#


Index

  చంద్ర మండలానికి వెళ్ళి చూచి వచ్చాడొక అంతరిక్షగామి. అది వాడి అనుభవమే. మనకెవరికీ లేదా అనుభవం. అయినా ఎలా నమ్మావది. పదిమందీ చెప్పుకొంటుంటే విని నమ్ముతున్నావు. అలాగే పది మంది బ్రహ్మవేత్తలు చెబుతున్నారు. ఏమని. జీవన్ముక్తుడైన వాడు కూడా ఒక చిదాకాశంలో ఎప్పుడూ పయనిస్తుంటాడు. అక్కడే నిత్యమూ నివసిస్తుంటాడని. మరి ఇది కూడా నమ్మవలసిందే గదా.

  వాడెలా నివసించ గలిగాడా చిదాకాశంలో. చిదాకాశమే తన శరీరమని భావించి ఈ భౌతిక శరీరంలో నుంచి బదిలీ అయి అందులో ప్రవేశించాడు. క్రొత్తగా కూడా ప్రవేశించ నక్కర లేదు. చిదాకాశ మంటే ఆకాశం లాగా విస్తరించిన నీ నా జ్ఞానమే కదా. అది ఈ శరీరమే నేనను కొని ఇందులోనే కూచున్నా నీకిప్పుడూ సిద్ధంగానే ఉంది. నీవే అది అయినప్పుటికీ జ్ఞేయమైన ఈ శరీరమే నేనని చాలాకాలం నుంచీ అలవాటు పడ్డావు. కనుకనే ఇది వదిలేసి అది నేనని దానితో తాదాత్మ్యం చెందలేక పోతున్నావు.

  అందుకే నిది ధ్యాసనా రూపమైన అభ్యాసం చేయవలసి ఉంది మన మంతా. అభ్యాసం చేసే కొద్దీ శరీరాత్మ వాసన దూరమయి దానికి మారుగా చిదాత్మ వాసన దృఢమవుతూ వస్తుంది. ఇంకా ఒక మాటేమంటే జడమైన ఈ శరీర మసలు వస్తు రూపంగా లేదు కదా. ఆభాసే గదా ఇది. లేని ఆభాసే ఇంత బలంగా నిన్ను పట్టుకొంటే ఉన్న వస్తువు నీ చైతన్యం నిన్ను పట్టుకోక పోవటమేమిటి. అన్యాయం. ఎటువచ్చీ తగినంత శ్రద్ధ లేదు నీకు. "శ్రద్ధా వాన్ లభతే జ్ఞాన” మన్నారు. కాబట్టి నిద్ర అని, రోగమని, మరణమని, పునర్జన్మలని, ప్రతిలోమంగా నిన్ను చూచి భయపడటం మానేసి అనులోమంగా అన్ని దశలలోనూ నేను సద్రూపంగా, చిద్రూపంగా, ఉంటూనే ఉన్నానని నిన్ను నీవు గట్టిగా పట్టుకొని కూచో.

Page 156