#


Index

  ప్రారబ్ధం మన ప్రయత్నాని కడ్డురాదు. ఎలాగంటే భూతానికి సంబంధించినది ప్రారబ్ధం. భవిష్యత్తుకు చెందినది ప్రయత్నం. అది అతీతమైతే ఇది వర్తమానం. జీవుడు భోక్తే గాక కర్త కూడా. భోక్త గనుక ప్రారబ్ధ ఫల మొకప్రక్క అనుభవిస్తుంటాడు. కర్త కనుక మరొక ప్రక్క ప్రయత్నం సాగిస్తుంటాడు. అలా కాకుంటే అసలీ ప్రారబ్ధ మెలా తయారయింది. ఒకప్పుడు మానవుడు చేస్తేనే కదా. కాబట్టి అనుభవించే గుణమెలా ఉందో చేసే లక్షణం కూడా ఉంది మనకు. రెండింటి సంగమ స్థానమే మన ఈ వర్తమాన జీవితం.

  అంచేత మనమిక బీద పలుకులు పలకరాదు. ప్రారబ్ధ ఫలానుభవం తప్పించుకొనే శక్తి లేదు మానవుడికి. కాని ప్రయత్నం చేసి జీవిత గమ్యాన్ని అందుకోటాని కెంతైనా ఉంది అవకాశం. గతం మన వశంలో లేకపోవచ్చు. భవిష్యత్తు అంతా మన కధీనమే. కనుక ప్రారబ్ధం కొద్దీ ఎప్పటికప్పుడు సుఖదుఃఖాదు లనుభవిస్తున్నా దానితో పాటు ఎప్పటికప్పుడు శ్రవణ మననాదులు కూడా ప్రయత్నంతో సాగించవచ్చు. ప్రారబ్ధ మింతకు ముందు చేసిన అప్పు. అనుభవిస్తే తీరిపోతుంది. ఎంతో కాలం బాధించదు. ప్రయత్న మలా కాదు. అది నిత్యమైన ఆత్మకు సంబంధించిన నిక్షేపం. తీరిపోయేది కాదిది. అక్షయంగా ఉండిపోయే ధనం.

  కాబట్టి ప్రారబ్దం మీద కాదు చూపు పెట్ట వలసింది. పెడితే అదే మనకొక ప్రారబ్ధ మౌతుంది. మరెక్కడ పెట్టాలి దృష్టి. ఆత్మ జ్ఞానం కోసం శక్తి వంచన లేకుండా ప్రయత్నం చేయటంలో మొదటిది ప్రతిలోమమైతే రెండవది అనులోమం. కనుక ఎంత చేస్తే అంత ఫలిత మిస్తుంది. ప్రారబ్ధం ఫలానుభవంతో సమసిపోయేదయితే ప్రయత్నం సమసిపోని ఫలానుభవం. కాబట్టి ఆత్మ సాధకుడిక వెనక్కు చూడకుండా ముందుకు దూసుకొని పోవటమే. వెనక్కు తిరిగితే ప్రారబ్ధమే కనిపిస్తుంది.

Page 148