#


Index

  ముందుకు పోతే ప్రయత్నం ఫలిస్తుంది. చివరకు మోక్షమనే మహాఫలాన్నే సాధకుడు చవి చూడగలడు. అయితే ప్రయత్న మన్నారు. ఎంత కాలం చేయాలది? ఎలా చేయాలి ? అన్ని పనులు మానుకొని అదే పట్టుకొని కూచోవాలా ? లేక మిగతా పనులు చేస్తూ ఇదీ చేయవచ్చా? అలా చేస్తూ పోతే ఎప్పటికి ఫలితమిస్తుంది. జీవితంలో ఇస్తుందా? లేక మరణానంతరమా. ఎలా ఉంటుందా ఫలితం ? అది మరణానికి ముందే కలిగితే మరణమెలా ప్రాప్తిస్తుంది ? అనంతరమైతే కలిగిందో లేదో నమ్మకమేమిటి - అని ప్రశ్న పరంపర ఎదురౌతుం దిప్పుడు.

  ఒక్కొక్కటి పరిశీలించి చూతాము. ఎంత కాలం చేయాలని గదా ప్రశ్న. “సతు దీర్ఘ కాల నైరంతర్య సత్కార సేవితో దృఢ భూమిః" అన్నాడు పతంజలి. ఇంత కాలమని పరిమితి లేదు. ఫలితాన్ని బట్టి ప్రయత్నం. వడ్ల దంపకం వంటిదని చెప్పాము. బియ్య మయ్యే వరకు ఎలా దంచుతూ పోవాలో అలాగే ఆత్మ దర్శన మయ్యే వరకు సాధనే. అది నైరంతర్యం. అంటే పది రోజులకో పది నెలలకో ఒక సారిగా కాక ప్రతి క్షణమూ కనీసం ప్రతి దినమూ సాగాలి. అలాగే మొక్కుబడి తీర్చినట్టుగా గాక ఇది మన జీవితమే నని సత్కార బుద్ధితో జరగాలి. అలా అయితేనే గట్టి పడుతుంది.

  అంతే కాదు. ప్రతి దినమూ కూడా దినమంతా మనది కాదు. స్వప్న సుషుప్తులు రెండూ ప్రారబ్ధాని కధీనం. ప్రయత్నాని కాస్కారం లేదక్కడ. పోతే ఇక జాగ్రత్తు. అందులోనూ రోగాలు రొష్టులు, పెండ్లిండ్లు, పేరంటాలు, ఇల్లు వాకిలి ఏర్పాట్లు చుట్ట పక్కాలు లోక వ్యవహారాలు ఎన్నో అవసరాలు ఏర్పడుతుంటాయి. అలాంటప్పుడీ ఆత్మాకార వృత్తినే పట్టుకొని కూచోలేము. జారిపోతుంటుంది.

Page 149