#


Index

  అసలు పత్తా లేకుండా ఎగిరిపోయినా ఆశ్చర్యం లేదు. అంచేత మన పనులతో పాటు అది కూడా పాటించట మనేది పొసగదు. పోనీ పనులు మానుకొని చేద్దామంటే జీవిత అవసరాలకు స్వస్తి చెప్పి బ్రతకలేము. పనులు పూర్తి అయిన తరువాత సాగిద్దామా అంటే మళ్ళీ పనులు పడితే మాసిపోతుంది. అది కేవలం గజస్నానమే.

  మరి ఎలాగా పరిష్కారం. అందుకే అత్యవసరమైన పనులు మాత్రం పెట్టుకోమన్నారు శాస్త్రజ్ఞులు. 'యుక్త చేష్టస్య కర్మసు' అలాగైతే అవకాశ మంత కంతకు ఎక్కువగా దొరుకుతుంది. అప్పుడు బాగా అభ్యాసం చేస్తూ పోవచ్చు. అది బలం పుంజుకొని ఆ సంస్కారం పనులు పెట్టు కొన్నప్పుడు కూడా పనిచేస్తుంది. పనుల వల్ల కలిగే భారం దీని వల్ల తగ్గుతూ వస్తుంది. ఇదే ఉపాయం. వేరొకటి లేదు. కొంత కాలానికి జ్ఞానానుష్ఠానమూ జీవితావసరాలూ రెండూ పరస్పర విరోధం లేకుండా రాజీ పడి ఏక కాలంలో జోడు గుఱ్ఱాల లాగా దౌడు తీస్తూ పోతాయి. భయం లేదు. కనుక ఆత్మ వ్యవహారం లోక వ్యవహారాని కడ్డు తగలదు. ఇదీ దాని కడ్డు రాదు. సాధన చేసే వాడికి గాని ఈ రహస్యం తెలియదు.

  పోతే ఎలా చేయాలి సాధన అని అడిగితే చెబుతున్నాము. యోగుల లాగా కళ్ళు మూసుకొని చేసే సాధన కాదిది. ఉపాసకుల లాగా ఒక మంత్రమో దేవతనో పట్టుకొని కూచోటమూ కాదు. కర్మిష్ఠుల లాగా మొక్కుబడి తీర్చినట్టు ఆయా కర్మ లాయా సమయాలలో ఆచరించి మిగతా సమయ మంతా లోక వ్యాసంగంతో గడపట మంత కన్నా కాదు. మరేమంటారు. అవన్నీ ఏక దేశ దృష్టి. నేను వేరు ఈ చూచే జగత్తు వేరు ఆ ఈశ్వరు డెక్కడో ఉన్నాడు వాడు వేరు - ఏదో చేసి ఏదో అందుకోవాలనే భేద భావన వదల కుండా చేసే సాధనలు.

Page 150