#


Index

  ఇంత మాత్రమే అయితే నీకున్న ఘనత ఏమిటి ? నీ సోదరులైన జంతువు లకు కూడా ఉన్నాయి గదా ఈ లక్షణాలు. వాటి కన్నా ఎక్కువ అనిపించు కోవాలంటే నీ తత్త్వాన్ని ఇదమితమని గుర్తించాలి నీవు. నేనెవడనూ నా స్వరూపమేమి ? ఎక్కడ నుంచి వచ్చాను ? ఎక్కడికి వెళతాను. ఇక్కడకు వచ్చి ఈ సత్రంలో నివసించటంలో గల ఆంతర్యమేమిటి అసలు ఎవరు పంపారిక్కడికి ? పంపిన వాడి ఉద్దేశమేమిటి? బంధ మోక్షాలనే మాటల కర్ధమేమిటి అని విచారణ సాగించాలి మానవుడు.

  అసలింతకూ పశు మృగాదుల గుణాలు కూడా ఎందుకు నీలో జత చేసి సృష్టించాడో ఆపరమాత్మ నీవు బాగా అర్ధం చేసుకోవలసి ఉంది. అవి అహర్నిశలు నిన్ను తమకు బానిసను చేసుకొని నీ మీద దౌడు చేయటమా ? లేక నీవే వాటిని లొంగ దీసుకొని నీ సాధన మార్గంలో వాటిని పరికరాలుగా వాడుకోటమా ఏమిటి దీని తాత్పర్యం ? అది నీవు తేల్చుకోవలసిన మొదటి విషయం. నీ వీ సత్రంలో వచ్చి కాపురముండేదే నాలుగు రోజులు. తరువాత నీవెంతో చేయవలసి ఉంది ప్రయాణం. అలాంటప్పుడు వాటికి నీవు కాదు దాస్యం చేయవలసింది. వాటి చేతనే నీవు పనులు చేయించు కొనవలసి ఉంది. అది ఎలాగా అని అడగవచ్చు.

  మానవుడు తన స్వరూపాన్ని తాను గుర్తించటమే కదా జీవిత లక్ష్యం. మానవుడికున్నవి రెండే రెండు పదార్ధాలు. ఒకటి ఈ శరీరం. మరి ఒకటి ఇందులో దాగి ఉన్న ఒక విలువైన నిక్షేపం. దానికే ఆత్మ అని పేరు పెట్టారు. శరీరం లాగా అది పైకి కనిపించదు. మనో నేత్రంతో మాత్రమే దర్శించగలం. వాస్తవంలో అదే నీవనే పదార్ధం. పోతే దానికి విలక్షణంగా కనిపించే దంతా ఇక దాని పరివారమే.

Page 116