన మరణాది జీవిత సమస్యలన్నింటికీ పరిష్కారం చేసుకొని సాధకులమైన మన మందరమూ ఈ జీవితంలోనే సిద్ధ పురుషులమై చివరకు మోక్ష సామ్రాజ్యానికి పట్టాభిషిక్తులం కాగలము.
★★★
Page 157